Novak Djokovic:డిసెంబరులో జకోవిచ్‌కు కరోనా!

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు జకోవిచ్‌ గత నెలలో కరోనా బారిన పడ్డాడని, అందుకే వైద్య పరమైన మినహాయింపు కోరాడని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అతని తరపు న్యాయవాదులు

Updated : 09 Jan 2022 06:59 IST

కోర్టుకు తెలిపిన న్యాయవాదులు

మెల్‌బోర్న్‌: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు జకోవిచ్‌ గత నెలలో కరోనా బారిన పడ్డాడని, అందుకే వైద్య పరమైన మినహాయింపు కోరాడని కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అతని తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నెల 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు వైద్య మినహాయింపు పొంది బుధవారం ఆ దేశంలో అడుగుపెట్టిన జకోను సరైన కారణాలు చూపలేదనే కారణంతో సరిహద్దు భద్రతా దళం అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా అతని వీసా రద్దు చేసి ఇమ్మిగ్రేషన్‌  అధికారుల నియంత్రణలోని హోటల్‌కు తరలించారు. దీంతో అతను ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై సోమవారం విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం అతని న్యాయవాదులు కోర్టుకు పత్రాలు అందజేశారు. ‘‘జకోవిచ్‌ గత నెలలో కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనాలంటే తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్‌ టీకా వేసుకోవాలనే నిబంధన నుంచి టెన్నిస్‌ ఆస్ట్రేలియా అతనికి మినహాయింపునిచ్చింది. ఇటీవల వైరస్‌ నుంచి కోలుకున్నాడనే కారణంతో ఆడేందుకు అనుమతినిచ్చింది. ఆస్ట్రేలియా హోం వ్యవహారాల విభాగం నుంచి తన ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవనే దస్త్రాన్ని అతను అందుకున్నాడు’’ అని న్యాయవాదులు ఆ పత్రాల్లో పేర్కొన్నారు. గత నెల 16న అతనికి పాజిటివ్‌గా తేలినట్లు ఆ మినహాయింపు ధ్రువపత్రంలో ఉంది. తనను ఆ హోటల్‌ నుంచి తరలించి.. ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని జకో కోరాడు. రెండు డోసుల టీకా వేసుకున్న ప్లేయర్లే టోర్నీలో పాల్గొనాలని నిర్వాహకులు నిబంధన విధించారు. గత ఆరు నెలల్లో కరోనా బారిన పడ్డాడనే కారణంతో జకోవిచ్‌కు విక్టోరియా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. కానీ సరిహద్దు భద్రతా దళం ఈ కారణం చెల్లదని భావించి అతణ్ని అడ్డుకుంది.

బయటకెలా వచ్చాడు: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో వైద్య మినహాయింపు కోసం గత నెల 16న తనకు కరోనా సోకిందని జకోవిచ్‌ తెలిపాడు. కానీ ఆ తర్వాత రోజే అతను బెల్‌గ్రేడ్‌లో యువ ఆటగాళ్లతో మాస్కు కూడా లేకుండా కనిపించాడు. దీంతో అతని వ్యవహార శైలిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. డిసెంబర్‌ 17న  జరిగిన ఓ కార్యక్రమంలో 2021 ఏడాదికి గాను ఉత్తమ యువ ఆటగాళ్లకు అతను అవార్డులు అందజేశాడని బెల్‌గ్రేడ్‌ టెన్నిస్‌ సమాఖ్య అప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. మరోవైపు డిసెంబర్‌ 16 రోజునే తన గౌరవార్థం సెర్బియా జాతీయ పోస్టల్‌ సేవ సంస్థ ముద్రించిన స్టంపులను ఆవిష్కరించే కార్యక్రమంలోనూ అతను పాల్గొన్నాడు. దీంతో కరోనా సోకిన వ్యక్తి బయటకు ఎలా వచ్చాడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన వీసా రద్దుపై కోర్టును ఆశ్రయించిన జకోవిచ్‌ ఈ కేసులో ఓడిపోతే.. టీకా మినహాయింపు కోరేందుకు అతను అవసరమైన పత్రాలు అందజేయాలేదనే నిబంధన ప్రకారం మూడేళ్ల పాటు అతనికి ఆస్ట్రేలియా ప్రవేశం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని