ఎదురులేని బార్టీ

ఆష్లీ బార్టీ అదరహో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 42 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్‌ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.

Updated : 28 Jan 2022 06:54 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

అలవోకగా ఫైనల్లో ప్రవేశం  

కొలిన్స్‌తో టైటిల్‌ పోరు

ఆష్లీ బార్టీ అదరహో. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఈ ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. 42 ఏళ్లలో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్‌ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. అంతే కాదు.. ఫైనల్లో గెలిస్తే 1978 తర్వాత ఈ టైటిల్‌ చేజిక్కించుకున్న మొదటి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా కూడా నిలుస్తుంది. తుది పోరులో బార్టీ.. అమెరికా అమ్మాయి కొలిన్స్‌ను ఢీకొంటుంది. కొలిన్స్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

టాప్‌ సీడ్‌ ఆష్లీ బార్టీ తన తొలి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గురువారం ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో ఆమె 6-1, 6-3తో అన్‌సీడెడ్‌ మ్యాడిసన్‌ కీస్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. వెండీ టర్న్‌బుల్‌ (1980) తర్వాత ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి ఆస్ట్రేలియా మహిళగా బార్టీ నిలిచింది. సెమీస్‌ చేరే క్రమంలో 17 గేములు మాత్రమే కోల్పోయిన బార్టీ.. అదే జోరును కొనసాగించింది. ఆమెకు కీస్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్‌లో బార్టీ 20 విన్నర్లు కొట్టగా.. కీస్‌ ఎనిమిది మాత్రమే కొట్టింది. ఆరు బ్రేక్‌ పాయింట్లలో నాలుగింటిని సద్వినియోగం చేసుకున్న బార్టీ..  తన సర్వీసులో ఎదుర్కొన్న రెండు బ్రేక్‌ పాయింట్లనూ కాపాడుకుంది. ఆమె టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్కసారి సర్వీసును కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు వింబుల్డన్‌, ఫ్రెంచ్‌  ఓపెన్‌ టైటిళ్లు గెలిచిన బార్టీ.. ఇప్పుడు మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం తహతహలాడుతోంది. ‘‘ఫైనల్‌ చేరడాన్ని నమ్మలేకపోతున్నా. సొంతగడ్డపై ఆస్ట్రేలియన్‌   ఓపెన్‌లో ఆడడం నాకెంతో ఇష్టం. ఇప్పుడు నాకు టైటిల్‌ గెలిచే అవకాశముంది’’ అని మ్యాచ్‌ అనంతరం బార్టీ వ్యాఖ్యానించింది. సెమీస్‌లో బార్టీకి ఏమాత్రం ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించి శుభారంభం చేసిన ఆమె.. ఆ తర్వాత అయిదు, ఏడో గేమ్‌లో బ్రేక్‌లతో సెట్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్లోనూ జోరు కొనసాగించింది. ఆరో గేమ్‌లో బ్రేక్‌తో 4-2 ఆధిక్యం సంపాదించిన బార్టీ.. ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుంటూ పెద్దగా శ్రమ పడకుండానే సెట్‌ను చేజిక్కించుకుంది. మ్యాచ్‌లో ఆమె అయిదు ఏస్‌లు కొట్టింది. 24 అనసవర తప్పిదాలతో కీస్‌ మూల్యం చెల్లించుకుంది.

కొలిన్స్‌ జోరు..: తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం ఆరాటపడుతోన్న డానియెల్‌ కొలిన్స్‌.. ఫైనల్లో బార్టీని ఢీకొట్టనుంది. 27వ సీడ్‌ కొలిన్స్‌ సెమీఫైనల్లో 6-4, 6-1తో ఏడో సీడ్‌ స్వైటెక్‌ (చెక్‌)ను ఓడించింది. ఆమె రెండు సెట్లలోనూ తొలి గేముల్లోనే ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. రెండు సెట్లలోనూ 4-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి.. ఆ తర్వాత పైచేయి సాధించింది. ఏడు ఏస్‌లు, 27 విన్నర్లు కొట్టిన ఆమె..13 అనవసర తప్పిదాలు మాత్రమే చేసింది.

ఆస్ట్రేలియాదే పురుషుల డబుల్స్‌: ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్యే పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ జరగనుంది. కిర్గియోస్‌-కొకినాకిస్‌ జంట (ఆస్ట్రేలియా) టైటిల్‌ పోరులో మాథ్యూ ఎబ్డెన్‌-మ్యాక్స్‌ పుర్సెల్‌ (ఆస్ట్రేలియా) జోడీని ఢీకొట్టనుంది. సెమీస్‌లో కిర్గియోస్‌-కొకినాకిస్‌ ద్వయం 7-6 (7-4), 6-4తో గ్రానోలర్స్‌ (స్పెయిన్‌), జెబలోస్‌ (అర్జెంటీనా) జోడీని ఓడించగా.. ఎబ్డెన్‌-పుర్సెల్‌ జోడీ 6-3, 7-6 (11-9)తో రాజీవ్‌ రామ్‌ (అమెరికా),   సలిస్‌బరీ (బ్రిటన్‌) ద్వయంపై గెలిచింది.

పురుషుల సెమీస్‌ నేడు: పురుషుల సింగిల్స్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. శుక్రవారమే సెమీఫైనల్స్‌. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో రికార్డు సృష్టించాలనుకుంటున్న ఆరో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌).. ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ బెరెటినిని ఢీకొంటాడు. బెరెటిని గురించి నాదల్‌ గొప్పగా మాట్లాడాడు.  ‘‘బెరెటిని ప్రపంచంలో మేటి ఆటగాళ్లలో ఒకడు. గెలవాలంటే నేను నా అత్యుత్తమ ఆట ఆడాలి’’ అని వ్యాఖ్యానించాడు. మరో సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) తలపడతాడు. వీళ్లిద్దరు 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోనూ తలపడడం విశేషం. ఆప్పుడు మెద్వెదెవ్‌ పైచేయి సాధించాడు. కానీ ఫైనల్లో జకోవిచ్‌ చేతిలో ఓడిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని