Australia Open: రఫా కొట్టేస్తాడా!

ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌ తుది పోరు ఆదివారమే. 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాలన్న లక్ష్యంతో స్పెయిన్‌ యోధుడు రఫెల్‌

Updated : 30 Jan 2022 06:54 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్‌ నేడే

(మధ్యాహ్నం 2 నుంచి)

21వ గ్రాండ్‌స్లామ్‌పై నాదల్‌ గురి

రెండో టైటిల్‌పై మెద్వెదెవ్‌ కన్ను

మెల్‌బోర్న్‌

ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్‌ తుది పోరు ఆదివారమే. 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించాలన్న లక్ష్యంతో స్పెయిన్‌ యోధుడు రఫెల్‌ నాదల్‌ బరిలోకి దిగుతుండగా.. అతడికి గండి కొట్టి రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు రష్యా యువ కెరటం మెద్వెదెవ్‌. మామూలుగా అయితే నాదల్‌ లాంటి దిగ్గజ ఆటగాడి ముందు మెద్వెదెవ్‌ నిలవగలడా అనుకుంటాం కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మెద్వెదెవ్‌ను తట్టుకోవడమే రఫాకు కష్టమయ్యేలా ఉంది. నాదల్‌కు వయసు మీద పడింది. పైగా ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతం అవుతున్నాడు. చాన్నాళ్లుగా వేధిస్తున్న పాదం గాయం ప్రస్తుత టోర్నీలోనూ అతణ్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. నొప్పి తట్టుకుంటూ, మధ్య మధ్యలో చికిత్స తీసుకుంటూ కష్టపడే ఫైనల్‌కు వచ్చాడు రఫా. క్వార్టర్స్‌లో షపొవలోవ్‌తో అయిదు సెట్లు హోరాహోరీగా తలపడి ముందంజ వేశాడతను. పెద్దగా అనుభవం లేని షపొవలోవే నాదల్‌ను ఇబ్బంది పెడితే.. కొన్ని నెలల కిందటే యుఎస్‌ ఓపెన్‌ నెగ్గి, ఇప్పుడు మంచి ఊపులో కనిపిస్తున్న మెద్వెదెవ్‌ అతడికి అంత తేలిగ్గా తలొగ్గుతాడా అన్నది సందేహం. క్వార్టర్స్‌లో అతనూ ఆగర్‌పై అయిదు సెట్ల పోరాటంలోనే నెగ్గాడు. సెమీస్‌లో సిట్సిపాస్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాణ్ని సులువుగానే ఓడించాడు. అయితే పోరాట తత్వానికి మారుపేరైన నాదల్‌.. జకోవిచ్‌ లేని టోర్నీలో టైటిల్‌ నెగ్గి అతడి కంటే ముందు ఫెదరర్‌ను వెనక్కి నెట్టి, 21వ టైటిల్‌తో ఆల్‌టైం రికార్డు నెలకొల్పే అవకాశాన్ని అంత తేలిగ్గా వదులుకోకపోవచ్చు.


* వీళ్లిద్దరూ ఇంతకుముందు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడ్డారు. తమ తొలి ముఖాముఖి మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ నెగ్గి సంచలనం రేపగా.. తర్వాతి మూడుసార్లు అతడికి రఫా అవకాశమివ్వలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని