సంచలనాల మోత

ప్రశాంతంగా సాగిపోతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఒక్కసారిగా సంచలనాల మోత మోగింది. నాలుగో రోజు పోటీల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత ముగురుజా.. ఆరో సీడ్‌ కొంటావీట్‌.. యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ రదుకానుకు షాక్‌ తగిలింది.

Updated : 21 Jan 2022 04:52 IST

ముగురుజా, కొంటావీట్‌, రదుకానుకు షాక్‌
ముర్రే కూడా ఔట్‌
మూడో రౌండ్లో సబలెంక, మెద్వెదెవ్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ప్రశాంతంగా సాగిపోతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఒక్కసారిగా సంచలనాల మోత మోగింది. నాలుగో రోజు పోటీల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత ముగురుజా.. ఆరో సీడ్‌ కొంటావీట్‌.. యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ రదుకానుకు షాక్‌ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో అయిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో తొలి విజయం సాధించిన మాజీ నంబర్‌వన్‌ ముర్రే పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. మరోవైపు మెద్వెదెవ్‌, సబలెంక ముందంజ వేశారు.

మెల్‌బోర్న్‌

తేడాది డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ఛాంపియన్‌ ముగురుజా (స్పెయిన్‌)కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఈ మూడో సీడ్‌ క్రీడాకారిణి 3-6, 3-6 తేడాతో కార్నెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌ మొత్తం మీద ఒక్క బ్రేక్‌ పాయింట్‌ కూడా సాధించని ఆమె 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ 61వ ర్యాంకర్‌ ప్రత్యర్థితో మ్యాచ్‌లో మూడో ర్యాంకర్‌ ముగురుజా పూర్తిగా వెనకబడింది. తొలి సెట్‌ నుంచే కార్నెట్‌ జోరు ప్రదర్శించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె.. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి 3-0తో ఆధిపత్యం ప్రదర్శించింది. ముగురుజా కాస్త పుంజుకున్నట్లు కనిపించినా తన దూకుడు కొనసాగించిన కార్నెట్‌ ఆ సెట్‌ సొంతం చేసుకుంది. రెండో సెట్లో ఆరంభంలో కాస్త ప్రతిఘటించిన ముగురుజా ఆ తర్వాత తేలిపోయింది. ప్రత్యర్థి సర్వీస్‌లకు, షాట్లకు సమాధానం చెప్పలేకపోయింది. అయిదో గేమ్‌లో ఆమె సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆధిక్యం సాధించిన కార్నెట్‌ అదే జోష్‌లో మ్యాచ్‌ ముగించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్‌ కొంటావీట్‌ (ఇస్తోనియా) 2-6, 4-6తో 19 ఏళ్ల క్లారా (డెన్మార్క్‌) చేతిలో ఓడింది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే కొంటావీట్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన క్లారా.. విన్నర్లు, ఏస్‌లతో చెలరేగింది. ఆమె జోరు ముందు కొంటావీట్‌ నిలవలేకపోయింది. రెండో సెట్లో ఓ దశలో 4-2తో నిలిచిన కొంటావీట్‌ పుంజుకున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్క గేమ్‌ కూడా గెలవలేకపోయింది. అక్కడి నుంచి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచిన క్లారా విజయాన్ని అందుకుంది. 19 ఏళ్ల బ్రిటన్‌ భామ రదుకాను 4-6, 6-4, 3-6తో కొవినిచ్‌ (మాంటెనెగ్రో) చేతిలో ఓటమి పాలైంది. చేతి గాయానికి చికిత్స తీసుకుంటూ ఆడిన రదుకాను పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. తొలి సెట్‌ ఆరంభంలో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఆమె 3-0తో నిలిచింది. కానీ ఆ తర్వాత చేతికి చికిత్స తీసుకున్న ఆమె చివరి అయిదు గేమ్‌ల్లో మూడు సార్లు సర్వీస్‌ కోల్పోయి ఓడింది. కానీ రెండో సెట్లో పోరాటంతో గెలిచిన తను.. మూడో సెట్లో మాత్రం పైచేయి సాధించలేకపోయింది. రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌) 1-6, 6-4,  6-2తో వాంగ్‌ (చైనా)పై నెగ్గి మూడో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి సెట్‌లో కేవలం ఒక్క గేమ్‌ మాత్రమే నెగ్గి ఓటమి పాలైన ఆమె.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు సెట్లు ఖాతాలో వేసుకుంది. జాంగ్‌ (చైనా)తో పోరులో 4-6, 0-1తో వెనకబడ్డ దశలో 12వ సీడ్‌ రిబాకిన (కజకిస్థాన్‌) మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. మరోవైపు స్వైటక్‌, పవ్లిచెంకోవా, హలెప్‌ ముందంజ వేశారు.

కాస్త కష్టంగా: పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ ఫేవరేట్లలో ఒకడైన రష్యా కుర్రాడు మెద్వెదెవ్‌ కాస్త కష్టంగా మూడో రౌండ్‌ చేరాడు. రెండో రౌండ్లో ఈ రెండో సీడ్‌ ఆటగాడు 7-6 (7-1), 6-4, 4-6,  6-2తో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా)పై    గెలిచాడు. తొలి సెట్లో 4-2తో ఆధిక్యం సాధించిన మెద్వెదెవ్‌కు కిర్గియోస్‌ గట్టిపోటీనిచ్చాడు. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి దూకుడు ప్రదర్శించాడు. ఆ దశలో మెద్వెదెవ్‌ కూడా తిరిగి ప్రతిఘటించడంతో సెట్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. అందులో మెద్వెదెవ్‌ పైచేయి సాధించాడు. ఇక రెండో సెట్‌ చివర్లో ప్రత్యర్థిపై మెద్వెదెవ్‌ ఆధిపత్యం చలాయించాడు. కానీ మూడో సెట్లో కిర్గియోస్‌ పోరాటంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. నాలుగో సెట్‌ కూడా అదే విధంగా సాగుతుందనుకుంటే మెద్వెదెవ్‌ ఏకపక్షంగా మార్చేసి విజయాన్ని అందుకున్నాడు. అతను మ్యాచ్‌లో 31 ఏస్‌లు సంధించాడు. నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) 7-6 (7-1), 6-7 (5-7), 6-3, 6-3తో సెబాస్టియన్‌ (అర్జెంటీనా)పై, అయిదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6-4, 6-2, 6-0తో బెరాంకిస్‌ (లిథువేనియా)పై గెలిచారు. సిన్నర్‌, ఫ్రిట్జ్‌, అగర్‌, సిలిచ్‌ కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు. మరోవైపు ముర్రే (బ్రిటన్‌) 4-6, 4-6, 4-6తో క్వాలిఫయర్‌ డానియల్‌ (జపాన్‌) చేతిలో, 13వ సీడ్‌ ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా) 6-7 (6-8), 4-6, 4-6తో క్రిస్టోఫర్‌ (ఆస్ట్రేలియా) చేతిలో, దిమిత్రోవ్‌ (బల్గేరియా) 4-6, 4-6, 7-6   (7-4), 6-7 (2-7)తో పెయిర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడారు.

సానియా జోడీ ముందంజ: మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సానియా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం రాజీవ్‌ (అమెరికా)తో కలిసి శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా- రాజీవ్‌ జోడీ 6-3, 7-6 (7-3)తో అలెక్సాండ్ర- నికోల (సెర్బియా)పై గెలిచింది. ఈ సీజన్‌ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్తానని ప్రకటించిన సానియా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రాజీవ్‌తో కలిసి ఉత్తమ ప్రదర్శన చేసింది. గతేడాది క్రెజికోవాతో కలిసి రాజీవ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గాడు. తొలి సెట్లో ఆధిపత్యం ప్రదర్శించిన సానియా- రాజీవ్‌ జోడీకి రెండో సెట్లో ప్రతిఘటన ఎదురైంది. ఆ సెట్‌ హోరాహోరీగా సాగి టైబ్రేకర్‌కు దారితీసింది. అందులో సానియా జోడీ పైచేయి సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని