Updated : 29 Jan 2022 07:06 IST

Rafael Nadal:ఇంకొక్క అడుగే

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రవేశం

తుది పోరులో మెద్వెదెవ్‌తో ఢీ

రికార్డు టైటిల్‌కు చేరువగా నాదల్‌

మెల్‌బోర్న్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. స్పెయిన్‌ యోధుడు రఫెల్‌ నాదల్‌కు అంతగా అచ్చిరాని గ్రాండ్‌స్లామ్‌. అతను అతి తక్కువగా, ఒకే ఒక్కసారి గెలిచిన గ్రాండ్‌స్లామ్‌ ఇదే. అయిదుసార్లు ఫైనల్‌ చేరినా.. ఎంతో గొప్పగా పోరాడినా.. అదృష్టం కలిసిరాక నాలుగుసార్లు ఓడిపోయాడు. అయితే ఇన్నాళ్లూ అచ్చిరాని చోటే.. ఇప్పుడు కలిసొచ్చి రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌ అందుకునే దిశగా అడుగులేస్తున్నాడు రఫా. గాయంతో ఫెదరర్‌, వీసా సమస్యతో జకోవిచ్‌ టోర్నీకి దూరం కావడంతో ముందే సగం సమస్య తీరిపోగా.. పాదం ఇబ్బంది పెడుతున్నా పట్టు వదలకుండా పోరాడుతూ.. ఫైనల్‌ దాకా వచ్చేశాడు స్పెయిన్‌ బుల్‌. ఇంకొక్క విజయం సాధిస్తే అతనే పురుషుల టెన్నిస్‌లో ఆల్‌టైం గ్రేట్‌!

వైపు ప్రత్యర్థులతో పోరాటం.. మరోవైపు సుదీర్ఘ కాలంగా ఇబ్బంది పెడుతున్న తన పాదం గాయంతో పోరాటం.. అయితేనేం.. రఫెల్‌ నాదల్‌ ముందడుగు వేస్తూనే ఉన్నాడు. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలతో మైదానానికి దూరంగా ఉండి, ఇటీవలే పూర్తి ఫిట్‌నెస్‌ లేకుండానే ఆటలోకి పునరాగమనం చేసిన రఫా.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరాడు. క్వార్టర్స్‌లో షపొవలోవ్‌తో అయిదు సెట్ల పోరాటంలో కష్టపడి నెగ్గిన నాదల్‌.. సెమీస్‌లో మాత్రం అంత కష్టపడలేదు. వింబుల్డన్‌ రన్నరప్‌ బెరెటినితో నాలుగు సెట్ల పోరులో ఆరో సీడ్‌ నాదల్‌ 6-3, 6-2, 3-6, 6-3తో విజయం సాధించాడు. ఫైనల్లో అతను గత ఏడాది యుఎస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ మెద్వెదెవ్‌ను ఢీకొనబోతున్నాడు. హోరాహోరీగా సాగిన మరో సెమీస్‌లో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) 7-6 (7-5), 4-6, 6-4, 6-1తో సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై విజయం సాధించాడు. ఫైనల్‌ ఆదివారం జరుగుతుంది.

ఆ ఒక్కటి మినహా: మూడో సెట్లో మినహాయిస్తే బెరెటినితో సెమీస్‌లో నాదల్‌దే పూర్తి ఆధిపత్యం. తొలి రెండు సెట్లలోనూ ఆరంభ గేమ్‌ల్లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌కు.. పోటీయే లేకపోయింది. తొలి సెట్‌ రెండో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అతను.. తన సర్వీస్‌లను నిలబెట్టుకుని అలవోకగా సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్లో బెరెటిని పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపించాడు. వరుసగా రెండు సార్లు సర్వీస్‌లు కోల్పోయాడు. నాదల్‌ ఊపు చూస్తే మూడో సెట్‌ను కూడా గెలుచుకుని మ్యాచ్‌ను ముగించడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ సెట్‌ పోతే మ్యాచ్‌ చేజారే స్థితిలో బెరెటిని పుంజుకున్నాడు. నాదల్‌ను గట్టిగా ప్రతిఘటించాడు. ఏడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 4-3తో ఆధిక్యం సాధించిన బెరెటిని.. దూకుడుగా ఆడి అతడి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ గెలిచాడు. నాలుగో సెట్‌ కొంచెం పోటాపోటీగానే సాగింది. కానీ మూడో సెట్‌లో బెరెటిని తననెలా దెబ్బ కొట్టాడో.. అలాగే నాదల్‌ అతణ్ని దెబ్బ తీశాడు. హోరాహోరీగా సాగిన ఎనిమిదో గేమ్‌లో బ్రేక్‌  పాయింట్‌ సాధించి.. మ్యాచ్‌ పాయింట్‌కు సర్వ్‌ చేశాడు. బెరెటిని నుంచి సమాధానమే లేకపోయింది. ఒక్క పాయింట్‌ కూడా కోల్పోకుండా గేమ్‌ను, సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుని సింహనాదం చేశాడు రఫా. బ్యాక్‌ హ్యాండ్‌లో బెరెటిని మరీ బలహీనంగా ఉండటం నాదల్‌కు కలిసొచ్చింది. మ్యాచ్‌ మూడు గంటల్లోపే ముగిసింది. మ్యాచ్‌లో నాదల్‌ రెండు ఏస్‌లే కొట్టగా.. బెరెటిని 14 సంధించడం విశేషం. కానీ 39 అనవసర తప్పిదాలు చేసి బెరెటిని మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్‌ 19 తప్పిదాలే చేశాడు.

హోరాహోరీగా మొదలై..: ఇక సిట్సిపాస్‌తో మెద్వెదెవ్‌ పోరు మాత్రం హోరాహోరీగానే సాగింది. మెద్వెదెవ్‌కు అంత తేలిక కాదని తొలి సెట్లోనే అర్థమైపోయింది. ఈ సెట్‌ మెద్వెదెవే గెలుచుకున్నప్పటికీ అది అతను టైబ్రేక్‌లో కష్టపడి గెలిచాడు. రెండో సెట్లో సిట్సిపాస్‌ నుంచి మెద్వెదెవ్‌కు గట్టి సవాలే ఎదురైంది. తొలి గేమ్‌లోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించి సిట్సిపాస్‌ మెద్వెదెవ్‌కు గట్టి షాక్‌ ఇచ్చాడు. అయితే ఆరో గేమ్‌లో రష్యా స్టార్‌ బదులు తీర్చుకున్నాడు. ఈ సెట్‌ కూడా టైబ్రేక్‌కు వెళ్లడం ఖాయమనుకుంటుండగా.. తొమ్మిదో గేమ్‌లో సులువుగా మెద్వెదెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సిట్సిపాస్‌, తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ గెలిచాడు. మూడో సెట్‌ కూడా హోరాహోరీగానే సాగింది కానీ.. పదో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ సాధించిన మెద్వెదెవ్‌ మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. నాలుగో సెట్లో ఆశ్చర్యకరంగా సిట్సిపాస్‌ నుంచి ప్రతిఘటనే లేకపోయింది. అలవోకగా సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లాడు మెద్వెదెవ్‌. మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 5 ఏస్‌లకు పరిమితమైతే మెద్వెదెవ్‌ 13 కొట్టాడు. మ్యాచ్‌ రెండున్నర గంటల్లో ముగిసింది.


‘‘నా పాదంతో ప్రతి రోజూ సమస్య ఎదురవుతూనే ఉంది. ఇంకా భయాలు తొలగిపోలేదు. నా జీవితాంతం ఈ ఇబ్బంది కొనసాగొచ్చు. కొన్ని సమస్యలకు పరిష్కారాలుండవు. ఇలా పోటీ పడటం, అత్యున్నత స్థాయిలో మళ్లీ టెన్నిస్‌ ఆడుతుండటం, ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడటం చాలా బాగా అనిపిస్తోంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో గతంలో కొన్ని గొప్ప ఫైనల్స్‌ ఆడాను. గెలుపు అవకాశాలు కూడా సృష్టించుకున్నాను. కానీ అదృష్టం కలిసి రాక విజయాలు సాధించలేదు. అయినా సరే.. ఇక్కడ ఒక్క టైటిలైనా గెలిచినందుకు అదృష్టవంతుడిగానే భావిస్తా. 2022లో టైటిల్‌ గెలిచే అవకాశం నాకుంటుందని అస్సలు అనుకోలేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని