మళ్లీ పాక్‌తోనే..

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు ఆగిపోయిన నేపథ్యంలో.. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ లాంటి టోర్నీలు వచ్చినపుడు అందరూ ఈ రెండు జట్ల పోరు కోసమే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఈ చిరకాల

Published : 22 Jan 2022 03:46 IST

భారత్‌ తొలి ప్రత్యర్థి దాయాదే
అక్టోబరు 23న మెగా పోరు
2022 టీ20 ప్రపంచకప్‌

దుబాయ్‌: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు ఆగిపోయిన నేపథ్యంలో.. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ లాంటి టోర్నీలు వచ్చినపుడు అందరూ ఈ రెండు జట్ల పోరు కోసమే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఈ చిరకాల ప్రత్యర్థుల పోరుపై ఉన్న ఆసక్తిని గమనించే రెండు జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచి, రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశలోనే వీటి మధ్య మ్యాచ్‌ ఉండేలా చూస్తుంది ఐసీసీ. కుదిరితే తమ తొలి మ్యాచ్‌లోనే భారత్‌, పాక్‌ తలపడే ఏర్పాటు చేస్తుంది కూడా. ఈ పోరుతో ప్రపంచకప్‌కు ఊపు తెచ్చే ఆలోచనతోనే ఇలా. గత ఏడాది కూడా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ ఒకే గ్రూప్‌లో ఉండి, తమ తొలి మ్యాచ్‌లో పరస్పరం తలపడటం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబరు-నవంబరు మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే జరగబోతోంది. సూపర్‌-12 దశలో గ్రూప్‌-2లో ఉన్న ఈ రెండు జట్లూ అక్టోబరు 23న ప్రఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో తమ తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. భారత్‌ తన రెండో సూపర్‌-12 మ్యాచ్‌ను ఆ నెల 27న సిడ్నీలో క్వాలిఫయర్‌ జట్టుతో ఆడుతుంది. తర్వాత 30న పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. నవంబరు 2న బంగ్లాదేశ్‌ను ఎదుర్కొంటుంది. తన చివరి సూపర్‌-12 మ్యాచ్‌ను నవంబరు 6న మరో క్వాలిఫయర్‌ జట్టుతో ఆడుతుంది భారత్‌. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. వీటికి రెండు క్వాలిఫయర్‌ జట్లు తోడవుతాయి. అక్టోబరు 22న ఆసీస్‌-కివీస్‌ పోరుతో టోర్నీ ఆరంభమవుతుంది. క్వాలిఫయింగ్‌ రౌండ్‌ 16 నుంచి జరుగుతుంది. మాజీ ఛాంపియన్లు వెస్టిండీస్‌, శ్రీలంక కూడా ఈ రౌండ్లో ఆడబోతున్నాయి. నవంబరు 9, 10 తేదీల్లో సెమీఫైనల్స్‌ (సిడ్నీ, అడిలైడ్‌).. 13న ఫైనల్‌ (మెల్‌బోర్న్‌) జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని