Published : 24 Jan 2022 05:11 IST

పోరాడినా.. పరాభవమే

చివరి వన్డేలోనూ భారత్‌ ఓటమి

0-3తో సిరీస్‌ వైట్‌వాష్‌

దీపక్‌ అద్భుత పోరాటం వృథా

కేప్‌టౌన్‌

లక్ష్యం 288.. ధావన్‌, కోహ్లి అర్ధశతకాలతో ఓ దశలో టీమ్‌ఇండియా స్కోరు 156/3. విరాట్‌ క్రీజులో.. ఇంకా ఏడు వికెట్లు చేతిలో.. ఆ సమయంలో జట్టు గెలుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ మరోసారి మిడిలార్డర్‌ వైఫల్యంతో కీలక వికెట్లు కోల్పోయి 210/6తో ఓటమి దిశగా సాగింది. ఇక పరాజయం ఖాయమనే సమయంలో దీపక్‌ చాహర్‌ అద్భుతంగా పోరాడాడు. సంచలన అర్ధశతకంతో జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. కానీ ఆఖర్లో అతను పెవిలియన్‌ చేరడంతో ఓటమి తప్పలేదు. చివరి వన్డేలోనూ ఓడిన భారత్‌కు 0-3తో వైట్‌వాష్‌ పరాభవమే మిగిలింది. దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో మొదలెట్టిన జట్టు.. ఓటమితో ముగించింది.

మారని ఆట.. మళ్లీ పాత కథ.. దీంతో టీమ్‌ఇండియాకు మరోసారి   పరాజయమే మిగిలింది. కాకపోతే దీపక్‌ చాహర్‌ (54; 34 బంతుల్లో 5×4, 2×6) పోరాటంతో మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వచ్చింది.. అంతే తేడా! మరోసారి మిడిలార్డర్‌ వైఫల్యంతో ఆదివారం మూడో వన్డేలో భారత్‌ 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీ సేన 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డికాక్‌ (124; 130 బంతుల్లో 12×4, 2×6) శతకానికి తోడు.. వాండర్‌డసెన్‌ (52; 59 బంతుల్లో 4×4, 1×6) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (3/59), బుమ్రా (2/52)తో పాటు దీపక్‌ (2/53) కూడా సత్తాచాటాడు. ఛేదనలో భారత్‌ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. ధావన్‌ (61; 73 బంతుల్లో 5×4, 1×6), కోహ్లి (65; 84 బంతుల్లో 5×4) అర్ధసెంచరీలతో మెరిశారు. ఓటమి దిశగా సాగుతున్న జట్టుకు గెలుపు ఆశలు రేపిన దీపక్‌ చివర్లో ఔటవడం జట్టును దెబ్బతీసింది. సఫారీ బౌలర్లలో ఎంగిడి (3/58), ఫెలుక్వాయో (3/40), ప్రిటోరియస్‌ (2/54) ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్‌ కోసం టీమ్‌ఇండియా వెంకటేశ్‌, అశ్విన్‌, శార్దూల్‌, భువనేశ్వర్‌ స్థానాల్లో సూర్యకుమార్‌, జయంత్‌, దీపక్‌, ప్రసిద్ధ్‌ను తీసుకుంది.

అదే వ్యథ..: టాప్‌ఆర్డర్‌ రాణించడం.. మిడిలార్డర్‌ దెబ్బకొట్టడం.. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటములకు కారణమిది. ఈ మ్యాచ్‌లోనే అదే జరిగింది. ఛేదనలో రాహుల్‌ (9) మరోసారి నిరాశపరిచాడు. ధావన్‌కు కోహ్లి జత కలవడంతో ఇబ్బంది లేదనిపించింది. ముఖ్యంగా తన విలువను మరోసారి చాటుతూ ఈ సిరీస్‌లో ధావన్‌ రెండో అర్ధశతకాన్ని అందుకున్నాడు. కోహ్లి తన క్లాస్‌ ఆటతీరుతో మురిపించాడు. 22 ఓవర్లకు జట్టు 116/1తో మంచి స్థితిలో  నిలిచింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే 98 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఒకే ఓవర్లో ధావన్‌, పంత్‌ (0)లను ఔట్‌ చేసిన ఫెలుక్వాయో జట్టును దెబ్బకొట్టాడు. అనవసర షాట్లకు ప్రయత్నించి ఈ ఇద్దరూ  పెవిలియన్‌ చేరారు. ఆ దశలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. శ్రేయస్‌ (26)తో కలిసి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. శ్రేయస్‌ కూడా నిలబడడంతో జట్టు 30 ఓవర్లకు 152/3తో కోలుకున్నట్లు కనిపించింది. కానీ కోహ్లి వికెట్‌తో మ్యాచ్‌ మలుపు తిరిగింది. కేశవ్‌ (1/39) బౌలింగ్‌లో అనూహ్యంగా స్పిన్‌, బౌన్స్‌ అయిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లి.. కవర్‌ పాయింట్‌లో వెనక్కి   పరిగెడుతూ బవుమా పట్టిన క్యాచ్‌కు ఔటయ్యాడు.

అయినా దక్కలేదు..: సూర్య కుమార్‌ (39) దూకుడుతో ఇన్నింగ్స్‌ గాడిన పడుతుందనే సమయంలో స్వల్ప వ్యవధిలో అతనితో పాటు శ్రేయస్‌ వెనుదిరగడం దెబ్బతీసింది. విజయంపై దాదాపుగా నమ్మకం కోల్పోయిన దశలో.. చాహర్‌ అద్భుతంగా పోరాడాడు. 44వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో సాధించాల్సిన రన్‌రేట్‌ను అందుబాటులోకి తెచ్చాడు. ఒక్కో ఫోర్‌తో జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. 46వ ఓవర్లో చివరి రెండు బంతులను అతను ఫోర్లుగా మలచడంతో విజయ సమీకరణం 24 బంతుల్లో 21గా మారింది. ఆ వెంటనే 31 బంతుల్లో అతను అర్ధశతకాన్ని చేరుకున్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ రెండేసి పరుగులు తీసిన దీపక్‌, బుమ్రా (12).. లక్ష్యాన్ని కరిగించారు. 47వ ఓవర్లో 11 పరుగులు రావడంతో జట్టు విజయానికి 18 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. గెలుపుపై ధీమా వచ్చిన సందర్భమది. కానీ ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే దీపక్‌ ఔటవడంతో భారత ఆశలు కుప్పకూలాయి. బుమ్రా కూడా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా.. రెండో బంతికి చాహల్‌ (2) ఔటవడంతో జట్టు ఓటమి పాలైంది.

మధ్యలో వదిలేశారు: టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ దాడిని మెరుగ్గా ప్రారంభించి.. గొప్పగా ముగించింది. కానీ మధ్య ఓవర్లలో మాత్రం పట్టు విడిచింది. డికాక్‌ను బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. అతను స్వేచ్ఛగా పరుగులు రాబట్టాడు. కానీ ఆఖర్లో పుంజుకున్న బౌలర్లు ఆ జట్టుకు కళ్లెం వేశారు. అంతకుముందు ఆరంభంలో కొత్తబంతితో దీపక్‌ ప్రమాదకరంగా కనిపించాడు. స్వింగ్‌, పేస్‌ను ఉపయోగించుకుంటూ మెరుగ్గా బంతులేశాడు. తన రెండో ఓవర్‌ తొలి బంతికే ఫామ్‌లో ఉన్న మలన్‌ (1)ను వెనక్కిపంపి ప్రత్యర్థికి షాకిచ్చాడు. రాహుల్‌ సూపర్‌ ఫీల్డింగ్‌తో బవుమా (8) రనౌటవడం.. మార్‌క్రమ్‌ (15)కు కుదురుకునే అవకాశం ఇవ్వకుండా దీపక్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ పట్టు బిగించేలా కనిపించింది. కానీ అప్పటికే పరుగుల వేటలో సాగుతున్న డికాక్‌కు వాండర్‌డసెన్‌ తోడవడంతో సఫారీ జట్టు పుంజుకుంది. ఈ జోడీకి సమస్యలు సృష్టించడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. ఎలాంటి తడబాటు లేకుండా బ్యాటింగ్‌ కొనసాగించిన డికాక్‌ అర్ధశతకం అందుకున్నాడు. దీంతో 20 ఓవర్లలో ఆ జట్టు 103/3తో నిలిచింది. అక్కడి నుంచి డికాక్‌ గేర్‌ మార్చాడు. స్పిన్నర్‌ జయంత్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదాడు. చాహల్‌ కూడా మధ్య ఓవర్లలో డికాక్‌, వాండర్‌డసెన్‌ జోడీకి సవాలు విసరలేకపోయాడు. స్లాగ్‌ స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌లతో ఫోర్లు రాబట్టిన డికాక్‌ వేగంగా 90ల్లో అడుగుపెట్టాడు. బౌలర్‌ తలమీదుగా సిక్సర్‌తో 99కి చేరుకున్న అతను.. 108 బంతుల్లో శతకం సాధించాడు. మరోవైపు వాండర్‌డసెన్‌ కూడా దూకుడు కొనసాగించి అర్ధసెంచరీ అందుకున్నాడు. 35 ఓవర్లకు స్కోరు 212/3. దీంతో ఆ జట్టు 320కి పైగా పరుగులు చేస్తుందేమోననిపించింది. కానీ ఉత్తమ బౌలింగ్‌తో, మెరుపు ఫీల్డింగ్‌తో భారత్‌ తిరిగి పోటీలోకి వచ్చింది. వరుస ఓవర్లలో డికాక్‌, వాండర్‌డసెన్‌లను వెనక్కిపంపింది. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. జట్టుకు కావాల్సిన వికెట్‌ అందించాడు. షార్ట్‌పిచ్‌ బంతితో డికాక్‌ ఇన్నింగ్స్‌కు తెరదించిన అతను 144 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే చాహల్‌ (1/47) బౌలింగ్‌లో డైవ్‌ చేస్తూ శ్రేయస్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వాండర్‌డసెన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే ఫెలుక్వాయో (4) రనౌట్‌ కావడంతో ఆ జట్టు 41 ఓవర్లకు 229/6తో నిలిచింది. మిల్లర్‌ (39), ప్రిటోరియస్‌ (20) కొన్ని షాట్లు ఆడడంతో జట్టు 300 పరుగుల దిశగా సాగింది. కానీ చివర్లో స్లో డెలివరీలతో బ్యాటర్లను ప్రసిద్ధ్‌ బోల్తా కొట్టించాడు. దీంతో మరో బంతి మిగిలి ఉండగానే ఆ జట్టు ఆలౌటైంది. భారత్‌ 73 పరుగులకే చివరి 7 వికెట్లు పడగొట్టింది.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) ధావన్‌ (బి) బుమ్రా 124; మలన్‌ (సి) పంత్‌ (బి) దీపక్‌ 1; బవుమా రనౌట్‌ 8; మార్‌క్రమ్‌ (సి) రుతురాజ్‌ (బి) దీపక్‌ 15; వాండర్‌డసెన్‌ (సి) శ్రేయస్‌ (బి) చాహల్‌ 52; మిల్లర్‌ (సి) కోహ్లి (బి) ప్రసిద్ధ్‌ 39; ఫెలుక్వాయో రనౌట్‌ 4; ప్రిటోరియస్‌ (సి) సూర్యకుమార్‌ (బి) ప్రసిద్ధ్‌ 20; కేశవ్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; మెగాలా (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; ఎంగిడి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం: (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 287; వికెట్ల పతనం: 1-8,   2-34, 3-70, 4-214, 5-218, 6-228, 7-272, 8-282, 9-287; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 8-0-53-2; బుమ్రా 10-0-52-2; ప్రసిద్ధ్‌ కృష్ణ 9.5-0-59-3; జయంత్‌ 10-0-53-0; చాహల్‌ 9-0-47-1; శ్రేయస్‌ 3-0-21-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) మలన్‌ (బి) ఎంగిడి 9; ధావన్‌ (సి) డికాక్‌ (బి) ఫెలుక్వాయో 61; కోహ్లి (సి) బవుమా (బి) కేశవ్‌ 65; పంత్‌ (సి) మెగాలా (బి) ఫెలుక్వాయో 0; శ్రేయస్‌ (సి) ఫెలుక్వాయో (బి) మెగాలా 26; సూర్యకుమార్‌ (సి) బవుమా (బి) ప్రిటోరియస్‌ 39; దీపక్‌ చాహర్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) ఎంగిడి 54; జయంత్‌ (సి) బవుమా (బి) ఎంగిడి 2; బుమ్రా (సి) బవుమా (బి) ఫెలుక్వాయో 12; చాహల్‌ (సి) మిల్లర్‌ (బి) ప్రిటోరియస్‌ 2; ప్రసిద్ధ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (49.2 ఓవర్లలో ఆలౌట్‌) 283; వికెట్ల పతనం:  1-18, 2-116, 3-118, 4-156, 5-195, 6-210, 7-223, 8-278, 9-281;   బౌలింగ్‌: ఎంగిడి 10-0-58-3; ప్రిటోరియస్‌ 9.2-0-54-2; మెగాలా 10-0-69-1; కేశవ్‌ 10-0-39-1; ఫెలుక్వాయో 7-0-40-3; మార్‌క్రమ్‌ 3-0-21-0

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని