IND vs SA: కోహ్లి వస్తే విహారిపైనే వేటు

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సాధిస్తే హనుమ విహారి రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని భారత మాజీ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌

Updated : 09 Jan 2022 07:00 IST

జొహానెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సాధిస్తే హనుమ విహారి రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని భారత మాజీ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అన్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 40 పరుగులు చేసిన విహారి పునరాగమనంలో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు భారత్‌ తొలి టెస్టులో ఆడిన జట్టే బరిలో దిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సాధిస్తే విహారి రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చోక తప్పదు. గాయపడిన సిరాజ్‌ కోలుకోకపోయినా.. అతడి ఫిట్‌నెస్‌పై అనుమానం ఉన్నా మేనేజ్‌మెంట్‌ వేరే బౌలర్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అయిదు రోజుల పాటు సిరాజ్‌ ఆడాల్సి ఉంటుంది. కనీసం 15-20 ఓవర్లు వేయలేకపోతే అతడికి స్థానం దక్కకపోవచ్చు. అప్పుడు ఉమేశ్‌ యాదవ్‌ లేదా ఇషాంత్‌శర్మకు తుది జట్టులో చోటు లభిస్తుంది’’ అని సన్నీ చెప్పాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీలతో రాణించిన సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా, రహానెలపై మేనేజ్‌మెంట్‌ విశ్వాసం ఉంచొచ్చని గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘‘పుజారా, రహానెల రికార్డు, వారు జట్టుకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని మేనేజ్‌మెంట్‌ వారికి చాలా అవకాశాలు ఇచ్చింది. అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరూ గాడిలో పడ్డట్టు కనిపించారు. అంత త్వరగా వికెట్‌ పారేసుకోలేదు. మూడో టెస్టుకు వీరిని    కొనసాగించే అవకాశం ఉంది’’ అని సన్నీ చెప్పాడు. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు మంగళవారం ఆరంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని