Updated : 25 Jan 2022 08:27 IST

IND vs SA : ఒక పర్యటన.. ఎన్నో సమస్యలు

ఈనాడు క్రీడావిభాగం

ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీమ్‌ఇండియా. కానీ చివరికి ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో సిరీస్‌లు కోల్పోయి ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది. విజయాలు దక్కకపోగా.. బోలెడన్ని సమస్యలను మూటగట్టుకుంది భారత్‌. ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించుకోకుంటే.. మున్ముందు చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు.

సారథి ఎవరు?

భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించి చివరగా పెద్ద చర్చ జరిగిందంటే.. సౌరభ్‌ గంగూలీపై వేటు పడ్డపుడే. మళ్లీ ఇప్పుడు నాయకత్వ మార్పు పెద్ద వివాదంగా మారింది. కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తప్పించడం ఇప్పుడు భారత క్రికెట్‌నే ఒక సందిగ్ధ స్థితికి తీసుకొచ్చింది. తనతో సెలక్టర్లు, బీసీసీఐ వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురై టెస్టు పగ్గాలు కూడా వదిలేశాడు కోహ్లి. ఇప్పుడు టెస్టు కెప్టెన్‌ ఎవరు అనే అయోమయం అందరిలోనూ నెలకొంది. టెస్టుల్లో రోహిత్‌ ఇంకా స్థిరత్వం సాధించేలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు అవకాశం దక్కుతుందనుకున్నారు. కానీ జట్టును నడిపించిన ఒక టెస్టు మ్యాచ్‌లో, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా ఆకట్టుకోలేకపోయాడు. శ్రేయస్‌, పంత్‌ లాంటి వాళ్లు కెప్టెన్సీ అందుకునేంత పరిణతి ఇంకా సాధించలేదన్నది విశ్లేషకుల మాట. దీంతో కోహ్లి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మిడిల్‌ మారేదెప్పుడు?

చాలా ఏళ్ల పాటు టీమ్‌ఇండియా మిడిలార్డర్‌కు పెద్ద బలంగా నిలిచాడు ధోని. అయితే అతను జోరు తగ్గినప్పటి నుంచి భారత్‌ ఇబ్బంది పడుతోంది. ధోని రిటైరవడానికి ముందు రెండు మూడేళ్లు భారత్‌ మిడిలార్డర్‌ సమస్యగా మారింది. అతను వెళ్లిపోయాక చెప్పాల్సిన పని లేదు. దశాబ్దానికి పైగా మిడిలార్డర్‌ బాధ్యతను ధోని ఎంత గొప్పగా నిర్వర్తించాడో అతను వెళ్లిపోయాక కానీ అర్థం కాలేదు. ధోనీలా కాకపోయినా ఓ మోసరుగా ఆడేవాళ్లు కనిపించడం లేదు. పంత్‌, శ్రేయస్‌, సూర్యకుమార్‌ అప్పుడప్పుడూ ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడటమే తప్ప.. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి, భాగస్వామ్యాలు నిర్మించి జట్టును నిలకడగా గెలిపించట్లేదు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు గెలుపు అవకాశాలు వచ్చాయి. మిడిలార్డర్‌ వైఫల్యంతోనే ఓటములు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

మరో కపిల్‌ ఎక్కడ?

ప్రపంచ మేటి జట్లన్నింటికీ పేస్‌  ఆల్‌రౌండర్లే బలం. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ లాంటి జట్లలో ఒకరికి మించి నాణ్యమైన ఆల్‌రౌండర్లున్నారు. కానీ భారత్‌ మాత్రం ఒక మోస్తరుగా ఆడే పేస్‌ ఆల్‌రౌండర్‌ కోసం దశాబ్దాల నుంచి నిరీక్షిస్తోంది. ఆశలు రేపిన ఎంతోమంది ఆటగాళ్లు వేగంగా కనుమరుగైపోయిన వాళ్లే. బౌలింగ్‌ బాగా చేస్తే బ్యాటింగ్‌ ఉండదు. బ్యాటింగ్‌ బాగుంటే బౌలింగ్‌ తేడా కొడుతుంది. చాలా ఏళ్లకు హార్దిక్‌ పాండ్య రూపంలో రెండు విధాలా ఉపయోగపడే నాణ్యమైన ఆల్‌రౌండర్‌ దొరికాడని అంతా సంబరపడ్డారు. మరో కపిల్‌ దేవ్‌ అంటూ అతణ్ని ఆకాశానికెత్తేశారు. కానీ వెన్నుకు చికిత్స చేసుకున్నప్పటి నుంచి అతను బౌలింగ్‌ చేయడమే గగనమైంది. కేవలం బ్యాటింగ్‌ కోసం అతణ్ని జట్టులో పెట్టుకునే పరిస్థితి లేదు. పైగా తరచుగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు జట్టులో స్థానమే ప్రశ్నార్థకమైంది. వెంకటేశ్‌ అయ్యర్‌ ఆశలు రేపినా.. దక్షిణాఫ్రికాపై ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేదు. సరైన ఆల్‌రౌండర్లు లేక జట్టు సమతూకమే దెబ్బ తింటోందని స్వయంగా కోచ్‌ ద్రవిడే అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

స్పిన్నూ సున్నానే..

భారత్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ జరుగుతున్నపుడు ఇరు జట్లలో స్పిన్‌ పరంగా ఎవరిది పైచేయిగా ఉంటుందని భావిస్తాం? ఈ ప్రశ్న ఎవరినడిగినా.. భారత్‌ అనే సమాధానం చెబుతారు. కానీ సఫారీలతో వన్డే సిరీస్‌లో భారత స్పిన్నర్లు తుస్సుమనిపించారు. అలాగని పిచ్‌లు స్పిన్‌కు అస్సలు సహకరించలేదా..? ప్రత్యర్థి స్పిన్నర్లు కూడా విఫలమయ్యారా అంటే అదేమీ కాదు. షంసి, కేశవ్‌ మహరాజ్‌లతో పాటు పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ మార్‌క్రమ్‌ కూడా సత్తా చాటాడు కానీ.. మన స్పిన్నర్లు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అశ్విన్‌, చాహల్‌, జయంత్‌ యాదవ్‌ కలిసి మూడు మ్యాచ్‌ల్లో 59 ఓవర్లు వేస్తే పడ్డ వికెట్లు 3 మాత్రమే. ఎంతో అనుభవం ఉన్న అశ్విన్‌, చాహల్‌ ఇలాంటి ప్రదర్శన చేయడం నిరాశ కలిగించేదే.

కోహ్లి.. ఇక ఇంతేనా?

కెప్టెన్‌గా భారత జట్టుకు ఎంతో చేసిన కోహ్లి.. ఇటీవల అనూహ్య పరిణామాలతో మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు వదిలేశాడు. అందుకు దారి తీసిన కారణాలేంటి, ఇందులో ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే.. నాయకత్వ భారం దిగిపోయింది కాబట్టి.. ఇక బ్యాటుతో చెలరేగిపోతాడని అనుకున్నారు అభిమానులు. కానీ సఫారీలతో వన్డే సిరీస్‌లో అతను రెండు అర్ధశతకాలతో సరిపెట్టాడు. అవి కూడా ఒకప్పటంతా సాధికారిక ఇన్నింగ్స్‌లు కావు. క్రీజులో మునుపటిలా సౌకర్యంగా కనిపించట్లేదు విరాట్‌. స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌లో వేగం ఉండట్లేదు. కోహ్లి బ్యాట్‌ నుంచి మూడంకెల స్కోరు కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి రావడం అనూహ్యం. కెప్టెన్సీ వివాదంతో విరాట్‌ మానసికంగా మరింత దెబ్బ తిన్నట్లుండి అతడి వాలకం చూస్తుంటే. మునుపటి ఫామ్‌ అందుకుంటాడన్న ఆశలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. మళ్లీ ఒకప్పటి కోహ్లీని చూస్తామో లేదో?

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని