
ఏఎఫ్సీదే తప్పంతా
భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు కోచ్
ముంబయి: భారత మహిళల జట్టులో డజనుకు పైగా కరోనా కేసులు వెలుగు చూడటానికి ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) నిర్లక్ష్యమే కారణమని కోచ్ థామస్ డెనెర్బీ ఆరోపించాడు. ఆసియా కప్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్ ఎంతమాత్రం సురక్షితం కాదని విమర్శించాడు. భారత జట్టులో డజనుకు పైగా క్రీడాకారిణులు పాజిటివ్‌గా తేలడంతో ఆదివారం చైనీస్ తైపీతో జరగాల్సిన గ్రూపు మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. దీంతో ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనాలనుకున్న భారత జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భారత జట్టు ఫిఫా ప్రపంచకప్ కల చెదరడంలో క్రీడాకారిణుల లోపం లేదని.. బుడగను ఏర్పాటు చేసిన ఏఎఫ్సీదే పూర్తిగా తప్పని డెనెర్బీ విమర్శించాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు పట్ల ఏఎఫ్సీ గౌరవం, కరుణ, సానుభూతి చూపించలేదని ఆగ్రహం వ్యక్తంజేశాడు. ‘‘హోటల్‌కు వచ్చిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో మా అందరికీ నెగటివ్ వచ్చింది. ప్రాక్టీస్‌కు వెళ్లిన రోజు మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాతి రోజు ఏడుగురు హోటల్ సిబ్బంది పాజిటివ్‌గా తేలారు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోడానికి రాకెట్ సైన్స్ అవసరం లేదు. ఈనెల 17న హోటల్ సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా.. 18న ఏడుగురు పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. అయితే 19న మధ్యాహం తర్వాత ఈ సమాచారం ఇచ్చారు. ఒకరోజంతా ఏఎఫ్సీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. క్రీడాకారులకు చేసినట్లుగా ప్రతి మూడు రోజులకు కాకుండా ఆరు రోజులకోసారి హోటల్ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. హోటల్ సిబ్బందిపై ఏఎఫ్సీ వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్లంతా మాకు సేవలు అందించారు. ఏఎఫ్సీ ఒకరోజంతా ఎదురుచూసింది. మా కలను ఏఎఫ్సీ నాశనం చేసింది. పాజిటివ్ కేసులు రావడంలో మా పొరపాటు లేదు. ఇదో అసాధారణ పరిస్థితి. దీనికి ఏఎఫ్సీ పరిష్కారం కనుగొనాల్సింది. మ్యాచ్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాల్సింది. కాని ఏఎఫ్సీ మమ్మల్ని నిందించడానికి ప్రయత్నిస్తుండటం బాధగా ఉంది. ఇది సిగ్గుచేటు’’ అని డెనెర్బీ పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.