Novak Djokovic: జకోవిచ్‌దే విజయం.. కానీ

తన ఆటతో టెన్నిస్‌ కోర్టులో విజయాలు సాధించిన ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌కు కోర్టులోనూ గెలుపు దక్కింది. ఈ నెల 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు వచ్చిన అతణ్ని అడ్డుకున్న సరిహద్దు భద్రతా దళం.. వైద్య మినహాయింపు

Updated : 11 Jan 2022 07:07 IST

మెల్‌బోర్న్‌: తన ఆటతో టెన్నిస్‌ కోర్టులో విజయాలు సాధించిన ప్రపంచ నంబర్‌వన్‌ జకోవిచ్‌కు కోర్టులోనూ గెలుపు దక్కింది. ఈ నెల 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు వచ్చిన అతణ్ని అడ్డుకున్న సరిహద్దు భద్రతా దళం.. వైద్య మినహాయింపు కోరేందుకు సరైన కారణాలు లేవని తన వీసా రద్దు చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం అతణ్ని ఇమ్మిగ్రేషన్‌ నియంత్రణలోని హోటల్‌కు తరలించారు. కానీ తన వీసా రద్దు చేయడంపై ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించిన ఈ సెర్బియా ఆటగాడికి తీర్పు అనుకూలంగా వచ్చింది. సోమవారం వర్చువల్‌ విచారణ అనంతరం జకోవిచ్‌ వీసాను పునరుద్ధరించాలని, 30 నిమిషాల్లోపు అతణ్ని ఆ హోటల్‌ నుంచి విడుదల చేయాలని న్యాయమూర్తి ఆంటోని కెల్లీ ఆదేశించారు. కానీ అతని ఆశలకు అక్కడి ప్రభుత్వం మళ్లీ చెక్‌ పెట్టేలా కనిపిస్తోంది. జకోవిచ్‌ వీసా విషయంలో వ్యక్తిగత రద్దు అధికారాన్ని ఉపయోగించాలా? వద్దా? అనే అంశాన్ని ఇమ్మిగ్రేషన్‌, పౌరసత్వం మంత్రి అలెక్స్‌ పరిశీలిస్తున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది క్రిస్టోఫర్‌ ఈ తీర్పు అనంతరం న్యాయమూర్తికి తెలిపారు. ఒకవేళ ఈ అధికారాన్ని ఉపయోగించి వీసా రద్దు చేస్తే అతను మూడేళ్ల పాటు ఆస్ట్రేలియా రాలేడు కదా అని హోం వ్యవహారాల మంత్రి ఆండ్రూస్‌ తరపు న్యాయవాదులను కెల్లీ అడిగారు. మూడేళ్ల పాటు ఆస్ట్రేలియా రాకుండా జకోవిచ్‌ను నిషేధిస్తారని న్యాయవాది క్రిస్టోఫర్‌ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అతని వీసాను మరోసారి రద్దు చేయడం ఖాయమనిస్తోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనే ప్లేయర్లు తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలని నిబంధన విధించారు. కానీ గత ఆరు నెలల్లో కరోనా సోకిందనే కారణంతో జకోవిచ్‌ మినహాయింపు కోరగా నిర్వాహకులు అనుమతించారు. సరిహద్దు భద్రతా దళం మాత్రం ఆ కారణం సరైంది కాదని అతణ్ని అడ్డుకుంది. దీనిపై జకో న్యాయవాదులు గత నెల 16న అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు కోర్టుకు పత్రాలు సమర్పించారు. విమానాశ్రయంలో అవసరమైన పత్రాలు చూపించిన జకోవిచ్‌ అంతకంటే ఏం చేయాలని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని