సెమీస్‌లో సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఇండియా ఓపెన్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 21-7, 21-18తో అష్మిత చాలిహపై గెలుపొందింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో రెండో గేమ్‌లో యువ క్రీడాకారిణి అష్మిత ఆకట్టుకుంది.

Published : 15 Jan 2022 04:39 IST

ప్రణయ్‌పై లక్ష్యసేన్‌ విజయం

దిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఇండియా ఓపెన్‌ టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్‌లో సింధు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 21-7, 21-18తో అష్మిత చాలిహపై గెలుపొందింది. 36 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో రెండో గేమ్‌లో యువ క్రీడాకారిణి అష్మిత ఆకట్టుకుంది. సింధుకు గట్టి పోటీనిచ్చింది. మరో క్వార్టర్స్‌లో ఆకర్షి కశ్యప్‌ 21-12, 21-15తో మాళవిక బాన్సోద్‌పై నెగ్గింది. సెమీస్‌లో సుపనిద (థాయ్‌లాండ్‌)తో సింధు, రెండో సీడ్‌ బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆకర్షి తలపడతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ లక్ష్యసేన్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసిన లక్ష్యసేన్‌ క్వార్టర్స్‌లో 14-21,  21-9, 21-14తో ప్రణయ్‌పై విజయం సాధించాడు. సెమీస్‌లో యంగ్‌ (మలేసియా)తో లక్ష్య పోటీపడతాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు- చిరాగ్‌శెట్టి 21-18, 21-18తో యంగ్‌ టెర్రీ- కీన్‌ హీన్‌ (సింగపూర్‌)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించారు. సెమీస్‌లో ఫాబియన్‌- విలియమ్‌ (ఫ్రాన్స్‌) జంటతో సాత్విక్‌- చిరాగ్‌ జోడీ తలపడుతుంది. మహిళల డబుల్స్‌లో హరిత- ఆష్నా జంట     21-16, 21-16తో రుద్రాని- అనీస్‌ కొశ్వార్‌ జోడీపై గెలిచి సెమీస్‌ చేరుకుంది.

ఆదాయంలో టాప్‌-10లో సింధు
అత్యధిక ఆదాయం కలిగిన క్రీడాకారిణుల టాప్‌-10 జాబితాలో భారత స్టార్‌ పి.వి.సింధు చోటు సంపాదించింది. ఫోర్బ్స్‌ ప్రకటించిన జాబితాలో సింధు ఏడో స్థానంలో నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం అనంతరం సింధు బ్రాండ్‌ విలువ అమాంతం పెరగడంతో 2018లో తొలిసారిగా ఆమె ఫోర్బ్స్‌ టాప్‌-10లో స్థానం సాధించింది. నిరుడు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గడంతో సింధు స్పాన్సర్ల జాబితాలో మరిన్ని సంస్థలు చేరాయి. దీంతో 2021లో రూ.53.50 కోట్లు (సుమారు) ఆదాయంతో సింధు ఏడో స్థానంలో నిలిచింది. జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా రూ.425 కోట్లతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. సెరెనా విలియమ్స్‌ రూ.340 కోట్లు, వీనస్‌ విలియమ్స్‌ రూ.84 కోట్లతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బైల్స్‌ (అమెరికా) రూ.81.5 కోట్లతో నాలుగు, ముగురుజా (స్పెయిన్‌) రూ.60 కోట్లతో అయిదు, జిన్‌ యంగ్‌ (దక్షిణ కొరియా) రూ.55.50 కోట్లతో ఆరో స్థానాల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని