
అఫ్గాన్ అదుర్స్
అండర్-19 ప్రపంచకప్ సెమీస్‌లో ప్రవేశం
కూలిడ్జ్ (ఆంటిగ్వా): 135 పరుగులు.. టీ20ల్లోనే ఉఫ్ అని ఊదేస్తున్నారు ఈ రోజుల్లో! అలాంటిది వన్డేల్లో ఒక లెక్కా! కానీ ఇంత చిన్న లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు పెట్టి కూడా కాపాడుకుంది అఫ్గానిస్థాన్! స్ఫూర్తిదాయక ఆటతో.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జోరు మీదున్న శ్రీలంకకు కళ్లెం వేసిన ఈ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో 4 పరుగుల తేడాతో లంకను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో మొదట అఫ్గాన్ 47.1 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వినుజ రణ్‌పాల్ (5/10), దనిత్ (3/36) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అబ్దుల్ హాది (37), నూర్ అహ్మద్ (30) అల్లా నూర్ (25) పోరాడకపోతే ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. స్వల్ప ఛేదనలో లంక ఆరంభం నుంచే తడబడింది. అఫ్గాన్ బౌలర్లు విజృంభించడంతో 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్ దనిత్ (34), రవీన్ (21)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 69 పరుగులు జోడించి ఆశలు రేపాడు. కానీ ఓవర్ తేడాతో వీళ్లిద్దరూ వెనుదిరగడంతో ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. 45 ఓవర్లకు 124/9తో నిలిచిన లంకకు గెలవాలంటే 5 ఓవర్లలో 11 పరుగులు కావాల్సి వచ్చింది. చేతిలో ఒక్క వికెటే ఉన్నా లక్ష్యం సమీపంగా ఉండడంతో లంక ఆశలు వదులుకోలేదు. పైగా 46వ ఓవర్ తొలి రెండు బంతులకు ఆరు పరుగులు రావడంతో ఆ జట్టు గెలిచేలా కనిపించింది. అయితే ఆ ఓవర్ చివరి బంతికి రణ్‌పాల్ (4) రనౌట్ కావడంతో లంకకు నిరాశ తప్పలేదు. ఆ జట్టు 46 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో బిలాల్ సమి రెండు వికెట్లు తీయగా.. నవీద్, నూర్, ఇజారుల్లా, ఖరోటె తలా వికెట్ పడగొట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.