Virat Kohli:కోహ్లి ఉత్తమం.. రూట్‌ పేలవం

టీమ్‌ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన విరాట్‌ కోహ్లి అసాధారణ కెప్టెన్‌ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అభివర్ణించాడు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా రిషబ్‌ పంత్‌ ఎదుగుదల ఘనత కోహ్లీదేనని తెలిపాడు.

Updated : 31 Jan 2022 08:01 IST

సిడ్నీ: టీమ్‌ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన విరాట్‌ కోహ్లి అసాధారణ కెప్టెన్‌ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అభివర్ణించాడు. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా రిషబ్‌ పంత్‌ ఎదుగుదల ఘనత కోహ్లీదేనని తెలిపాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ మంచి బ్యాటరే కానీ పేలవమైన సారథి అని ఛాపెల్‌ చెప్పాడు. ‘‘ఇది ఇద్దరు సారథుల కథ. తన కర్తవ్యంలో ఒకరు అత్యుత్తమం. మరొకరిది వైఫల్యం. కోహ్లి అసాధారణ కెప్టెన్‌ అనడంలో సందేహం లేదు. అతను ఇప్పటికీ భారత జట్టును అత్యున్నత స్థాయిలో నడిపించగలడు. వైస్‌ కెప్టెన్‌ ఆజింక్య రహానె సహకారంతో విదేశాల్లో భారత జట్టుకు అద్వితీయ విజయాల్ని అందించాడు. మరే భారత కెప్టెన్‌కు అది సాధ్యం కాలేదు. అత్యంత ఎక్కువ సమయం కెప్టెన్‌గా కొనసాగుతున్న రూట్‌ది కెప్టెన్సీ వైఫల్యం. ఎవరేమనుకున్నా రూట్‌ అతను పేలవమైన కెప్టెన్‌. గంగూలీ, ధోనీల వారసత్వాన్ని కోహ్లి అందిపుచ్చుకున్నాడు. ఏడేళ్లలో జట్టును అద్భుతంగా నిర్మించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ ఓటమి కోహ్లి కెప్టెన్సీలో అతిపెద్ద వైఫల్యం. టెస్టు క్రికెట్‌ పట్ల జట్టులో ఆసక్తిని రేకెత్తించడం కోహ్లి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. కోహ్లి ఎన్ని ఘనతలు అందకున్నా టెస్టు క్రికెట్లో గెలుపునే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. కోహ్లి కెరీర్‌లో వ్యక్తిగతంగా ఎన్నో ఘనతలు ఉన్నాయి. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా పంత్‌ ఎదగడం అందులో ఒకటి. కోహ్లి తీసుకున్న కొన్ని   నిర్ణయాలు ప్రశ్నార్థకమైనా పంత్‌కు అతని మద్దతు ప్రశంసనీయం. ఇక రూట్‌ ఎప్పటికీ  విజయవంతమైన సారథి కాలేడు. రూట్‌ సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌కు మంచి రికార్డే ఉన్నా.. అతని కెప్టెన్సీలో లోతు లేదు’’ అని ఛాపెల్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని