IND vs SA : పడగొట్టారు.. నిలబడతారా!

రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌.. ఓ దశలో ఆ జట్టు స్కోరు 159/4. రెండో సెషన్‌ ముగిసే దిశగా ఆట సాగుతోంది.. అప్పటికే అర్ధశతకం చేసిన  కీగన్‌ పీటర్సన్‌తో పాటు బవుమా క్రీజులో కుదురుకున్నారు. ఇంకా చేతిలో ఆరు  వికెట్లున్నాయి. టీమ్‌ఇండియా స్కోరుకు సఫారీ సేన 64 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. దీంతో ఆ జట్టు మంచి ఆధిక్యం సాధించడం ఖాయమేనని.. భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. కానీ చివరకు కోహ్లీసేనకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. అందుకు ప్రధాన కారణం షమి, బుమ్రా. మొదట షమి.. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి జట్టును పోటీలోకి తెస్తే..

Updated : 13 Jan 2022 12:40 IST

విజృంభించిన బుమ్రా  
భారత్‌కు స్వల్ప ఆధిక్యం
దక్షిణాఫ్రికా 210 ఆలౌట్‌
ఆసక్తికరంగా మూడో టెస్టు

రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌.. ఓ దశలో ఆ జట్టు స్కోరు 159/4. రెండో సెషన్‌ ముగిసే దిశగా ఆట సాగుతోంది.. అప్పటికే అర్ధశతకం చేసిన  కీగన్‌ పీటర్సన్‌తో పాటు బవుమా క్రీజులో కుదురుకున్నారు. ఇంకా చేతిలో ఆరు  వికెట్లున్నాయి. టీమ్‌ఇండియా స్కోరుకు సఫారీ సేన 64 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. దీంతో ఆ జట్టు మంచి ఆధిక్యం సాధించడం ఖాయమేనని.. భారత్‌కు ఇబ్బందులు తప్పవనిపించింది. కానీ చివరకు కోహ్లీసేనకు 13 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. అందుకు ప్రధాన కారణం షమి, బుమ్రా. మొదట షమి.. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి జట్టును పోటీలోకి తెస్తే.. ఆ తర్వాత మునుపటి ఫామ్‌ అందుకుంటూ దూసుకెళ్లిన బుమ్రా ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ త్వరగానే ఓపెనర్లను కోల్పోయింది. భారత్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తున్నా.. దక్షిణాఫ్రికా కూడా గట్టిగానే పోటీలో ఉంది.

కేప్‌టౌన్‌

త కొన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పేసర్లు మరోసారి అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గొప్పగా పుంజుకుని టీమ్‌ఇండియాకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఓవర్‌నైట్‌ స్కోరు 17/1తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీ సేన 210 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో కీగన్‌ పీటర్సన్‌ (72; 166 బంతుల్లో 9×4) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా (5/42) దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. షమి (2/39), ఉమేశ్‌ (2/64) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్వల్ప ఆధిక్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ను సఫారీ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. మయాంక్‌ (7), కేఎల్‌ రాహుల్‌ (10)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చారు. మొదట రబాడ (1/25) బంతికి మయాంక్‌.. ఆ వెంటనే జాన్సన్‌ (1/7) బౌలింగ్‌లో రాహుల్‌ స్లిప్‌లో చిక్కారు. ఆ తర్వాత కెప్టెన్‌ కోహ్లి (14 బ్యాటింగ్‌), పుజారా (9 బ్యాటింగ్‌) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్త వహించారు. కొత్త బంతితో ప్రమాదకరంగా కనిపించిన ప్రత్యర్థి పేసర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చారిత్రక సిరీస్‌ విజయం భారత్‌ సొంతం కావాలంటే మూడో రోజు బ్యాట్‌తో గొప్పగా రాణించాలి.

చెమటోడ్చినా..: రెండో రోజు ఆట మొదలైన వెంటనే బుమ్రా జట్టును సంతోషంలో ముంచెత్తాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు ఒక్క పరుగు కూడా జత చేయని మార్‌క్రమ్‌ (8)ను అద్భుతమైన   డెలివరీతో బౌల్డ్‌ చేశాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతి వికెట్లకు దూరంగా వెళ్తుందని ఊహించిన మార్‌క్రమ్‌ ఆడకుండా వదిలేశాడు. కానీ అది లోపలికి దూసుకొచ్చి ఆఫ్‌స్టంప్‌ను ముద్దాడింది. ఈ వికెట్‌తో భారత్‌ రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యర్థిపై దాడి కొనసాగించింది. కానీ మరో వికెట్‌ కోసం మరో 12 ఓవర్ల పాటు వేచి చూడక తప్పలేదు. ఫామ్‌లో ఉన్న కీగన్‌తో పాటు ఓవర్‌నైట్‌ స్కోరు 6తో బ్యాటింగ్‌ కొనసాగించిన నైట్‌ వాచ్‌మన్‌ కేశవ్‌ మహరాజ్‌ (25) పోరాటమే అందుకు కారణం. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులను వదిలేస్తూ.. భారత బౌలర్ల సవాళ్లకు నిలబడ్డ ఈ జోడీ క్రీజులో కుదురుకుంది. ముఖ్యంగా స్పిన్నర్‌ కేశవ్‌.. ప్రధాన బ్యాటర్‌లాగా ఆత్మవిశ్వాసంతో బౌండరీలు రాబట్టాడు. బుమ్రా, షమి వికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కొన్ని బంతులు బ్యాట్‌ను తాకి స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ల ముందు పడ్డాయి. కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొంటున్న కేశవ్‌ ఇన్నింగ్స్‌కు ఉమేశ్‌ తెరదించాడు. ఓ అందమైన ఇన్‌స్వింగర్‌తో బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఇక వికెట్ల వేటను వేగవంతం చేయాలనే భారత ప్రయత్నాలకు వాండర్‌ డసెన్‌ (21)తో కలిసి కీగన్‌ అడ్డుకట్ట వేశాడు. శార్దూల్‌ (1/37) బౌలింగ్‌లో సెకండ్‌ స్లిప్‌లో కోహ్లి కాస్త ముందుకు జరిగి ఉంటే రెండు క్యాచ్‌లు పట్టే అవకాశం ఉండేది. పిచ్‌ పరిస్థితులకు  అలవాటు పడ్డ కీగన్‌, వాండర్‌డసెన్‌ జోడీ స్వేచ్ఛగా పరుగులు రాబట్టింది. క్రీజులో నిలబడితే పరుగులు సాధించవచ్చని నమ్మిన కీగన్‌ ఆ ప్రణాళికను అమలు చేశాడు. ఎంతో సంయమనంతో పరుగులు సాధించాడు. అతనికి వాండర్‌డసెన్‌ చక్కగా సహకరించడంతో ఆ జట్టు 100/3తో లంచ్‌కు వెళ్లింది. 

వికెట్ల వేటలో..: నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న కీగన్‌, వాండర్‌డసెన్‌ జోడీని విడగొట్టిన ఉమేశ్‌ మరోసారి జట్టును పోటీలోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కీలక సమయంలో డసెన్‌ను ఔట్‌ చేసిన అతను ప్రత్యర్థికి ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వడనే అనిపించింది. కానీ పోరాటాన్ని కొనసాగిస్తూ అర్ధశతకం చేరుకున్న కీగన్‌కు ఈ సారి బవుమా (28) తోడయ్యాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల పరీక్షను తట్టుకుని నిలబడడంతో ఆ జట్టు లోటు తగ్గుతూ వచ్చింది. ఆ దశలో బవుమా క్యాచ్‌ను స్లిప్‌లో పుజారా వదిలేశాడు. అది కాస్త వెళ్లి పంత్‌ వెనకాల నేలపై పెట్టిన హెల్మెట్‌కు తగలడంతో అయిదు పరుగులు జరిమానాగా సమర్పించుకోవాల్సి వచ్చింది. బ్యాట్స్‌మెన్‌ పట్టుదల చూస్తే దక్షిణాఫ్రికాకు మంచి ఆధిక్యం దక్కుతుందేమోననిపించింది. కానీ తిరిగి బౌలింగ్‌కు వచ్చిన షమి కథ మొత్తం మార్చేశాడు. ఒకే ఓవర్లో బవుమా, వెరీన్‌ (0)ను పెవిలియన్‌ చేర్చి భారత ఆశలు నిలిపాడు. మరోవైపు టీ విరామానికి ముందు జాన్సన్‌ (7)ను ఔట్‌ చేసిన బుమ్రా.. ఆ తర్వాత కీగన్‌ను వెనక్కి పంపి ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాడు. కీగన్‌ ఔటయ్యేటప్పటికి ఆ జట్టు 44 పరుగులు వెనకబడి ఉండడం.. మరో రెండు వికెట్లే మిగిలి ఉండడంతో భారత్‌కు 30 పరుగులకు పైగా ఆధిక్యం సొంతమవుతుందనిపించింది. కానీ చివర్లో పేసర్లు రబాడ (15), అలివీర్‌ (10 నాటౌట్‌) బౌలర్లకు విసుగు తెప్పిస్తూ ఆడపాదడపా బౌండరీలతో స్కోరు బోర్డును కదిలించారు. రబాడను శార్దూల్‌ ఔట్‌ చేయడంతో వెంటనే ఇన్నింగ్స్‌ ముగిసేలా కనిపించినా.. అలివీర్‌, ఎంగిడి (3) మరికొన్ని ఓవర్లు క్రీజులో గడిపారు. చివరకు బుమ్రా తన అయిదో వికెట్‌గా ఎంగిడిని ఔట్‌ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 223
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) పుజారా (బి) బుమ్రా 3; మార్‌క్రమ్‌ (బి) బుమ్రా 8; కేశవ్‌ (బి) ఉమేశ్‌ 25; కీగన్‌ (సి) పుజారా (బి) బుమ్రా 72; డసెన్‌ (సి) కోహ్లి (బి) ఉమేశ్‌ 21; బవుమా (సి) కోహ్లి (బి) షమి 28; వెరీన్‌ (సి) పంత్‌ (బి) షమి 0; జాన్సన్‌ (బి) బుమ్రా 7; రబాడ (సి) బుమ్రా (బి) శార్దూల్‌ 15; అలివీర్‌ నాటౌట్‌ 10; ఎంగిడి (సి) అశ్విన్‌ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం: (76.3 ఓవర్లలో ఆలౌట్‌) 210; వికెట్ల పతనం: 1-10, 2-17, 3-45, 4-112, 5-159, 6-159, 7-176, 8-179, 9-200; బౌలింగ్‌: బుమ్రా 23.3-8-42-5; ఉమేశ్‌ 16-3-64-2; షమి 16-4-39-2; శార్దూల్‌ 12-2-37-1; అశ్విన్‌ 9-3-15-0

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సన్‌ 10; మయాంక్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 7; పుజారా బ్యాటింగ్‌ 9; కోహ్లి బ్యాటింగ్‌ 14; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (17 ఓవర్లలో 2 వికెట్లకు) 57; వికెట్ల పతనం: 1-20, 2-24; బౌలింగ్‌: రబాడ 6-1-25-1; అలివీర్‌ 2-0-13-0; జాన్సన్‌ 5-3-7-1; ఎంగిడి 3-3-0-0; కేశవ్‌ 1-1-0-0


6

టెస్టుల్లో 100 క్యాచ్‌లు అందుకున్న ఆరో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. షమి బౌలింగ్‌లో బవుమా క్యాచ్‌ను స్లిప్‌లో అద్భుతంగా ఒడిసిపట్టుకున్న అతను.. తన 99వ మ్యాచ్‌లో ఈ మైలురాయి చేరుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని