Ash Barty: ఒకే ఒక్క బార్టీ

‘‘మూడు భిన్న కోర్టుల్లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు.. నువ్వొక పరిపూర్ణ క్రీడాకారిణివి’’.. బార్టీని ఉద్దేశించి ఆస్ట్రేలియా టెన్నిస్‌ దిగ్గజం రాడ్‌ లేవర్‌ అన్న మాటలివి. ‘‘మహిళల టెన్నిస్‌లో ప్రస్తుతం ఆష్లీ బార్టీ కంటే

Updated : 30 Jan 2022 08:40 IST

ఈనాడు క్రీడావిభాగం

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘మూడు భిన్న కోర్టుల్లో మూడు గ్రాండ్‌స్లామ్‌లు.. నువ్వొక పరిపూర్ణ క్రీడాకారిణివి’’.. బార్టీని ఉద్దేశించి ఆస్ట్రేలియా టెన్నిస్‌ దిగ్గజం రాడ్‌ లేవర్‌ అన్న మాటలివి. ‘‘మహిళల టెన్నిస్‌లో ప్రస్తుతం ఆష్లీ బార్టీ కంటే మెరుగైన క్రీడాకారిణి మరొకరు లేరు’’.. బెలారస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంక చేసిన వ్యాఖ్యలివి. లేవర్‌ లాంటి దిగ్గజంతో, అజరెంక లాంటి సహచర క్రీడాకారిణితో ఇలాంటి ప్రశంసలు పొందడం బార్టీకే చెల్లు. వీళ్లు అన్నారని కాదు.. అనిశ్చితికి, నిలకడ లేమికి మారు పేరుగా మారిపోయిన మహిళల టెన్నిస్‌లో బార్టీకి సరితూగే క్రీడాకారిణులు పెద్దగా కనిపించరు. ఇప్పుడు మహిళల సింగిల్స్‌లో ఆమే ప్రపంచ నంబర్‌వన్‌. అంతే కాదు.. ప్రస్తుతం టెన్నిస్‌ ఆడుతున్న అమ్మాయిల్లో సెరెనా విలియమ్స్‌ కాకుండా మూడు భిన్న కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన క్రీడాకారిణి బార్టీనే. 2015లో సెరెనా మూడు భిన్న కోర్టుల్లో గ్రాండ్‌స్లామ్‌ గెలిచింది. ఆ ఏడాది యుఎస్‌ ఓపెన్‌ మినహాయిస్తే మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో టైటిల్‌ నెగ్గింది. కొన్నేళ్లుగా 24వ టైటిల్‌ వేటలో ఉన్న సెరెనా కొంత కాలంగా మైదానానికి దూరంగా ఉంది. ఆమె మళ్లీ ఆడుతుందో లేదో తెలియట్లేదు. సెరెనా జోరు తగ్గాక అమ్మాయిల టెన్నిస్‌లో నిలకడగా ఆడుతున్న క్రీడాకారిణులు బాగా తగ్గిపోయారు. గత ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన ఒసాకా.. తర్వాత ఫామ్‌ కోల్పోయింది. రెండేళ్ల ముందు మంచి ఊపులో కనిపించిన హలెప్‌ ఇప్పుడు గాయంతో పోరాడుతోంది.  స్వైటెక్‌, రదుకాను, క్రెజికోవా లాంటి క్రీడాకారిణులు ఒక్కో టైటిలైతే గెలిచారు కానీ.. నిలకడగా రాణించట్లేదు. వీళ్లందరి మధ్య బార్టీ భిన్నంగా కనిపిస్తోంది. అన్ని కోర్టుల్లోనూ సత్తా చాటుతోంది. ప్రపంచ నంబర్‌వన్‌ అయింది. యుఎస్‌ ఓపెన్‌ మినహా మూడు గ్రాండ్‌స్లామ్‌లూ గెలిచింది. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ, ఇదే నిలకడతో ఆడితే వచ్చే రెండు మూడేళ్లలో యుఎస్‌ ఓపెన్‌ సహా మరిన్ని టైటిల్స్‌ ఆమె సొంతం కావడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని