
కుర్రాళ్ల పరిణతి అమోఘం
టరౌబా: ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకినప్పటికీ.. మిగిలిన క్రికెటర్లతో బరిలో దిగి ఐర్లాండ్‌ను చిత్తుచేసిన భారత అండర్-19 జట్టుపై జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత యువ జట్టు కెప్టెన్ యశ్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ‘‘భారత అండర్-19 జట్టు అమోఘమైన వ్యక్తిత్వాన్ని, పరిణతిని చూపించింది. కేవలం 11 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉన్నప్పటికీ మైదానంలో అడుగుపెట్టి తమ సత్తాచాటిన వాళ్ల తీరు అద్భుతం. వాళ్ల పట్ల ఎంతగా గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను. ఐర్లాండ్‌తో మ్యాచ్ వాళ్లకు జీవితాంతం గుర్తుంటుంది’’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం లక్ష్మణ్ కూడా విండీస్‌లోనే ఉంటూ కుర్రాళ్ల ఆటను ఆస్వాదిస్తున్నాడు.