
ఐసీసీ టెస్టు జట్టులో రోహిత్, పంత్, అశ్విన్
దుబాయ్: 2021 సంవత్సరానికి ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టెస్టు జట్టులో భారత్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. నిరుడు ఇంగ్లాండ్‌పై చెన్నైలో, ఓవల్‌లో శతకాలు సాధించి టెస్టును తన సత్తాను చాటుకున్న రోహిత్.. కోహ్లిని తోసిరాజని ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. న్యూజిలాండ్‌ను ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి విలియమ్సనే ఐసీసీ 2021 టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో పాకిస్థాన్ నుంచి ముగ్గురు (ఫవాద్ ఆలమ్, షహీన్ అఫ్రిది, హసన్ అలీ) అవకాశం దక్కించుకున్నారు. లబుషేన్ (ఆస్ట్రేలియా), రూట్ (ఇంగ్లాండ్), కరుణరత్నె (శ్రీలంక), జేమీసన్ (న్యూజిలాండ్) జట్టులో మిగతా సభ్యులు. ఇక ఐసీసీ 2021 వన్డే జట్టులో ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ సారథిగా ఎంపికైన ఈ జట్టులో ఫకార్ జమాన్ (పాకిస్థాన్), జానెమన్ మలన్, వాండర్‌డసెన్ (దక్షిణాఫ్రికా), షకిబ్, ముస్తాఫిజుర్, ముష్ఫికర్ (బంగ్లాదేశ్), హసరంగ, చమీర (శ్రీలంక), స్టిర్లింగ్, సిమిసింగ్ (ఐర్లాండ్) ఇతర సభ్యులు. టీ20 జట్టులోనూ భారత ఆటగాళ్లెవ్వరికీ చోటు దక్కని సంగతి తెలిసిందే.
మహిళల ఐసీసీ వన్డే జట్టులో మిథాలి, జులన్: ఐసీసీ 2021 సంవత్సరానికి ప్రకటించిన ఉత్తమ మహిళల వన్డే జట్టులో భారత్ నుంచి సీనియర్ క్రికెటర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి చోటు దక్కించుకున్నారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ హెదర్ నైట్ ఈ జట్టుకు కెప్టెన్. ఐసీసీ 2021 టీ20 జట్టుకు భారత్ నుంచి స్మృతి మంధాన మాత్రమే ఎంపికైన సంగతి తెలిసిందే.