Rafael Nadal:రఫా ఇక్కడ.. తగ్గేదేలే..!

తనకు పెట్టని కోట.. ఏకంగా 13 సార్లు విజేతగా నిలిచిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో.. గతేడాది సెమీస్‌లో అనూహ్య ఓటమి. అంతే ఇక ఎర్రమట్టి సూర్యుడికి పడమర దారే దిక్కని అంతా అనుకున్నారు. కానీ అతని ప్రకాశం మాత్రం.. తగ్గేదేలే!గాయాల కారణంగా ఏడాదిలో దాదాపు సగం రోజులు కోర్టు బయటే.

Updated : 31 Jan 2022 06:51 IST

తనకు పెట్టని కోట.. ఏకంగా 13 సార్లు విజేతగా నిలిచిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో.. గతేడాది సెమీస్‌లో అనూహ్య ఓటమి. అంతే ఇక ఎర్రమట్టి సూర్యుడికి పడమర దారే దిక్కని అంతా అనుకున్నారు. కానీ అతని ప్రకాశం మాత్రం.. తగ్గేదేలే!

గాయాల కారణంగా ఏడాదిలో దాదాపు సగం రోజులు కోర్టు బయటే.. అతను ఇక తిరిగి ఫిట్‌నెస్‌ సాధించి బరిలో దిగడం.. టైటిల్‌ నెగ్గడం కష్టమే అనుకున్నారు. కానీ అతని ఆట మాత్రం.. తగ్గేదేలే!

వయసు మీద పడుతోంది.. అతని పనైపోయింది.. ఇంకేం ఆడతాడు? ఒకవేళ టోర్నీలో అడుగుపెట్టినా.. ఫైనల్‌ చేరగలడా? తుదిపోరు చేరినా.. టైటిల్‌ కొట్టగలడా? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ అతని జవాబు మాత్రం.. తగ్గేదేలే!

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌.. తొలి రెండు సెట్లు ఓడిపోయాడు. చివరగా 2007 వింబుల్డన్‌లో మాత్రమే అతను తొలి రెండు సెట్లు ఓడిపోయినా మ్యాచ్‌ గెలిచాడు. మళ్లీ 5323 రోజుల తర్వాత ఆ మాయ పునరావృతం చేస్తాడా? అతని ఓటమి లాంఛనమే అన్న అంచనాలు. కానీ అతని విజయ సంబరాలు మాత్రం.. తగ్గేదేలే!

అవును.. ఎన్నో ఒడుదొడుకులను దాటి.. పోరాటమే శ్వాసగా సాగిన 35 ఏళ్ల నాదల్‌ అందుకున్నాడు. ఎలాంటి సవాళ్లనైనా.. తగ్గేదేలే అంటూ ఎదుర్కొంటూ సాగే ఈ పోరాట యోధుడు అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో శిఖరాగ్రాన నిలిచాడు.

ఈనాడు క్రీడావిభాగం

నాదల్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. 2009లో తొలిసారి అక్కడ టైటిల్‌ గెలిచాక.. మరో నాలుగు సార్లు ఫైనల్‌ చేరినా నిరాశ తప్పలేదు. అలాంటి చోట.. పోరాటాన్ని నమ్ముకొని అదృష్టాన్ని వెనక్కి నెట్టిన అతను రికార్డు గ్రాండ్‌స్లామ్‌    విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అతనాడిన ఫైనల్‌.. కేవలం ఓ మ్యాచ్‌ మాత్రమే కాదు. అంతకుమించి. అతను కేవలం అయిదు సెట్ల పోరు గెలవలేదు.. తన సత్తాపై రేకెత్తుతున్న సందేహాలపై.. తన పని అయిపోయిందనే విమర్శలపై.. తన గాయాలపై.. తన నిరాశ, నిస్పృహలపై గెలిచాడు. సిసలైన విజేతగా సగర్వంగా ట్రోఫీని ముద్దాడాడు.

వాళ్లను దాటి..: ప్రస్తుత టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌లో దిగ్గజాలు ఎవరంటే.. ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌ల పేర్లు వినిపిస్తాయి. ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ముందు వరకూ ఈ ముగ్గురు తలో 20 టైటిళ్లతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో సమంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ దిగ్గజాలనే వెనక్కినెట్టి 21వ టైటిల్‌తో నాదల్‌ దర్జాగా సింహాసనంపై కూర్చున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ ఈ టోర్నీలో లేకపోవడంతో నాదల్‌ విజయం సులువైందనే వాదనలు వినిపించొచ్చు. కానీ అదే ప్రధాన కారణం ఏ మాత్రం కాదు. పాదం గాయం బాధిస్తున్నా ఈ టోర్నీలో నాదల్‌ చూపిన తెగువ.. ఫైనల్లో అయిదున్నర గంటల పోరు.. అతను విజయానికి సంపూర్ణ అర్హుడని చాటి చెబుతున్నాయి. అతను తలపడ్డ ప్రత్యర్థులూ తక్కువ వాళ్లేం కాదు. ఇలా అంచనాలను మించి మొండి పట్టుదలతో విజేతగా నిలవడం నాదల్‌కు కొత్తేమీ కాదు. అతనో పోరాట యోధుడు. 2020 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో గెలిచి 20వ టైటిల్‌ ఖాతాలో వేసుకున్న అతణ్ని గాయాలు వెనక్కి లాగాయి. అదే కారణంతో ఆ ఏడాది యుఎస్‌ ఓపెన్‌లో ఆడలేదు. గతేడాది ఆస్ట్రేలియన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. ముఖ్యంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఓటమి అతణ్ని తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఆ తర్వాత వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌లో అతను బరిలో దిగలేదు. దీంతో గాయాలతో తన కెరీర్‌ ముగిసినట్లేననే అభిప్రాయాలు వినిపించాయి. కానీ తన పని అయిపోయిందనుకోవడానికి ఎప్పటికీ వీల్లేదని స్పష్టం చేశాడు. పడమరన అస్తమించే సూర్యుడికి రేపు అనే తూర్పు కచ్చితంగా ఒకటుంటుందని.. తాను కూడా అలాగే విజయంతో ప్రకాశిస్తానని నాదల్‌ ఈ విజయంతో చెప్పాడు. ఇదే జోరులో మరిన్ని టైటిళ్లతో అతను ముందుకు సాగుతాడేమో చూద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని