IND vs SA: చరిత్రను మార్చే తరుణం

సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ గెలవని టీమ్‌ఇండియా.. ఎన్నో అంచనాలతో అడుగుపెట్టి తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంకేముంది.. ఇదే జోరుతో భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకుంటుందని.. దక్షిణాఫ్రికాను క్లీన్‌స్వీప్‌ కూడా చేస్తుందనే ఆశలు చిగురించాయి. రెండో టెస్టుకు కోహ్లి దూరమైనా.. జట్టు బలంగానే ఉంది కదా విజయాన్ని అందుకుంటుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రత్యర్థి పోరాటం ముందు తలవంచక

Updated : 11 Jan 2022 07:06 IST

దక్షిణాఫ్రికాతో నేటి నుంచి చివరి టెస్టు

‘తొలి’ సఫారీ సిరీస్‌పై భారత్‌ కన్ను

మధ్యాహ్నం 2 గంటల నుంచి

సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ గెలవని టీమ్‌ఇండియా.. ఎన్నో అంచనాలతో అడుగుపెట్టి తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇంకేముంది.. ఇదే జోరుతో భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకుంటుందని.. దక్షిణాఫ్రికాను క్లీన్‌స్వీప్‌ కూడా చేస్తుందనే ఆశలు చిగురించాయి. రెండో టెస్టుకు కోహ్లి దూరమైనా.. జట్టు బలంగానే ఉంది కదా విజయాన్ని అందుకుంటుందనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రత్యర్థి పోరాటం ముందు తలవంచక తప్పలేదు. ఇప్పుడిక నిర్ణయాత్మక పోరు. అదీ.. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా విజయాన్ని అందుకోని మైదానంలో. కానీ కోహ్లి రాకతో ఉత్సాహం నిండిన జట్టు.. మంగళవారం ఆరంభమయ్యే చివరి టెస్టులో గెలిచి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. మరి రికార్డు దరి చేరుతుందా? లేదా గత మ్యాచ్‌లో జయకేతనం ఎగరవేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఎల్గర్‌ సేన.. భారత్‌కు నిరాశే మిగిలిస్తుందా? అన్నది చూడాలి.

కేప్‌టౌన్‌

శాబ్దాలుగా తీరని కలను నిజం చేసేందుకు టీమ్‌ఇండియాకు కావాల్సింది మరొక్క విజయమే. నవ శకానికి నాంది పలికేందుకు భారత జట్టుకు కావాల్సింది ఇంకొక్క గెలుపే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో శుభారంభం చేసి.. గత మ్యాచ్‌లో ఓటమితో వెనకబడ్డ కోహ్లీసేన.. నేడు మొదలయ్యే చివరి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. ఈ మైదానంలో రికార్డు పేలవంగా ఉన్నా.. వెన్నునొప్పి గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన సారథి కోహ్లి తిరిగి జట్టుతో చేరడంతో భారత్‌ పోరాటమే ఆయుధంగా బరిలో దిగుతోంది. తన తనయ తొలి పుట్టిన రోజైన మంగళవారం (జనవరి 11) నాడు 99వ టెస్టు ఆడనున్న విరాట్‌.. జట్టుకు విజయం అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు స్వదేశంలో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న సఫారీ సేన.. ప్రత్యర్థికి మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. సిరీస్‌కు ముందు బలహీనంగా కనిపించిన ఆ జట్టు.. పట్టుదలతో రెండో టెస్టులో విజయాన్ని అందుకుని ఇప్పుడు తనకు అచ్చొచ్చిన స్టేడియంలో సత్తాచాటేందుకు సై అంటోంది.

వీళ్లు ఆడాలి..

మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చిన కోహ్లి తన ఉనికితో జట్టులో స్థైర్యం నింపగలడు. ఇక అతను బ్యాటింగ్‌లో ఫామ్‌ అందుకోవడం అత్యావశ్యకం. 2019 నవంబర్‌లో చివరగా సెంచరీ చేరుకున్న అతను.. అప్పటి నుంచి 15 టెస్టుల్లో కేవలం 26.08 సగటుతో మాత్రమే పరుగులు చేశాడు. రెండేళ్లుగా అతని శతకం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అతని కోసం గత టెస్టులో ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా రాణించిన విహారి పక్కకు తప్పుకోవాల్సిందే. మరోవైపు నియంత్రణ లేని దూకుడుతో వికెట్‌ పారేసుకుంటున్న పంత్‌ తనపై వస్తున్న విమర్శలకు ఆటతో సమాధానం చెప్పాల్సి ఉంది. గత మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకోవాల్సింది పోయి.. మరింత కష్టాల్లోకి నెడుతూ అతను భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైన తీరు మాజీలతో పాటు అభిమానులకూ ఆగ్రహాన్ని తెప్పించింది. ఇప్పటికే పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామమిచ్చి, సాహాను ఆడించాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ అతనికి కఠిన పరీక్షే.

వీళ్లు కొనసాగించాలి..

జట్టుకు శుభారంభాన్ని అందించాల్సిన బాధ్యత మరోసారి ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌లపై ఉంది. తొలి టెస్టులో శతకం సాధించిన రాహుల్‌ మరోసారి మూడంకెల స్కోరు చేరుకోవాలని, మయాంక్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని జట్టు ఆశిస్తోంది. ఇక కెరీర్‌ సంకట స్థితిలో గత మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పోరాటంతో  అర్ధశతకాలు చేసిన పుజారా, రహానె అదే జోరు కొనసాగించాలి. ఫామ్‌ లేమితో ఉన్న ఈ జోడీ.. గత మ్యాచ్‌తో గాడిన పడ్డట్లే కనిపిస్తోంది.


‘‘కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుకు సిద్ధంగా ఉన్నా. వెన్ను నొప్పి నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించా. ఇక గాయంతో బాధపడుతున్న పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. మ్యాచ్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌ సాధించలేదని భావిస్తున్నాం. అతడి విషయంలో సాహసాలు చేయలేం. సిరాజ్‌ స్థానంలో ఇషాంత్‌శర్మ లేదా ఉమేశ్‌ యాదవ్‌ను తీసుకోవాలా అన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలో తేల్చుకోలేని రిజర్వ్‌ బెంచ్‌ బలం భారత్‌కు ఉండడం సానుకూలాంశం’’

-కోహ్లి


‘‘ఆటకు కోహ్లి ఓ విభిన్నమైన శక్తిని తెస్తాడు. గత మ్యాచ్‌లో కెప్టెన్సీ, వ్యూహాల పరంగా టీమ్‌ఇండియా అతని సేవలను కోల్పోయింది. గత పదిహేనేళ్లలో ఇలాంటి భారీ టెస్టు (మూడో మ్యాచ్‌) మేం ఆడలేదు. ఈ మ్యాచ్‌లోనూ దాన్ని ప్రదర్శిస్తాం. ఈ సిరీస్‌ను 2-1తో గెలిస్తే అది మాకు పెద్ద విజయంగా నిలిచిపోతుంది. స్వదేశంలోనే అయినప్పటికీ భారత్‌ లాంటి అగ్రశ్రేణి జట్టును ఓడిస్తే అది ఎంతో గొప్పగా ఉంటుంది

-ఎల్గర్‌


0

కేప్‌టౌన్‌లో భారత్‌ ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా గెలవలేదు. అయిదు మ్యాచ్‌లాడిన జట్టు మూడింట్లో ఓడి, రెండు డ్రాలు చేసుకుంది. ఇక్కడ దక్షిణాఫ్రికా గత పది టెస్టుల్లో ఏడు విజయాలు, రెండు ఓటములు, ఓ డ్రా నమోదు చేసింది.


50

దక్షిణాఫ్రికా ఆటగాడు కాగిసో రబాడాకిది 50వ టెస్టు. 26 ఏళ్ల ఈ ఫాస్ట్‌ బౌలర్‌ ఇప్పటివరకూ 49 టెస్టుల్లో 226 వికెట్లు పడగొట్టాడు.


146

టెస్టుల్లో 8000 పరుగులు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి అవసరమైన పరుగులు. రహానె 79 పరుగులు చేస్తే 5 వేల మైలురాయి చేరుకుంటాడు.


ఇషాంత్‌కు చోటు..

తొడ కండరాల గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమైన సిరాజ్‌ స్థానంలో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఆడే అవకాశముంది. జట్టులో చోటు కోసం ఉమేశ్‌ కూడా పోటీలో నిలిచినప్పటికీ.. ఎత్తు కారణంగా ఇషాంత్‌కే ఛాన్స్‌ దక్కొచ్చు. ఆరడుగులకు పైగా ఎత్తుతో అతను ఇలాంటి పిచ్‌పై తన బౌన్స్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు. వందకు పైగా టెస్టులాడిన అతని ప్రస్తుత ఫామ్‌ ఆశాజనకంగా లేనప్పటికీ.. ఈ మ్యాచ్‌లో కీలకమవుతాడని జట్టు ఆశిస్తోంది. మరోవైపు షమి, శార్దూల్‌ తమ దూకుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. గత టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సంచలన ప్రదర్శన చేసిన శార్దూల్‌పై జట్టు మరోసారి ఆశలు పెట్టుకుంది. ప్రధాన పేసర్‌ బుమ్రానే ఫామ్‌ అందుకోవాల్సి ఉంది.

ఆత్మవిశ్వాసంతో..

తొలి టెస్టులో ఓడినప్పటికీ.. తిరిగి బలంగా పుంజుకుని సిరీస్‌ సమం చేసిన దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ఉంది. గత మ్యాచ్‌లో విజయం ఆ జట్టులో స్ఫూర్తి నింపుతుందనడంలో సందేహం లేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఎల్గర్‌ పోరాటంతో సహచరులు ప్రేరణ పొందితే భారత బౌలింగ్‌కు ఇబ్బందులు తప్పవు. అతనితో పాటు బవుమా, డసెన్‌, కీగన్‌ పీటర్సన్‌ ఫామ్‌లో కనిపిస్తున్నారు. వీళ్లను వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే మ్యాచ్‌పై టీమ్‌ఇండియా పట్టు బిగించొచ్చు. ముఖ్యంగా ఎల్గర్‌ బ్యాటింగ్‌ శైలికి అనుగుణంగా ఫీల్డర్లను మోహరించి.. స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకూడదు. అస్థిరమైన బౌన్స్‌ లభించిన గత మ్యాచ్‌లో పేసర్లు రబాడ, ఎంగిడి, అలివీర్‌, జాన్సన్‌.. భారత బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. ముఖ్యంగా 6.8 అడుగుల పొడగరి 21 ఏళ్ల జాన్సన్‌.. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ వికెట్లు సాధిస్తున్నాడు. అతనితో పాటు రబాడ, ఎంగిడిని ఎదుర్కొనేందుకు భారత్‌ ప్రత్యేక వ్యూహంతో మైదానంలో అడుగుపెట్టాలి.

పిచ్‌ ఎలా ఉంది..

కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇక్కడ టెస్టు మ్యాచ్‌ జరగలేదు. కొత్త క్యూరేటర్‌ ఈ పిచ్‌ను బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా సహకరించేలా రూపొందించినట్లు సమాచారం. క్రీజులో నిలబడితే పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పిచ్‌పై గత ఎనిమిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుంటే తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 361గా ఉంది. పేసర్లతో పాటు స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశముంది.


జట్లు (అంచనా): భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌, పుజారా, కోహ్లి, రహానె, పంత్‌, అశ్విన్‌, శార్దూల్‌, బుమ్రా, షమి, ఇషాంత్‌.

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌, మార్‌క్రమ్‌, కీగన్‌, డసెన్‌, బవుమా, వెరినె, జాన్సన్‌, కేశవ్‌, రబాడ, అలివీర్‌, ఎంగిడి.


మొదలెట్టిన చోట మళ్లీ

స్‌ప్రీత్‌ బుమ్రా.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టి.. టెస్టు జట్టులో పాగా వేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టింది కేప్‌టౌన్‌లోనే. 2018 జనవరిలో జరిగిన సిరీస్‌లో అతను ఇక్కడే తొలి మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న అతను.. ఆ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి టెస్టుల్లోనూ అతని జోరు కొనసాగుతూ వచ్చింది. కానీ 2019లో వెన్నెముక గాయం తన లయను దెబ్బతిసింది. దాని నుంచి కోలుకున్న తర్వాత కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించే అతను ఇప్పుడు సాధారణ బౌలర్‌గా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అరంగేట్రం చేసిన ఈ స్టేడియంలోనే అతను మళ్లీ సరికొత్తగా వికెట్ల వేట మొదలెట్టాలని జట్టు ఆశిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని