Cricket News: వాళ్లకు ఉద్యోగాలు పోతే.. నాకు బోనసా?

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అందించే బోనస్‌ను ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తిరస్కరించాడు. కొవిడ్‌ సమయంలో సీఏ కొంతమంది సిబ్బందిని తొలగించిన నేపథ్యంలో తాను ఈ డబ్బు స్వీకరించడం నైతికంగా సరికాదని అతను భావించాడు

Updated : 03 Feb 2022 06:53 IST

సిడ్నీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) అందించే బోనస్‌ను ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తిరస్కరించాడు. కొవిడ్‌ సమయంలో సీఏ కొంతమంది సిబ్బందిని తొలగించిన నేపథ్యంలో తాను ఈ డబ్బు స్వీకరించడం నైతికంగా సరికాదని అతను భావించాడు. కోచ్‌గా ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌, యాషెస్‌ సిరీస్‌ విజయాలు అందించిన అతనికి బోనస్‌ ఇవ్వాలని సీఏ నిర్ణయించింది. కానీ అతను దాన్ని తిరస్కరించాడని స్థానిక మీడియా పేర్కొంది. ‘‘సీఏ బోనస్‌గా ఇవ్వాలనుకున్న ఆరంకెల మొత్తాన్ని లాంగర్‌ తిరస్కరించాడు. కరోనా వల్ల సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో అతను ఆ డబ్బు తీసుకోవడం నైతికంగా సరికాదని భావించాడు. ఈ విషయాన్ని సీఏ అధ్యక్షుడికి అతను వ్యక్తిగతంగా తెలియజేశాడు. ఇతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో బోనస్‌ తీసుకోవడం తగదనుకున్నాడు’’ అని అక్కడి మీడియాలో కథనం వచ్చింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా సీఏ తమ 40 మంది సిబ్బందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. అంతే కాకుండా ఎగ్జిక్యూటివ్‌ సిబ్బంది జీతాల్లోనూ కోత విధించింది. దీంతో సీఏకు దాదాపు రూ.213 కోట్లు ఆదా అయినట్లు సమాచారం. 2018లో ఆసీస్‌ కోచ్‌గా లాంగర్‌తో నాలుగేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడతణ్ని కొనసాగించాలా? లేదా? అనే విషయంపై శుక్రవారం జరిగే సీఏ సర్వసభ్య సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వార్న్‌, గిల్‌క్రిస్ట్‌ లాంటి మాజీలు లాంగర్‌ను కొనసాగించాలంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని