IND vs SA:పంత్ పోరాడినా..
దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ విజయం కోసం ఆరాటపడుతున్న భారత్‌కు అదంత తేలిగ్గా దక్కేలా లేదు. తొలి టెస్టులో గెలిచి ఆశలు రేపి, రెండో మ్యాచ్‌లో భంగపడ్డ టీమ్ఇండియా.. నిర్ణయాత్మక మూడో పోరులోనూ వెనుకబడిపోయింది. పంత్ అద్భుతంగా పోరాడి
198కే భారత్ ఆలౌట్
మూడో టెస్టులో వెనుకంజ
దక్షిణాఫ్రికా లక్ష్యం 212; ప్రస్తుతం 101/2
కేప్‌టౌన్
దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ విజయం కోసం ఆరాటపడుతున్న భారత్‌కు అదంత తేలిగ్గా దక్కేలా లేదు. తొలి టెస్టులో గెలిచి ఆశలు రేపి, రెండో మ్యాచ్‌లో భంగపడ్డ టీమ్ఇండియా.. నిర్ణయాత్మక మూడో పోరులోనూ వెనుకబడిపోయింది. పంత్ అద్భుతంగా పోరాడి శతకం సాధించినా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో మరోసారి తక్కువకే ఆలౌటై.. తేలికైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆఖర్లో ఎల్గర్ వికెట్ భారత్‌కు ఉత్సాహాన్నిచ్చేదే అయినా..ఆతిథ్య జట్టుదే స్పష్టంగా పైచేయి. అవకాశాలు సన్నగిల్లిన కోహ్లీసేన మ్యాచ్‌లో నెగ్గాలంటే అసాధారణంగా రాణించాల్సిందే. సఫారీ జట్టు గెలుపుపై కన్నేసింది. చేతిలో 8 వికెట్లున్న ఆ జట్టు విజయానికి చేయాల్సింది ఇంకా 111 పరుగులే.
రిషబ్ పంత్ (100 నాటౌట్; 139 బంతుల్లో 6×4, 4×6) సూపర్ శతకం సాధించినా.. మూడో టెస్టులో భారత్‌ది వెనుకంజే. దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఆట చివరికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కీగన్ పీటర్సన్ (48 బ్యాటింగ్; 61 బంతుల్లో 7×4) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 57/2తో మూడో రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. జాన్సన్ (4/36), రబాడ (3/53), ఎంగిడి (3/21) ధాటికి 198 పరుగులకే ఆలౌటైంది. పంత్ ఒంటరిపోరాటం చేశాడు. కెప్టెన్ కోహ్లి (29; 143 బంతుల్లో 4×4) ఒక్కడే అతడికి సహకరించాడు. 212 పరుగుల స్వల్ప ఛేదనలో మార్క్రమ్ (16)ను త్వరగానే కోల్పోయినా.. కీగన్ పీటర్సన్ చక్కని బ్యాటింగ్ కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అతడు. ఎల్గర్ (30; 96 బంతుల్లో 3×4)తో రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 101/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో ఎల్గర్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా.. భారత్‌ను కాస్త పోటీలో నిలిపాడు.
పంత్ ఒక్కడే..: ఎట్టకేలకు పంత్ గాడినపడ్డాడు. చెత్త షాట్లకు ఔట్ అవుతున్నాడన్న విమర్శల నేపథ్యంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. తన సహజమైన దూకుడును తగ్గించుకోకుండానే చాలా క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాడు. దాదాపు ఒంటి చేత్తో జట్టుకు కాస్త పోరాడే స్కోరును అందించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ.. పంతే నిలిచి ఉండకపోతే మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆశలు ఎప్పుడో గల్లంతయ్యేవి. ఒక్క కోహ్లి నుంచి మాత్రమే అతడికి తోడ్పాటు అందింది. ఉదయం ఆట ఆరంభమైన పది నిమిషాల్లోనే పుజారా, రహానేలను కోల్పోయి జట్టు చిక్కుల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చాడు పంత్. అతడు పట్టుదలతో క్రీజులో నిలిచి కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. తక్కువే అయినా.. కోహ్లి విలువైన పరుగులే చేశాడు. ఇద్దరివి పరస్పర విరుద్ధ ఇన్నింగ్స్‌లు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన కోహ్లి దుర్భేద్యమైన డిఫెన్స్ ఆడితే.. పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. పంత్ ఆటలో స్పష్టంగా కనిపించిన మార్పు.. షాట్ సెలక్షన్లో క్రమశిక్షణ. అలాగని తన సహజ శైలికి అతడు పూర్తి భిన్నంగా ఏమీ ఆడలేదు. సర్రున దూసుకొచ్చిన రబాడ బంతిని.. అతడు తనదైన స్క్వేర్ కట్‌తో బౌండరీకి తరలించాడు. అలివీర్ బౌలింగ్‌లో ముందుకొచ్చి కవర్ డ్రైవ్ బౌండరీ సాధించాడు. అలాగే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ఇవన్నీ పంత్ నుంచే ఊహించే షాట్లే. బంతులను ఎదుర్కొనే విషయంలో అతడి విచక్షణ కూడా ఆకట్టుకుంది. మంచి బంతులను చక్కగా డిఫెండ్ చేస్తూనే వీలైప్పుడల్లా బ్యాట్ ఝుళిపించాడు. టెయిలెండర్లతో పంత్ బ్యాటింగ్ కూడా ప్రత్యేకమే. అతడు ప్రతి ఓవర్లో నాలుగో బంతికో, అయిదో బంతికో సింగిల్ తీస్తూ.. 9, 10, 11వ నంబర్ బ్యాట్స్‌మెన్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశాడు.
ఆ భాగస్వామ్యం విడిపోయాక..: ఇటీవల తరచుగా ఆఫ్‌స్టంప్ ఆవల బంతులకు ఔటవుతున్న కోహ్లి ఈ ఇన్నింగ్స్‌లో ఎంతో సహనాన్ని ప్రదర్శించాడు. అలాంటి బంతులను ఎన్నో వదిలేసిన అతడు.. ధాటిగా ఆడుతున్న పంత్‌కు సహకరించాడు. ఆరంభ షాక్ నుంచి కోలుకున్న భారత్ ఓ దశలో 152/4తో మంచి స్కోరు సాధించేలా కనిపించింది. కానీ అప్పటిదాకా ఓపిగ్గా ఆడిన కోహ్లి.. చివరికి ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్ ఆవల బంతిని వెంటాడి రెండో స్లిప్‌లో చిక్కాడు. 94 పరుగుల అయిదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడడంతో భారత్ ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న పంత్‌కు ఎవరూ అండగా నిలవలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్లు.. అశ్విన్ (7), శార్దూల్ (5), ఉమేశ్ (0), షమి (0), బుమ్రా (2)ను చకచకా ఔట్ చేశారు. మరోవైపు నిస్సహాయంగా మిగిలిపోయిన పంత్ కష్టంగా శతకాన్ని (133 బంతుల్లో) అందుకున్నాడు. టీమ్ఇండియా 46 పరుగులకే చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు భారత్ ఆరంభం కూడా పేలవం. ఓవర్‌నైట్ స్కోరు 57/2తో భారత్ ఇన్నింగ్స్‌ను కొనసాగించగా.. ఇంకో పరుగుకే పుజారా, రహానె వెనుదిరిగారు. పుజారా (9)ను జాన్సన్, రహానె (1)ను రబాడ ఔట్ చేశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 223; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 210
భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) మార్క్రమ్ (బి) జాన్సన్ 10; మయాంక్ (సి) ఎల్గర్ (బి) రబాడ 7; పుజారా (సి) పీటర్సన్ (బి) జాన్సన్ 9; కోహ్లి (సి) మార్క్రమ్ (బి) ఎంగిడి 29; రహానె (సి) ఎల్గర్ (బి) రబాడ 1; పంత్ నాటౌట్ 100; అశ్విన్ (సి) జాన్సన్ (బి) ఎంగిడి 7; శార్దూల్ ఠాకూర్ (సి) వెరీన్ (బి) ఎంగిడి 5; ఉమేశ్ (సి) వెరీన్ (బి) రబాడ 0; షమి (సి) వాండర్‌డసెన్ (బి) జాన్సన్ 0; బుమ్రా (సి) బవుమా (బి) జాన్సన్ 2; ఎక్స్‌ట్రాలు 28 మొత్తం: (67.3 ఓవర్లలో ఆలౌట్) 198; వికెట్ల పతనం: 1-20, 2-24, 3-57, 4-58, 5-152, 6-162, 7-170, 8-180, 9-189; బౌలింగ్: రబాడ 17-5-53-3; అలివీర్ 10-1-38-0; జాన్సన్ 19.3-6-36-4; ఎంగిడి 14-5-21-3; కేశవ్ మహరాజ్ 7-1-33-0
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) రాహుల్ (బి) షమి 16; ఎల్గర్ (సి) పంత్ (బి) బుమ్రా 30; పీటర్సన్ బ్యాటింగ్ 48; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (29.4 ఓవర్లలో) 101/2; వికెట్ల పతనం: 1-23, 2-101; బౌలింగ్: బుమ్రా 9.4-3-29-1; షమి 7-0-22-1; ఉమేశ్ 2-0-5-0; శార్దూల్ 5-1-17-0; అశ్విన్ 6-1-22-0
20
ఈ మ్యాచ్‌లో భారత్ క్యాచ్‌ల ద్వారా కోల్పోయిన వికెట్లు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక జట్టు బ్యాట్స్‌మెనంతా క్యాచ్ ఔట్ కావడం 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు