రెట్టించిన ఉత్సాహంతో..

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. కెప్టెన్‌ యశ్‌ ధూల్‌తో పాటు ప్రధాన ఆటగాళ్లు కొవిడ్‌ నుంచి కోలుకుని అందుబాటులోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న యువ భారత్‌.. శనివారం జరిగే

Updated : 29 Jan 2022 02:20 IST

నేడే బంగ్లాతో భారత్‌ క్వార్టర్స్‌ పోరు

అండర్‌-19 ప్రపంచకప్‌

సాయంత్రం 6.30 నుంచి

ఆస్‌బౌర్న్‌ (ఆంటిగ్వా): అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. కెప్టెన్‌ యశ్‌ ధూల్‌తో పాటు ప్రధాన ఆటగాళ్లు కొవిడ్‌ నుంచి కోలుకుని అందుబాటులోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న యువ భారత్‌.. శనివారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన యశ్‌, వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌, సిద్ధార్థ్‌ యాదవ్‌, ఆరాధ్య యాదవ్‌, మానవ్‌ పరేఖ్‌ ఈ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండడం జట్టుకు బలాన్నిచ్చే అంశం. ట్రినిడాడ్‌లో ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్న  వీరు శుక్రవారమే క్వార్టర్‌ఫైనల్‌ వేదిక ఆంటిగ్వా చేరుకున్నారు. అయితే యశ్‌ లేని సమయంలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన నిశాంత్‌ సింధు కరోనా కారణంగా క్వార్టర్స్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అనీశ్వర్‌ గౌతమ్‌ను జట్టులో చేర్చారు. ఈ టోర్నీలో లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత్‌కు ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు షాక్‌ తగిలింది. ఆరుగురు భారత ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలారు. ఈ స్థితిలో.. ఉన్న ఆటగాళ్లతోనే బరిలో దిగి ఐర్లాండ్‌.. ఆ తర్వాత ఉగాండాపై ఘన విజయాలు అందుకున్న టీమ్‌ఇండియా నాకౌట్‌ చేరింది. ఇప్పుడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాతో సెమీఫైనల్‌ బెర్తు కోసం తలపడనుంది. ఈ పోరును తేలిగ్గా తీసుకుంటే భారత్‌కు కష్టమే. 2020 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆ జట్టు చేతిలో టీమ్‌ఇండియా అనూహ్య పరాజయం చవిచూసింది. ప్రస్తుత బంగ్లా అండర్‌-19 కెప్టెన్‌ రకిబుల్‌ హసన్‌ అప్పటి జట్టులో సభ్యుడు. అయితే ఇటీవల ఆసియాకప్‌ సెమీస్‌లో బంగ్లాను భారత్‌ చిత్తు చేసింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లా ఓ పెద్ద జట్టును ఇంకా ఓడించలేదు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన బంగ్లా.. ఆ తర్వాత కెనడా, యూఏఈ నెగ్గి ముందంజ వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని