U19WC: యువ భారత్‌.. విజయీభవ

13 ప్రపంచకప్‌లు.. ఏడు ఫైనళ్లు.. నాలుగు సార్లు విజేత.. ఇదీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత ఘనమైన చరిత్ర. అంతటి అద్భుత వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత భుజాలకెత్తుకున్న కుర్రాళ్లు.. 14వ ప్రపంచకప్‌లో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు.శనివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడుతున్నారు.

Updated : 05 Feb 2022 07:20 IST

నేడే అండర్‌-19 ప్రపంచకప్‌ఫైనల్‌
ఇంగ్లాండ్‌తో భారత్‌ ఢీ

నార్త్‌సౌండ్‌

13 ప్రపంచకప్‌లు.. ఏడు ఫైనళ్లు.. నాలుగు సార్లు విజేత.. ఇదీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత ఘనమైన చరిత్ర. అంతటి అద్భుత వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత భుజాలకెత్తుకున్న కుర్రాళ్లు.. 14వ ప్రపంచకప్‌లో టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు.శనివారం ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడుతున్నారు. వరుసగా నాలుగో సారి ఆఖరి పోరుకు అర్హత సాధించిన యువ టీమ్‌ఇండియా.. కప్పు కలను అందుకునే దిశగా ఉరకలు వేస్తోంది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న జట్టు.ఇంగ్లిష్‌పరీక్షను దాటి అయిదో టైటిల్‌ సాధించాలన్నది అభిమానుల ఆకాంక్ష. మరి కుర్రాళ్లు ఏం చేస్తారో?

సీనియర్‌ పురుషుల, మహిళలు.. జూనియర్‌ స్థాయి.. ఇలా ఏ విభాగంలోనైనా క్రికెట్లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచి నాలుగేళ్లవుతోంది. చివరగా 2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో దేశానికి టైటిల్‌ దక్కింది. ఆ తర్వాత అయిదు ప్రపంచకప్‌లు (పురుషుల వన్డే, టీ20.. రెండు మహిళల టీ20.. అండర్‌-19 కలిపి) జరిగినా మనకు నిరాశ తప్పలేదు. మరోసారి భారత్‌కు ప్రపంచకప్‌ అందించే అవకాశం అండర్‌-19 కుర్రాళ్లకే వచ్చింది. నేడు ఫైనల్లో యువ భారత్‌.. ఇంగ్లాండ్‌ను ఓడించి కప్పు అందుకోవాలని దేశం ఆకాంక్షిస్తోంది. సీనియర్‌ జట్టులోకి అడుగుపెట్టే దిశగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల దృష్టిలో పడేందుకు.. ఈ మ్యాచ్‌ కుర్రాళ్లకు గొప్ప అవకాశం. అందుకే తమ సత్తాచాటి టైటిల్‌ కొట్టేయాలనే పట్టుదలతో వాళ్లున్నారు. మరోవైపు భారత్‌ లాగే అజేయంగా ఫైనల్‌ చేరిన ఇంగ్లాండ్‌ 24 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని చూస్తోంది. 1998లో తొలిసారి ఈ కప్పు తుదిపోరు చేరిన ఆ జట్టు విజేతగా నిలిచింది.

ఆత్మవిశ్వాసంతో..: కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొనే ఓపెనర్లు.. ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్‌.. అదిరే ముగింపునిచ్చే ఫినిషర్లు.. ఇలా బ్యాటింగ్‌లో భారత్‌ పటిష్ఠంగా ఉంది. ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్‌ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం మన బలాన్ని చాటుతోంది. సెమీస్‌ మినహా నిలకడగా రాణించిన ఓపెనర్‌ రఘువంశీ (5 మ్యాచ్‌ల్లో 278) ఈ టోర్నీలో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గత మ్యాచ్‌లో అతి జాగ్రత్తగా పోయి ఓపెనర్లు వికెట్లు పారేసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఘువంశీతో పాటు హర్నూర్‌ క్రీజులో నిలబడితే జట్టుకు మంచి ఆరంభం దక్కినట్లే. ఇక ఆ తర్వాత సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌, కెప్టెన్‌ యశ్‌ సవాలుకు సిద్ధమయ్యారు. పరిస్థితులను బట్టి గేర్లు మారుస్తూ బ్యాటింగ్‌ చేసే ఈ ఇద్దరూ జోరు కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. రాజ్‌ బవా (5 మ్యాచ్‌ల్లో 217)తో పాటు రాజ్‌వర్ధన్‌, నిశాంత్‌, దినేశ్‌తో మిడిలార్డర్‌ బలంగా ఉంది. ఆల్‌రౌండర్లు రాజ్‌వర్ధన్‌, నిశాంత్‌, రాజ్‌.. బంతితోనూ అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వికెట్‌ కీపర్‌ దినేశ్‌పై మంచి అంచనాలున్నాయి.

బౌలర్లు సమష్టిగా..: టోర్నీలో ఇప్పటివరకూ సమష్టిగా రాణించిన భారత బౌలర్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అదనపు పేస్‌తో రాజ్‌వర్ధన్‌, స్వింగ్‌తో రవికుమార్‌ ఆకట్టుకుంటున్నారు. ఇక విక్కీ సారథ్యంలోని స్పిన్‌ విభాగం అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తోంది. ఆఫ్‌స్పిన్నర్‌ విక్కీ (5 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు) నిలకడగా రాణిస్తూ టోర్నీలో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మరో ఇద్దరు స్పిన్నర్లు నిశాంత్‌, కౌశల్‌ కూడా ఆసీస్‌తో పోరులో మెరిశారు. మన బౌలర్లు ఒకరు కాకపోతే మరొకరు వికెట్ల వేటలో సాగుతూ ప్రత్యర్థిని కట్టడి చేస్తూ వచ్చారు. ఫైనల్లోనూ ఇంగ్లాండ్‌పై బౌలర్లు ఇదే ప్రదర్శన చేయాలని జట్టు ఆశిస్తోంది. ప్రత్యర్థి బ్యాటర్లను మన వాళ్లు కట్టడి చేస్తే విజయావకాశాలు మెరుగవుతాయి.
కరోనాను దాటి..: కఠిన పరిస్థితులను దాటి పోరాట పటిమతో పుంజుకోవడం ఎలాగో భారత కుర్రాళ్లకు బాగా తెలుసు. టోర్నీలో తొలి మ్యాచ్‌ పూర్తి కాగానే కెప్టెన్‌ యశ్‌, వైస్‌ కెప్టెన్‌ రషీద్‌తో సహా ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో గ్రూప్‌ దశలో రెండు మ్యాచ్‌లకు వీళ్లు దూరమయ్యారు. ఆ సమయంలో ఉన్న జట్టుతోనే ఆడిన భారత్‌ అద్భుత పోరాటంతో క్వార్టర్స్‌ చేరింది. తిరిగి క్వార్టర్స్‌కు అందుబాటులోకి వచ్చిన యశ్‌, రషీద్‌ ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే బంగ్లాదేశ్‌తో బరిలో దిగి లయ అందుకున్నారు. సెమీస్‌లో ఎంతో పరిణతితో కూడిన బ్యాటింగ్‌తో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. 37కే ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 106 సగటుతో 212 పరుగులు చేసిన యశ్‌ శతకంతో, రషీద్‌ (3 మ్యాచ్‌ల్లో 151) 94 పరుగులతో ఆసీస్‌పై రాణించారు. నిశాంత్‌ కూడా వైరస్‌ నుంచి కోలుకుని సెమీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లోనూ ఈ కుర్రాళ్లు ఇదే పోరాటాన్ని ప్రదర్శిస్తే కప్పు ఖాతాలో చేరినట్లే!

తక్కువేం కాదు..: భారత ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ తక్కువదేమీ కాదు. ఆ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తుదిపోరు చేరింది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ టామ్‌ ప్రెస్ట్‌ (292) ఇప్పటివరకూ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్‌ జాకోబ్‌ బెతెల్‌ (203) కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. సెమీస్‌లో చెరో అర్ధశతకం చేసిన జార్జ్‌ బెల్‌, అలెక్స్‌ కూడా ప్రమాదకరమే. వీళ్లను భారత బౌలర్లు ఎంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే జట్టుకు అంత మంచింది. ఇక బౌలింగ్‌లో పేసర్‌ జోషువా బాయ్‌డెన్‌ (13), మణికట్టు స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ (12) ఇంగ్లాండ్‌కు కీలకంగా మారారు. అఫ్గాన్‌తో పోరులో ఆఖర్లో ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టును గెలిపించిన రెహాన్‌ పట్ల భారత్‌ జాగ్రత్తగా ఉండాలి. ఆ మ్యాచ్‌లో ఓటమి దిశగా సాగి చివర్లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్న ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.


4
అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధికంగా భారత్‌ నాలుగు టైటిళ్లు గెలిచింది. 2000, 2008, 2012, 2018లో విజేతగా అవతరించింది. మూడు సార్లు (2006, 2016, 2020)లో   రన్నరప్‌గా నిలిచింది.


8

                             ఈ ప్రపంచకప్‌లో భారత్‌కిది ఎనిమిదో ఫైనల్‌. మరే జట్టు కూడా ఇన్నిసార్లు తుదిపోరు చేరలేదు.


1

                                                                 ఇంగ్లాండ్‌ ఇప్పటివరకూ ఒక్కసారి మాత్రమే ఈ ప్రపంచకప్‌ గెలిచింది. 1998లో కప్పు అందుకుంది.


తుది జట్లు (అంచనా):
భారత్‌: రఘువంశీ, హర్నూర్‌, షేక్‌ రషీద్‌, యశ్‌ ధుల్‌, రాజ్‌వర్ధన్‌, నిశాంత్‌, దినేశ్‌, కౌశల్‌, రాజ్‌ బవా, విక్కీ, రవి కుమార్‌.
ఇంగ్లాండ్‌: జార్జ్‌ థామస్‌, బెతెల్‌, టామ్‌ ప్రెస్ట్‌, జేమ్స్‌, విలియమ్‌ లక్స్‌టన్‌, జార్జ్‌ బెల్‌, రెహాన్‌ అహ్మద్‌, అలెక్స్‌, జేమ్స్‌ సేల్స్‌, థామస్‌, జోషువా బాయ్‌డెన్‌.  


ఫైనల్‌ చేరాయిలా..

భారత్‌
గ్రూప్‌- బి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాపై 45 పరుగుల తేడాతో, ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో, ఉగాండాపై 326 పరుగుల తేడాతో విజయాలు.
క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు.
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 96 పరుగుల తేడాతో విజయం.

ఇంగ్లాండ్‌
గ్రూప్‌- ఎ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్లతో, కెనడాపై 106 పరుగుల తేడాతో, యూఏఈపై 189 పరుగుల తేడాతో విజయాలు.
క్వార్టర్స్‌లో 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపు.
సెమీస్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం అఫ్గానిస్థాన్‌పై 15 పరుగుల తేడాతో విజయం 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని