
పతక వీరుల జాతీయ గీతాలాపన
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచిన పతక వీరులు మళ్లీ ఒక్క దగ్గర కలిశారు. ఆటలో తమ ప్రదర్శనతో కోట్లాది మందికి ప్రేరణగా నిలిచిన ఈ విజేతలు.. ఇప్పుడు జాతీయ గీతాలాపనతో జనాల హృదయాలను కదిలించారు. క్రీడల వైపు నడిచేలా భవిష్యత్ తరానికి స్ఫూర్తి నింపేందుకు టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ నీలేశ్ కులకర్ణి.. అంతర్జాతీయ క్రీడా మేనేజ్మెంట్ సంస్థ (ఐఐఎస్ఎం)తో కలిసి ఈ ఛాంపియన్లతో వీడియో రూపొందించాడు. తమ స్ఫూర్తికరమైన ప్రయాణాన్ని చాటుతూ సాగిన వీడియోలో ఈ అథ్లెట్లు జాతీయ గీతాన్ని పాడారు. గతేడాది టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని సాధించిన నీరజ్ చోప్రాతో పాటు రవి కుమార్, మీరాబాయి, పీఆర్ శ్రీజేష్, లవ్లీనా.. పారాలింపిక్స్‌లో అదరగొట్టిన సుమిత్ అంతిల్, భవీనా, ప్రమోద్, కృష్ణ తదితరులు అందులో భాగమయ్యారు. ‘‘ఓ సైనికుడిగా, అథ్లెట్‌గా విదేశాల్లో మన జాతీయ గీతం వినడం గర్వంగా అనిపిస్తుంది. ఇతర దేశాల ప్రజల కూడా మన జాతీయ గీతాన్ని పాడుతుంటే అది మనకు గౌరవం ఇచ్చినట్లు. మా అందరికీ ఇదెంతో గర్వకారణం’’ అని నీరజ్ చోప్రా పేర్కొన్నాడు.