
ఆటగాళ్ల అరువు.. ఫిఫా పరిమితులు
జెనీవా: అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్లబ్బులు ఆటగాళ్లను అరువు ఇవ్వడం, తెచ్చుకోవడంపై ఫిఫా పరిమితులు విధించేందుకు సిద్ధమైంది. యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు, ఆటలో పోటీతత్వం ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఫిఫా గురువారం ప్రకటించింది. 2022-23 సీజన్‌లో ఎప్పుడైనా సరే ఓ క్లబ్బు గరిష్ఠంగా ఎనిమిది మంది ఆటగాళ్ల చొప్పున అరువు తెచ్చుకోవచ్చని, ఇవ్వొచ్చని ఫిఫా తెలిపింది. ఆ తర్వాతి సీజన్‌కు ఆ సంఖ్యను ఏడుగురికి, అనంతరం ఆరుగురికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు వేరే దేశంలో ఉండే క్లబ్బుతో ఒప్పందం ప్రకారం మరో క్లబ్బు కేవలం ముగ్గురు చొప్పున ఆటగాళ్లను మాత్రమే తీసుకోవచ్చు, పంపించవచ్చని స్పష్టం చేసింది. తక్కువ రోజుల కోసం చేసుకునే ఒప్పందాలను రద్దు చేయనుంది. గరిష్ఠంగా ఒక ఏడాది పాటు ఒప్పందం చేసుకునే అవకాశమిస్తుంది. అప్పటికే అరువు మీద పంపించిన ఆటగాడిని మళ్లీ ఇతర జట్టులోకి తీసుకోవడాన్ని నిషేధించనుంది. అయితే ఈ నిబంధనల నుంచి 21.. అంతకంటే తక్కువ వయసున్న, క్లబ్‌లో శిక్షణ పొందిన ఆటగాళ్లకు మినహాయింపు కల్పించనుంది. దీంతో ఉత్తమ అకాడమీ ఉన్న చెల్సీ లాంటి జట్టు ఎంతమంది టీనేజర్లనైనా ఇతర క్లబ్బుల్లోకి పంపవచ్చు. ఫిఫా సభ్య సంఘాలు తమ దేశాల్లో ఈ నిబంధనలు మూడేళ్లలోగా అమలు చేయాల్సి ఉంది. అంతర్జాతీయంగా అయితే ఈ పరిమితులు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020లోనే ఈ నిబంధనలు ప్రతిపాదించినప్పటికీ కరోనా కారణంగా ఫిఫా వాయిదా వేస్తూ వచ్చింది.
Advertisement