ఆరంభం అదిరేనా?

సొంతగడ్డపై ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌లో శుభారంభమే లక్ష్యంగా భారత అమ్మాయిల జట్టు బరిలో దిగుతోంది. గురువారం తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో తలపడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాన్‌పై 55వ

Published : 20 Jan 2022 03:13 IST

 నేడు ఇరాన్‌తో భారత్‌ ఢీ

మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌

ముంబయి: సొంతగడ్డపై ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌లో శుభారంభమే లక్ష్యంగా భారత అమ్మాయిల జట్టు బరిలో దిగుతోంది. గురువారం తొలి మ్యాచ్‌లో ఇరాన్‌తో తలపడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 70వ స్థానంలో ఉన్న ఇరాన్‌పై 55వ ర్యాంకులో ఉన్న భారత్‌ గెలిస్తే క్వార్టర్స్‌ చేరే ఛాన్స్‌ ఉంది. దీంతో 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలూ మెరుగుపడతాయి. చైనా, చైనీస్‌ తైపీ, ఇరాన్‌తో కలిసి భారత్‌ గ్రూప్‌- ఎలో ఉంది. ఇరాన్‌తో మ్యాచ్‌లో గెలిస్తే కనీసం గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచే ఆస్కారముంది. 12 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో మూడు గ్రూపుల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌ చేరతాయి. మరోవైపు మూడు గ్రూపుల్లో కలిపి మూడో స్థానంలో నిలిచిన రెండు ఉత్తమ జట్లు ముందంజ వేస్తాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు విజయం సాధించడం ఎంతో అవసరం. తొలిసారి ఆసియా కప్‌లో ఆడుతున్న ఇరాన్‌తో.. గతంలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తలపడ్డ భారత్‌ రెండు విజయాలు సాధించి, ఒక దాంట్లో ఓడింది. ఈ ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ రెండు సార్లు (1979, 1983)లో రన్నరప్‌గా, ఓ సారి (1981) మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన జట్లు నేరుగా 2023లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగే మహిళల ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.

ఇద్దరు క్రీడాకారిణులకు కరోనా: ఆసియా కప్‌ ఆరంభానికి ముందే కరోనా కలకలం రేగింది. ఇద్దరు భారత క్రీడాకారిణులు వైరస్‌ బారిన పడ్డారు. ‘‘ఆసియా కప్‌లో ఆడే భారత మహిళల జట్టులోని ఇద్దరు క్రీడాకారిణులకు కరోనా సోకింది. వైద్య సదుపాయాల మధ్య వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచారు. టోర్నీ సజావుగానే సాగుతుంది. మ్యాచ్‌ ఆడేందుకు ఒక్కో జట్టు చొప్పున 13 మంది ప్లేయర్లు అందుబాటులో ఉంటే చాలు’’ అని అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య బుధవారం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని