
ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ ఓటమి
బ్రిడ్జ్‌టౌన్: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అకీల్ హొస్సేన్ (44 నాటౌట్; 16 బంతుల్లో 3×4, 4×6), రొమారియో షెపర్డ్ (44 నాటౌట్; 28 బంతుల్లో 1×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో అలరించినప్పటికీ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. జేసన్ రాయ్ (45), మొయిన్ అలీ (31) రాణించడంతో మొదట ఇంగ్లాండ్ 8 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ఛేదనలో వెస్టిండీస్ 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. లక్ష్యానికి విండీస్ అంత దగ్గరగా రాగలదని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే 17 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 111/8. చేతిలో రెండే వికెట్లు ఉండగా.. చివరి మూడు ఓవర్లలో 61 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ షెపర్డ్, పదో నంబర్ బ్యాట్స్‌మన్ అకీల్ పెను విధ్వంసం సృష్టించారు. జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో షెపర్డ్ వరుసగా 3 సిక్స్‌లు కొట్టాడు. చివరి ఓవర్లో (మహమూద్) వెస్టిండీస్‌కు 30 పరుగులు అవసరం కాగా.. అకీల్ రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు దంచాడు. బౌలర్ రెండు వైడ్లు కూడా వేయడంతో ఆ ఓవర్లో మొత్తం 28 పరుగులొచ్చాయి. అయిదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.