Winter Olympics: హిమ సీమల్లో.. పతకాల వేట

ఒకవైపు వణికించే చలి.. మరోవైపు పతకాల ఆకలి! జర్రున జారే స్కేటర్లు! దూసుకుపోయే స్కీయర్లు! మాయ చేసే హాకీ స్టిక్‌లు! ఇలా కూడా ఆడతారా అనిపించే క్రీడలు.. ఈ దృశ్యాలన్నిటికి వేదిక

Updated : 04 Feb 2022 07:11 IST

నేటి నుంచే వింటర్‌ ఒలింపిక్స్‌

ఒకవైపు వణికించే చలి.. మరోవైపు పతకాల ఆకలి! జర్రున జారే స్కేటర్లు! దూసుకుపోయే స్కీయర్లు! మాయ చేసే హాకీ స్టిక్‌లు! ఇలా కూడా ఆడతారా అనిపించే క్రీడలు.. ఈ దృశ్యాలన్నిటికి వేదిక వింటర్‌ ఒలింపిక్స్‌! బీజింగ్‌ కేంద్రంగా నేటి నుంచే ఈ మంచు క్రీడోత్సవం.

బీజింగ్‌: వింటర్‌ ఒలింపిక్స్‌కు వేళైంది.. హిమ శిఖరాల్లో పతకాల వేటకు సమయం ఆసన్నమైంది. ఈ క్రీడలు ప్రారంభమయ్యేది శుక్రవారమే. 90 దేశాల నుంచి దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, పక్షం రోజులకు పైగా సాగే సమరంలో పోటీపడబోతున్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగబోతున్నాయి. ఈ ఆటల కోసం బీజింగ్‌, యన్‌కింగ్‌, జాంగ్‌జియా నగరాల్లోని 13 వేదికలు ముస్తాబయ్యాయి. ప్రఖ్యాత బీజింగ్‌ జాతీయ స్టేడియం (బర్డ్‌నెస్ట్‌)లో శుక్రవారం ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే కర్లింగ్‌, లూజ్‌, స్కై జంపింగ్‌, అల్పైన్‌ స్కీయింగ్‌, ఫ్రీస్టయిల్‌ స్కీయింగ్‌, ఐస్‌ హాకీ, స్కై జంపింగ్‌ విభాగాల్లో పోటీలు మొదలుకాగా.. శనివారం పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో ఈసారి వింటర్‌ ఒలింపిక్స్‌లో విదేశీ వీక్షకులకు ప్రవేశం లేదు. అంతేకాదు అథ్లెట్లు, అధికారుల కోసం ప్రత్యేకమైన క్లోజ్డ్‌ లూప్‌ సిస్టమ్‌ (బబుల్‌)ను ఏర్పాటు చేశారు. క్రీడా గ్రామంలో ఉండే వారికి ఎప్పటికప్పుడు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. బీజింగ్‌లో ఒలింపిక్స్‌ జరగబోతుండడం గత 14 ఏళ్లలో ఇది రెండోసారి. 2008లో ఇక్కడే వేసవి ఒలింపిక్స్‌ జరిగాయి. ఈసారి క్రీడల్లో ఫ్రీ స్టయిల్‌ స్కీయింగ్‌ (మిక్స్‌డ్‌ జెండర్‌ టీమ్‌ ఏరియల్స్‌), ఫ్రీస్టయిల్‌ స్కీయింగ్‌ (పురుషుల బ్యాగ్‌ ఎయిర్‌), ఫ్రీస్టయిల్‌ స్కీయింగ్‌ (మహిళల బిగ్‌ ఎయిర్‌), షార్ట్‌ ట్రాక్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌ రిలే), స్కై జంపింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌), స్నో బోర్డింగ్‌ (మిక్స్‌డ్‌ టీమ్‌ స్నో బోర్డ్‌ క్రాస్‌) విభాగాలు కొత్తగా చోటు దక్కించుకున్నాయి.

భారత్‌ నుంచి ఆరిఫ్‌: ఈసారి వింటర్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి ఒక అథ్లెటే అర్హత సాధించాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్‌ ఖాన్‌ స్కీయింగ్‌లో పోటీపడబోతున్నాడు. స్లాలోమ్‌, జెయింట్‌ స్లాలోమ్‌ విభాగాల్లో అతడు బరిలో దిగనున్నాడు. 2002 తర్వాత ఒక్కరే పాల్గొనడం ఇదే తొలిసారి. 1964 నుంచి వింటర్‌ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత్‌.. ఇప్పటిదాకా ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది. శివ కేశవన్‌ (లూజ్‌) అత్యధికంగా ఆరుసార్లు ఈ క్రీడల్లో పాల్గొన్నాడు. చివరిగా జరిగిన 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లోనూ శివ కేశవన్‌ పాల్గొన్నాడు.

ఊపిరి పీల్చుకున్న భారత్‌: మేనేజర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ వానీకి నెగెటివ్‌ రావడంతో కోసం ఈ క్రీడల కోసం బీజింగ్‌కు వెళ్లిన భారత బృందం ఊపిరి పీల్చుకుంది. ఈ మెగా ఈవెంట్‌ కోసం బీజింగ్‌కు వచ్చిన భారత జట్టుకు పరీక్షలు నిర్వహించగా.. అబ్బాస్‌కు పాజిటివ్‌ వచ్చింది. అయితే గత 24 గంటల్లో రెండుసార్లు అతడికి కొవిడ్‌ పరీక్ష చేయగా.. ఫలితం నెగెటివ్‌ వచ్చింది. ‘‘భారత జట్టు మేనేజర్‌ అబ్బాస్‌కు గత 24 గంటల్లో నిర్వహించిన రెండు పరీక్షల్లో నెగెటివ్‌ ఫలితం వచ్చింది. ఇప్పుడు భారత బృందం కొవిడ్‌ రహితం. మా పట్ల ఎంతో శ్రద్ధ చూపించిన చెఫ్‌ డి మిషన్‌ హర్జీందర్‌ సింగ్‌కు, చైనాలోని భారత రాయబార కార్యాలయానికి, క్రీడల మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు’’ భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా చెప్పాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని