జకోవిచ్‌ ఇంటికి

అనేక మలుపులు తిరుగుతూ.. నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠ రేపిన ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) పోరాటం ముగిసింది. తొమ్మిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ ఏడాది అతనిక కనిపించడు.

Published : 17 Jan 2022 05:04 IST

వీసా రద్దును సమర్థించిన కోర్టు
ఆస్ట్రేలియా విడిచి వెళ్లిన నొవాక్‌
నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌: అనేక మలుపులు తిరుగుతూ.. నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠ రేపిన ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) పోరాటం ముగిసింది. తొమ్మిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ ఏడాది అతనిక కనిపించడు. రెండు డోసుల కొవిడ్‌ టీకా వేసుకోలేదని జకో వీసాను తన వ్యక్తిగత అధికారంతో రద్దు చేసిన ఆస్ట్రేలియా ఇమిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాక్‌ నిర్ణయాన్ని ఫెడరల్‌ కోర్టు సమర్థించింది. వీసా రద్దును వ్యతిరేకిస్తూ జకోవిచ్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో అతను ఆస్ట్రేలియా వదిలి వెళ్లిపోయాడు. మరోవైపు నిబంధనల ప్రకారం అతనికి మూడేళ్ల పాటు ఆ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండకపోవచ్చు. రెండు డోసుల టీకా వేసుకున్న ప్లేయర్లే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడాలని నిర్వాహకులు నిబంధన విధించారు. కానీ గత నెలలో కరోనా సోకిందనే కారణంతో జకోవిచ్‌ వైద్య మినహాయింపు కోరడం.. ఆ కారణం సహేతుకంగా లేదని ఈ నెల 5న ఆస్ట్రేలియా సరిహద్దు భద్రతా దళం అతణ్ని అడ్డుకుని వీసా రద్దు చేయడం.. దీనిపై కోర్టుకు వెళ్లిన అతనికి తీర్పు అనుకూలంగా రావడం.. తాజాగా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అతని వీసాను రెండోసారి రద్దు చేయడం.. ఇలా వరుస పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. రెండోసారి కోర్టును ఆశ్రయించిన జకోవిచ్‌కు చుక్కెదురైంది.

నాదల్‌ అందుకునేనా?: వరుసగా మూడేళ్ల నుంచి ఛాంపియన్‌గా ఉన్న జకోవిచ్‌.. వీసా రద్దు నేపథ్యంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడందరి దృష్టి నాదల్‌పై పడింది. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో ఫెదరర్‌, జకోవిచ్‌ (20)తో కలిసి సమానంగా ఉన్న నాదల్‌.. సోమవారం ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర అందుకుంటాడా? అన్నది చూడాలి. అతను ఒక్కసారి (2009) మాత్రమే ఇక్కడ టైటిల్‌ ముద్దాడాడు. మెద్వెదెవ్‌, జ్వెరెవ్‌, సిట్సిపాస్‌ రూపంలో నాదల్‌కు సవాలు పొంచి ఉంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ ఆష్లీ బార్టీ సొంతగడ్డపై టైటిల్‌ నెగ్గాలనే ధ్యేయంతో ఉంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా- నదియా (ఉక్రెయిన్‌) జోడీ తొలి రౌండ్లో జువాన్‌- జిదాన్సెక్‌తో తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని