భళా యువ భారత్‌

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అందులో కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ సహా కీలక ఆటగాళ్లే ఉన్నారు. రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిపితే చివరికి అందుబాటులో ఉన్నది సరిగ్గా పదకొండు మందే. ఈ స్థితిలో మరో జట్టయితే మ్యాచ్‌ ఆడలేమని వెనక్కి తగ్గేదేమో.

Updated : 21 Jan 2022 11:24 IST

కొవిడ్‌ దెబ్బ కొట్టినా.. అదే దూకుడు
ఐర్లాండ్‌పై 174 పరుగుల విజయం
అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశం

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అందులో కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ సహా కీలక ఆటగాళ్లే ఉన్నారు. రిజర్వ్‌ ఆటగాళ్లతో కలిపితే చివరికి అందుబాటులో ఉన్నది సరిగ్గా పదకొండు మందే. ఈ స్థితిలో మరో జట్టయితే మ్యాచ్‌ ఆడలేమని వెనక్కి తగ్గేదేమో. ఆడినా.. ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక ఇబ్బంది పడేదేమో! కానీ యువ భారత్‌ ధైర్యంగా మైదానంలోకి అడుగు పెట్టింది. బ్యాటుతో, బంతితో అద్భుత ప్రదర్శన చేసి భారీ విజయాన్నందుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.

తరౌబా (ట్రినిడాడ్‌)

కొన్నేళ్ల కిందట రాహుల్‌ ద్రవిడ్‌ జూనియర్‌ కోచ్‌గా పగ్గాలందుకున్నప్పటి నుంచి అండర్‌-19 స్థాయిలో యువ ఆటగాళ్ల ఆటతీరు,   దృక్పథంలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో తెలిసిందే. పాఠశాల స్థాయి క్రికెట్‌ నుంచి అండర్‌-19లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెడుతున్న దశలో మామూలుగా కుర్రాళ్లలో కనిపించే భయం, బెరుకు ఈ తరం కుర్రాళ్లలో అస్సలు అగుపించడం లేదు. ఏ స్థాయి టోర్నీ అయినా ఆత్మవిశ్వాసంతో ఆడటం, ప్రతికూల పరిస్థితుల్లో దృఢంగా నిలబడి సత్తా చాటడం, ఐపీఎల్‌లో అవకాశం దక్కితే రెండు చేతులా అందిపుచ్చుకుని అదరగొట్టడం చూస్తూనే ఉన్నాం. రిషబ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ సహా చాలామంది కుర్రాళ్లు ఇలా ఎదిగిన వాళ్లే. ఇప్పుడు తాము కూడా తక్కువేం కాదని చాటుతున్నారు ప్రస్తుత అండర్‌-19 కుర్రాళ్లు. ద్రవిడ్‌ నెలకొల్పిన ప్రమాణాలను నిలబెడుతూ, ప్రస్తుత కోచ్‌ కనిత్కర్‌ శిక్షణలో నిలకడగా ఆడుతున్న కుర్రాళ్లు.. అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అందరి మనసులూ గెలిచారు. కరోనా ధాటికి మైదానంలోకి తుది జట్టును దింపడమే గగనమైన పరిస్థితుల్లో.. ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు.

ఎవ్వరూ తగ్గలేదు: కెప్టెన్‌ యశ్‌ ధూల్‌, వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ (ఆంధ్రా కుర్రాడు) సహా ఆరుగురు కీలక ఆటగాళ్లు కరోనాతో ఐసొలేషన్‌కు వెళ్లాక, అందుబాటులో ఉన్న 11 మందితోనే మ్యాచ్‌ ఆడినప్పటికీ భారత కుర్రాళ్ల స్థైర్యం ఎంతమాత్రం దెబ్బ తినలేదు. కొవిడ్‌ ప్రభావమే కనిపించనివ్వకుండా ఇటు బ్యాట్స్‌మెన్‌, అటు బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో చక్కటి ప్రదర్శన చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌ (88; 101 బంతుల్లో 12×4), రఘువంశీ (79; 79 బంతుల్లో 10×4, 2×6) చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరూ 25.4 ఓవర్లలోనే 164 పరుగులు జోడించారు. తర్వాత రాజ్‌ బవా (42), నిశాంత్‌ సింధు (36)ల బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లకు హంగారేర్కర్‌ (39 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 5×6) మెరుపులు తోడవడంతో భారత్‌ 5 వికెట్లకు 307 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్‌ బౌలర్లలో షెర్జాద్‌ (3/79) రాణించాడు. అనంతరం ఛేదనలో ప్రత్యర్థి జట్టు భారత బౌలర్ల ధాటికి విలవిలలాడి 39 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది. గర్వ్‌ సంగ్వాన్‌ (2/23), అనీశ్వర్‌ (2/11), కౌశల్‌ తంబె (2/8), హంగారేర్కర్‌ (1/17) ఐర్లాండ్‌ పతనంలో కీలక పాత్ర పోషించారు. కాక్స్‌ (28), మెక్‌బెత్‌ (32) మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్‌.. ఈ విజయంతో ఒక లీగ్‌ మ్యాచ్‌ మిగిలుండగానే క్వార్టర్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. లీగ్‌ దశలో భారత్‌ తన చివరి మ్యాచ్‌ను శనివారం ఉగాండాతో ఆడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని