Published : 24 Jan 2022 05:09 IST

జ్వెరెవ్‌కు షపొవలోవ్‌ షాక్‌

క్వార్టర్స్‌లో నాదల్‌, బార్టీ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ జ్వెరెవ్‌ కథ ముగిసింది. అతడికి షాకిస్తూ షపొవలోవ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టైటిల్‌ ఫేవరెట్‌ రఫెల్‌ నాదల్‌ 14వ సారి ఈ టోర్నీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మహిళల నంబర్‌వన్‌ బార్టీ కూడా ముందంజ వేసింది.

మెల్‌బోర్న్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం. ఒలింపిక్‌ స్వర్ణ విజేత అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఔట్‌. ప్రిక్వార్టర్స్‌లో డెనిస్‌ షపొవలోవ్‌ (కెనడా) 6-3, 7-6 (5), 6-3తో జ్వెరెవ్‌కు షాకిచ్చాడు. ఈ టోర్నీలో క్వార్టర్స్‌ చేరడం 14వ సీడ్‌ షపొవలోవ్‌కు ఇదే తొలిసారి. మ్యాచ్‌లో ఆటగాళ్లిద్దరు చెరో మూడు ఏస్‌లు కొట్టారు. జ్వెరెవ్‌ 8 డబుల్‌ ఫాల్ట్‌లు, షపొవలోవ్‌ 11 డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తొలి మూడు రౌండ్లలో మొత్తం 11 గంటలు క్రీజులో గడిపిన షపొవలోవ్‌.. రెండు మ్యచ్‌లను నాలుగు సెట్లలో, ఒక మ్యాచ్‌ను అయిదు సెట్లలో గెలిచాడు. బలమైన ప్రత్యర్థి ప్రిక్వార్టర్స్‌ పోరును 2 గంటల 21 నిమిషాల్లో ముగించడంపై అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్‌ను మూడు సెట్లలో ముగిస్తానని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. బాగా ఆడా’’ అని మ్యాచ్‌ అనంతరం షపొవలోవ్‌ వ్యాఖ్యానించాడు. క్వార్టర్‌ఫైనల్లో అతడు రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)ను ఢీకొంటాడు. ఆరో సీడ్‌ నాదల్‌ నాలుగో రౌండ్లో 7-6 (14), 6-2, 6-2తో అడ్రియాన్‌ మన్నారినో (ఫ్రాన్స్‌)పై విజయం సాధించాడు. తొలి సెట్లో టైబ్రేక్‌ 28 నిమిషాలు సాగడం విశేషం. ఓ ర్యాలీ అయితే 25 షాట్ల పాటు కొనసాగింది. ఆ బ్రేక్‌లో పైచేయి సాధించిన నాదల్‌.. తర్వాతి రెండు సెట్లను అలవోకగా గెలుచుకున్నాడు. నాదల్‌ మ్యాచ్‌లో మొత్తం 16 ఏస్‌లు సంధించాడు. 42 విన్నర్లు కొట్టాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అత్యధికసార్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరిన ఆటగాళ్ల జాబితాలో నాదల్‌ (14 సార్లు) జాన్‌ న్యూకోంబ్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఫెదరర్‌ (15 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఏడో సీడ్‌ బెరెటిని (ఇటలీ) కూడా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించాడు. నాలుగో రౌండ్లో అతడు 7-5, 7-6 (7-4), 6-4తో కరెనో బుస్టా (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. పదునైన సర్వీసులు చేసిన బెరెటిని ఏకంగా 28 ఏస్‌లు సంధించాడు. 57 విన్నర్లు కూడా కొట్టాడు. సెమీస్‌లో స్థానం కోసం అతడు మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)ను ఢీకొంటాడు. మోన్‌ఫిల్స్‌ 7-5, 7-6 (7-4), 6-3తో కెస్మనోవిచ్‌ (సెర్బియా)ను ఓడించాడు.

బార్టీ ముందుకు..: మహిళల సింగిల్స్‌లో నంబర్‌వన్‌ అష్లీ బార్టీ (ఆస్ట్రేలియా) క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-4, 6-3తో అమందా అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె జెస్సికా పెగులా (అమెరికా)తో తలపడుతుంది. పెగులా 7-6 (0), 6-3తో అయిదో సీడ్‌ మరియా సకారి (గ్రీస్‌)ని మట్టికరిపించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ బార్బరా క్రెజికోవా (చెక్‌) 6-2, 6-2తో అజరెంక (బెలారస్‌)ను చిత్తు చేసి తుది ఎనిమిదో చోటు దక్కించుకుంది. మరో ప్రిక్వార్టర్స్‌లో కీస్‌ (అమెరికా) 6-3, 6-1తో ఎనిమిదో సీడ్‌ బదోసా (స్పెయిన్‌)ను అలవోకగా ఓడించింది.

మిక్స్‌డ్‌ క్వార్టర్స్‌లో సానియా- రాజీవ్‌ రామ్‌ జోడీ: సానియా మీర్జా, రాజీవ్‌ రామ్‌ (అమెరికా) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. రెండో రౌండ్లో ఈ జోడీ 7-6 (8-6), 6-4తో పెరెజ్‌ (ఆస్ట్రేలియా), మిడెల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని