టేలర్‌పై మూడున్నరేళ్ల నిషేధం

స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం ఓ భారత వ్యాపారి తనను సంప్రదించడం గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై వేటుపడింది. టేలర్‌పై మూడున్నరేళ్ల పాటు ఐసీసీ నిషేధం విధించింది

Published : 29 Jan 2022 02:18 IST

దుబాయ్‌: స్పాట్‌ ఫిక్సింగ్‌ కోసం ఓ భారత వ్యాపారి తనను సంప్రదించడం గురించి ఐసీసీకి సమాచారం ఇవ్వడంలో జాప్యం చేసిన జింబాబ్వే మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌పై వేటుపడింది. టేలర్‌పై మూడున్నరేళ్ల పాటు ఐసీసీ నిషేధం విధించింది. డోప్‌ పరీక్షలో విఫలమైనందుకు ఒక నెల రోజులు సస్పెండ్‌ చేసింది. ‘‘ఐసీసీ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించడాన్ని బ్రెండన్‌ టేలర్‌ అంగీకరించాడు. ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా అతడిపై మూడున్నరేళ్ల పాటు నిషేధం పడింది. 2025 జులై 28న టేలర్‌ మళ్లీ క్రికెట్లో అడుగుపెట్టొచ్చు’’ అని శుక్రవారం ఐసీసీ పేర్కొంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో తనపై నిషేధం పడబోతుందంటూ 35 ఏళ్ల బ్రెండన్‌ ఇటీవలే పేర్కొనడం సంచలనం సృష్టించింది. స్పాన్సర్‌షిప్‌తో పాటు జింబాబ్వేలో టీ20 లీగ్‌ ప్రారంభించే అవకాశాలపై చర్చించడానికి 2019 అక్టోబరులో భారత్‌కు వచ్చానని టేలర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. భారత వ్యాపారితో సమావేశం సమయంలో తెలివి తక్కువ తనంతో కొకైన్‌ తీసుకున్నానని.. దాన్ని అడ్డంపెట్టుకుని తనను బ్లాక్‌మెయిల్‌ చేశారని అతడు వివరించాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయడం కోసం తనకు 15000 డాలర్లు ఇచ్చినట్లు చెప్పాడు. ఈ ఘటన జరిగిన 4 నెలల అనంతరం ఐసీసీకి బ్రెండన్‌ సమాచారం అందించాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టిన ఐసీసీ.. బ్రెండన్‌పై నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని