మార్చి నెలాఖరు నుంచేఐపీఎల్‌-15

ప్రపంచ క్రికెటాభిమానుల ఫేవరెట్‌ లీగ్‌ ఐపీఎల్‌.. ఇంకో రెండు  నెలల్లోనే మళ్లీ అభిమానుల్ని అలరించబోతోంది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ను కాస్త ముందుగానే, మార్చి నెలాఖర్లో మొదలుపెట్టడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

Updated : 23 Jan 2022 09:29 IST

ధ్రువీకరించిన బీసీసీఐ
భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించడానికి ప్రయత్నం
ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈ, దక్షిణాఫ్రికా
దిల్లీ

ప్రపంచ క్రికెటాభిమానుల ఫేవరెట్‌ లీగ్‌ ఐపీఎల్‌.. ఇంకో రెండు  నెలల్లోనే మళ్లీ అభిమానుల్ని అలరించబోతోంది. ఐపీఎల్‌ 15వ సీజన్‌ను కాస్త ముందుగానే, మార్చి నెలాఖర్లో మొదలుపెట్టడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ధ్రువీకరించాడు కూడా. ఫ్రాంఛైజీలన్నీ లీగ్‌ భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నాయని, అందుకోసం తాము చేయాల్సిందల్లా చేస్తామని, కానీ కొవిడ్‌ అదుపులోకి రాని పక్షంలో లీగ్‌ను మరోసారి విదేశానికి తరలించక తప్పదని షా సంకేతాలిచ్చాడు. ‘‘ఐపీఎల్‌ 15వ సీజన్‌ మార్చి చివరి వారం నుంచే మొదలై మే చివరి దాకా సాగుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. టోర్నీ భారత్‌లోనే జరగాలని ఎక్కువమంది ఫ్రాంఛైజీల యజమానులు కోరుకుంటున్నారు. కొత్త ఫ్రాంఛైజీలు అహ్మదాబాద్‌, లఖ్‌నవూ కూడా తోడవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ను భారత్‌లోనే జరపడానికి బీసీసీఐ చూస్తోంది. అందుకున్న ఏ అవకాశాన్నీ విడిచిపెట్టం. కానీ లీగ్‌లో భాగమైన వారి ఆరోగ్యాలను పణంగా పెట్టలేం కాబట్టి, కొవిడ్‌ తగ్గుముఖం పట్టని పరిస్థితుల్లో ప్రత్నామ్నాయ ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం’’ అని జై షా తెలిపాడు.

జరిగితే మహారాష్ట్రలోనే..: భారత్‌ వేదికగానే ఐపీఎల్‌ జరిగేట్లయితే.. ఫ్రాంఛైజీల సొంత నగరాలన్నింట్లో లీగ్‌ నిర్వహించే అవకాశాలు తక్కువే. కొవిడ్‌ అప్పటికి అదుపులోకి వచ్చినా..  మహారాష్ట్ర వరకే లీగ్‌ను పరిమితం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం రాకుండా ముంబయి, పుణె నగరాల్లో మాత్రమే లీగ్‌ను నిర్వహించాలని.. అదీ కుదరకపోతే లీగ్‌ను ముంబయికే పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ మార్చి నెలాఖరుకు కొవిడ్‌ అదుపులోకి రాక, భారత్‌లో లీగ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. గత రెండు సీజన్లలో మాదిరే యూఏఈకి టోర్నీని తరలించే అవకాశముంది. ఇందులో ఏమైనా ఇబ్బంది ఉంటే ఐపీఎల్‌ రెండో సీజన్‌కు వేదికైన దక్షిణాఫ్రికాను కూడా ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.


ఇటు శ్రేయస్‌.. అటు వార్నర్‌
వేలంలో సూపర్‌ స్టార్లు వీళ్లే
ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ప్రక్రియ

పీఎల్‌ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. 15వ సీజన్‌ ఆరంభానికి నెలన్నర ముందే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ వేలం జరగబోతోంది. బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతమున్న ఎనిమిది జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు, కొత్తగా లీగ్‌లోకి అడుగు పెడుతున్న రెండు జట్లు ఒప్పందాలు చేసుకున్న క్రికెటర్లు మినహా అందరూ ఈసారి వేలంలోకి వస్తున్నారు. పాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రక్రియ ఎప్పుడో పూర్తి కాగా.. తాజాగా కొత్త ఫ్రాంఛైజీల్లో ఒకటైన అహ్మదాబాద్‌ హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా ఎంచుకుని, రషీద్‌ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌లను జట్టులోకి తీసుకుంది. మరో నూతన జట్టు లఖ్‌నవూ కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా.. స్టాయినిస్‌, రవి బిష్ణోయ్‌లను ఆటగాళ్లుగా ఎంచుకుంది. మిగతా అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో దిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్లు శ్రేయస్‌ అయ్యర్‌, డేవిడ్‌ వార్నర్‌ల కోసం వేలంలో విపరీతమైన పోటీ నెలకొనే అవకాశముంది. వీరితో పాటు శిఖర్‌ ధావన్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌ లాంటి ఆటగాళ్లకు వేలంలో మంచి డిమాండే ఉండబోతోంది. 200 కంటే ఎక్కువ మంది అంతర్జాతీయ ఆటగాళ్లు వేలానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అత్యధికంగా వెస్టిండీస్‌ ఆటగాళ్లు 41 మంది వేలానికి రాబోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని