U-19 World Cup : కెప్టెన్‌ సహా ఆరుగురికి పాజిటివ్‌

అండర్‌-19 ప్రపంచకప్‌లో కరోనా కలకలం రేగింది. బుధవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ముంగిట భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం టోర్నీ నిర్వాహకుల్ని అయోమయంలోకి నెట్టింది. అయితే ఈ మ్యాచ్‌కు తుది జట్టును

Updated : 20 Jan 2022 07:28 IST

 భారత యువ జట్టుకు కరోనా దెబ్బ

అండర్‌-19 ప్రపంచకప్‌లో కలకలం

అయినా మ్యాచ్‌ ఆడిన కుర్రాళ్లు

తరౌబా: అండర్‌-19 ప్రపంచకప్‌లో కరోనా కలకలం రేగింది. బుధవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ముంగిట భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం టోర్నీ నిర్వాహకుల్ని అయోమయంలోకి నెట్టింది. అయితే ఈ మ్యాచ్‌కు తుది జట్టును దింపడం కూడా కష్టమైనప్పటికీ.. భారత్‌ వెనక్కి తగ్గలేదు. రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిపి కష్టపడి జట్టును మైదానంలోకి దించింది. మ్యాచ్‌ యధావిధిగా కొనసాగింది. కరోనా బారిన పడ్డ ఆటగాళ్లలో కెప్టెన్‌ యశ్‌ ధూల్‌తో పాటు వైస్‌ కెప్టెన్‌, ఆంధ్రా ఆటగాడైన షేక్‌ రషీద్‌ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరికీ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరి కంటే ముందే వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఆరాధ్య యాదవ్‌, వసు వత్స్‌, మానవ్‌ ప్రకాష్‌, సిద్దార్థ్‌ యాదవ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ ఆరుగురు ఐసొలేషన్‌కు వెళ్లగా.. రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిపి సరిగ్గా 11 మంది అందుబాటులో ఉండగా, వారితోనే భారత్‌ మ్యాచ్‌ ఆడింది. ఆల్‌రౌండర్‌ నిశాంత్‌ సింధు సారథ్యంలో జట్టు బరిలోకి దిగింది. కొవిడ్‌ పెద్ద దెబ్బ కొట్టినా భారత యువ జట్టు ఈ మ్యాచ్‌లో సత్తా చాటింది. మొదట భారత్‌.. 5 వికెట్లకు 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌ (88; 101 బంతుల్లో 12×4), రఘువంశీ (79; 79 బంతుల్లో 10×4, 2×6) తొలి వికెట్‌కు 164 పరుగులు జోడించి జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చారు. తర్వాత రాజ్‌ బవా (42), నిశాంత్‌ (36), హంగారేర్కర్‌ (39 నాటౌట్‌) సత్తా చాటడంతో భారత్‌ స్కోరు 300 దాటింది. అనంతరం ఛేదనలో ఐర్లాండ్‌ జట్టు 39 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు సమష్ఠి రాణించారు. దీంతో భారత్‌ 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని