Rafael Nadal:యోధుడికి పట్టం

ఆ ఆట అద్భుతం! ఆ పోరాటం అద్వితీయం. ఆ పట్టుదల స్ఫూర్తిదాయకం!నాదల్‌ సాధించాడు..!తీవ్ర ఒత్తిడికి నిలుస్తూ.. సర్వశక్తులూ ఒడ్డుతూ.. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. సాటి దిగ్గజాలైన ఫెదరర్‌, జకోవిచ్‌లను అధిగమిస్తూ.. టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మానసిక,

Updated : 31 Jan 2022 06:49 IST

నాదల్‌ @ 21

ఫెదరర్‌, జకోవిచ్‌ను దాటేసిన రఫా

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా రికార్డు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ కైవసం

ఫైనల్లో మెద్వెదెవ్‌పై విజయం

ఆ ఆట అద్భుతం! ఆ పోరాటం అద్వితీయం. ఆ పట్టుదల స్ఫూర్తిదాయకం!

నాదల్‌ సాధించాడు..!

తీవ్ర ఒత్తిడికి నిలుస్తూ.. సర్వశక్తులూ ఒడ్డుతూ.. కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. సాటి దిగ్గజాలైన ఫెదరర్‌, జకోవిచ్‌లను అధిగమిస్తూ.. టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మానసిక, శారీరక దృఢత్వానికి కఠిన పరీక్ష పెడుతూ అయిదున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో మెద్వెదెవ్‌ను ఓడిస్తూ అతడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. నాదల్‌ ప్రదర్శన చిరస్మరణీయం. జోరుమీదున్న ప్రత్యర్థికి తొలి రెండు సెట్లు కోల్పోయి, ఓటమి అంచుల్లో నిలిచిన స్థితి నుంచి రఫా పుంజుకున్న తీరు నభూతో. ఈ ఓటమిని జీర్ణించుకోవడం మెద్వెదెవ్‌కు అంత తేలిక కాదు.

మెల్‌బోర్న్‌

నాదల్‌ అదరహో! అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టువీడని ఈ స్పెయిన్‌ వీరుడు.. తొలిసారి ఫెదరర్‌ను అధిగమించి పురుషుల టెన్నిస్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచాడు. ఇన్ని రోజులు 20 టైటిళ్లతో ఫెదరర్‌, జకోవిచ్‌తో సమంగా ఉన్న అతడు..  ఆదివారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలవడం ద్వారా   కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఆరో సీడ్‌ నాదల్‌ 2-6, 6-7 (5-7), 6-4, 6-4, 7-5తో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయాక.. రఫా పోరాడిన తీరు, పుంజుకున్న తీరు అద్భుతం. ఆరంభంలో దూకుడైన ఆటతో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మెద్వెదెవ్‌ ఆ తర్వాత నెమ్మదించాడు. చురుకుగా కదల్లేకపోయాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో ఇది (5 గంటల 24 నిమిషాలు) రెండో సుదీర్ఘ ఫైనల్‌. 2012లో జకోవిచ్‌, నాదల్‌ల మధ్య మ్యాచ్‌ 5 గంటల 53 నిమిషాల పాటు సాగింది. 35 ఏళ్ల నాదల్‌కు ఇది రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌. 2009లో ఇక్కడ అతడు తొలి టైటిల్‌ గెలుచుకున్నాడు.

మెద్వెదెవ్‌ మొదలెడితే..: మెద్వెదెవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తన తొలి గ్రాండ్‌స్లామ్‌ (యుఎస్‌ ఓపెన్‌) గెలిచిన ఊపు మీదున్నాడు. నాదలేమో 2021 చివరి ఏడు నెలల్లో ఒకే ఒక్క టోర్నమెంట్‌ ఆడాడు. ఫైనలిస్టుల పరిస్థితిది. ఆరంభంలో మెద్వెదెవ్‌దే పైచేయి. చక్కని డిఫెన్స్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించిన అతడు నాదల్‌ తప్పులు చేసేలా చేశాడు. ప్రత్యర్థి సర్వీసు అలవోకగా ఎదుర్కొన్నాడు. వరుసగా అయిదు, ఏడో గేముల్లో బ్రేక్‌తో తొలి సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండో సెట్‌ రసవత్తరంగా సాగింది. ఆటగాళ్లిద్దరూ బలమైన రిటర్న్‌ షాట్లు ఆడారు. అయితే నాలుగో గేమ్‌లో బ్రేక్‌ సాధించి, ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకున్న నాదల్‌ 4-1తో ఆధిక్యం సంపాదించాడు. పుంజుకున్న మెద్వెదెవ్‌ ఏడో గేమ్‌లో బ్రేక్‌ సాధించగా.. వెంటనే నాదల్‌ కూడా ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేశాడు. అయితే నాదల్‌ 5-3తో సర్వీసు చేస్తుండగా ఓ సెట్‌ పాయింటు కాచుకుని మరీ బ్రేక్‌ సాధించిన  మెద్వెదెవ్‌.. టైబ్రేక్‌కు దారితీసిన సెట్లో పైచేయి సాధించాడు.

రఫా ముగించాడు..: తొలి రెండు సెట్లు కోల్పోయాక నాదల్‌ పుంజుకోవడం కష్టమే అనిపించింది. కానీ అతడు అందరికీ తన పోరాటపటిమను చూపించాడు. ఆటగాళ్లిద్దరూ సర్వీసులు నిలబెట్టుకోవడంతో ఎనిమిదో గేమ్‌ వరకు సెట్‌ సాఫీగానే సాగింది. కానీ తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన నాదల్‌.. సర్వీసు నిలబెట్టుకుని, సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో తన ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు. రెట్టించిన విశ్వాసంతో కదిలిన నాదల్‌ నాలుగో సెట్లోనూ అదే జోరు కొనసాగించాడు. సెట్‌ ఆరంభంలో రెండు బ్రేక్‌ పాయింట్లను కాచుకున్న అతడు.. మూడో గేమ్‌లోనే బ్రేక్‌ సాధించాడు. బలమైన షాట్లతో ప్రత్యర్థిని ఆ మూలకు, ఈ మూలకు తిప్పాడు. కానీ తర్వాతి గేమ్‌లో నాదల్‌ సర్వీసును బ్రేక్‌ చేసిన మెద్వెదెవ్‌ 2-2తో స్కోరు సమం చేశాడు. అయినా నాదల్‌ తగ్గలేదు. తర్వాతి గేమ్‌లో బ్రేక్‌ సాధించి.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక అయిదో సెట్లోకి తీసుకెళ్లాడు. అక్కాడా అదే జోరుతో మెద్వెదెవ్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

ఆఖర్లో...: నాదల్‌, మెద్వెదెవ్‌లు ఇద్దరూ సర్వీసులు నిలబెట్టుకోవడంతో అయిదో సెట్లో ఓ దశలో స్కోరు 2-2. కానీ తన అత్యుత్తమ ఫిట్‌నెస్‌ స్థాయిని ప్రదర్శిస్తూ నాదల్‌ క్రమంగా పట్టుబిగించాడు. అయిదో గేమ్‌లో అతడు ఓ చక్కని ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌తో బ్రేక్‌ సాధించడం ద్వారా ప్రత్యర్థికి షాకిచ్చాడు. అయితే మెద్వెదెవ్‌ గట్టిగా పోరాడాడు. కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. 14 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో మూడు బ్రేక్‌ పాయింట్లు కాచుకున్న నాదల్‌.. అతికష్టంగా సర్వీసు నిలబెట్టుకుని  4-2తో ఆధిక్యంలో నిలిచాడు. ఓ ర్యాలీ అయితే 20 షాట్ల పాటు సాగింది. ఆధిక్యం నిలబెట్టుకుంటూ సాగిన నాదల్‌.. 5-4తో ఛాంపియన్‌షిప్‌ కోసం సర్వీసుకు దిగాడు. అప్పటికే అలసిపోయిన మెద్వెదెవ్‌కు ఏ మాత్రం అవకాశం లేదనిపించిన దశ అది. కానీ అనూహ్యంగా ఓ మలుపు. ఆట నాటకీయంగా మారింది. నాదల్‌కు షాకిస్తూ బ్రేక్‌ సాధించిన మెద్వెదెవ్‌ 5-5తో  ఓ అద్భుత అవకాశాన్ని సృష్టించుకున్నాడు. ఒక్కసారిగా ఉత్కంఠ. కానీ అవకాశాన్ని మెద్వెదెవ్‌ ఉపయోగించుకోలేకపోయాడు. బలంగా పుంజుకుని వెంటనే బ్రేక్‌ సాధించిన నాదల్‌, అలవోకగా సర్వీసు నిలబెట్టుకుని విజేతగా నిలిచాడు. కెన్‌ రోస్‌వెల్‌, ఫెదరర్‌ తర్వాత ఓపెన్‌ శకంలో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన మూడో అతిపెద్ద వయస్కుడిగా నాదల్‌ ఘనత సాధించాడు. ఓపెన్‌ శకంలో జకోవిచ్‌ తర్వాత ప్రతి గ్రాండ్‌స్లామ్‌నూ కనీసం రెండు సార్లు గెలిచిన పురుష ఆటగాడిగా కూడా నాదల్‌ నిలిచాడు.

క్రెజికోవ్‌, సినియాకోవా జోడీకి డబుల్స్‌ టైటిల్‌: టాప్‌ సీడ్‌ బార్బరా క్రెజికోవా, కేథరినా సినియాకోవా జోడీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో ఈ చెక్‌ జంట 6-7 (3-7), 6-4, 6-4తో అనా డానిలినా (కజకిస్థాన్‌), బీర్టిజ్‌ హదద్‌ మయా (బ్రెజిల్‌) ద్వయంపై విజయం సాధించింది.


‘‘ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచి 21 సింగిల్స్‌ టైటిళ్లు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన ప్రియ స్నేహితుడా (నాదల్‌) నీకు    అభినందనలు. కొన్ని నెలల క్రితం ఇద్దరం ఊతకర్రలతో నడవాల్సి వచ్చిప్పుడు జోకులు వేసుకున్నాం. అయితే ఛాంపియన్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. నీతో ఈ గొప్ప శకాన్ని పంచుకున్నందుకు గర్విస్తున్నా’’

- రోజర్‌  ఫెదరర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు