హెడ్‌ శతకం

కరోనా కారణంగా నాలుగో టెస్టుకు దూరమై..  మళ్లీ జట్టులోకొచ్చిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రేవిస్‌ హెడ్‌ (101; 113 బంతుల్లో 12×4) రావడంతోనే అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో శతకంతో చెలరేగాడు. యాషెస్‌ సిరీస్‌లో మొదటిసారి శుభారంభం లభించిన ఇంగ్లాండ్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండా చేశాడు.

Published : 15 Jan 2022 03:01 IST

ఆస్ట్రేలియా 241/6

హోబర్ట్‌: కరోనా కారణంగా నాలుగో టెస్టుకు దూరమై..మళ్లీ జట్టులోకొచ్చిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రేవిస్‌ హెడ్‌ (101; 113 బంతుల్లో 12×4) రావడంతోనే అదరగొట్టాడు. క్లిష్ట సమయంలో శతకంతో చెలరేగాడు. యాషెస్‌ సిరీస్‌లో మొదటిసారి శుభారంభం లభించిన ఇంగ్లాండ్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండా చేశాడు. హెడ్‌ శతకం, కామెరాన్‌ గ్రీన్‌ (74; 109 బంతుల్లో 8×4) అర్ధ సెంచరీతో మెరవడంతో శుక్రవారం ప్రారంభమైన యాషెస్‌ సిరీస్‌ అయిదో టెస్టులో ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోరు దిశగా పయనిస్తోంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 241 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్‌ పేసర్లు బ్రాడ్‌ (2/48), రాబిన్‌సన్‌ (2/24) విజృంభించడంతో ఒకదశలో ఆసీస్‌ 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. డేవిడ్‌ వార్నర్‌ (0), ఖవాజా (6), స్మిత్‌ (0) పది ఓవర్లలోపే పెవిలియన్‌ చేరారు. లబుషేన్‌ (44; 53 బంతుల్లో 9×4), హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అయితే లంచ్‌ విరామానికి ముందు లబుషేన్‌ అసాధారణ రీతిలో ఔటయ్యాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవలకు వెళ్లి ఆడుతున్న లబుషేన్‌ను బ్రాడ్‌ తెలివిగా బోల్తాకొట్టించాడు. ఫుల్‌ లెంగ్త్‌లో నేరుగా సంధించిన బంతి వికెట్లను ముద్దాడింది. బంతిని లెగ్‌సైడ్‌ ఆడే క్రమంలో అదుపు తప్పడంతో లబుషేన్‌ బోర్లాపడిపోయాడు. ఆసీస్‌ తొలి సెషన్‌లో 4 వికెట్లకు 85 పరుగులు చేసింది. ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో ఒక సెషన్‌లో ఆసీస్‌పై ఇంగ్లాండ్‌ ఆధిపత్యం ప్రదర్శించడం ఇదే మొదటిసారి. అయితే హెడ్‌, గ్రీన్‌ అయిదో వికెట్‌కు 121 పరుగులు జోడించి ఇంగ్లాండ్‌ ఆశలపై నీళ్లు చల్లారు. సెంచరీ అనంతరం హెడ్‌ను వోక్స్‌ (1/50) ఔట్‌ చేయగా.. గ్రీన్‌ జోరుకు వుడ్‌ (1/79) అడ్డుకట్ట వేశాడు. టీ విరామం తర్వాత వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో సెషన్‌లో కేవలం 7.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని