Sourav Ganguly: అవన్నీ నిరాధార ఆరోపణలే: సౌరభ్‌ గంగూలీ

సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. తానేమి నేరుగా బోర్డు అధ్యక్షుడు కాలేదని 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరభ్‌ పేర్కొన్నాడు.

Updated : 05 Feb 2022 08:56 IST

దిల్లీ: సెలక్షన్‌ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. తానేమి నేరుగా బోర్డు అధ్యక్షుడు కాలేదని 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరభ్‌ పేర్కొన్నాడు. ‘‘జట్టు సెలక్షన్‌ విషయంలో కల్పించుకుంటునానన్న ఆరోపణలపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను బీసీసీఐ అధ్యక్షుడిగా ఏం చేయాలో అదే చేశాను. నాతో పాటు జైషా, అప్పటి కెప్టెన్‌ కోహ్లి, సంయుక్త కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌తో కూర్చున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయిన ఫొటో సెలక్షన్‌ కమిటీ సమావేశానికి సంబంధించింది కాదు. జయేశ్‌ జార్జ్‌ ఎప్పుడూ సెలక్షన్‌ కమిటీ సమావేశంలో పాల్గొనలేదు. నేను భారత్‌కు 424 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాను. ఈ విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలి. నాపై చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలే’’ అని దాదా చెప్పాడు. త్వరలోనే టెస్టు కెప్టెన్‌ను ప్రకటిస్తామని చెప్పిన సౌరభ్‌.. రహానె, పుజారా, పాండ్యలు రంజీ ట్రోఫీ ఆడే అవకాశాలున్నాయని చెప్పాడు.    ‘‘మార్చిలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ఫిబ్రవరి మూడో వారంలో రంజీ ట్రోఫీ మొదలు కాబోతోంది. రహానె, పుజారా రంజీల్లో ఆడితే సెలక్టర్లు వారిపై ఒక అవగాహనకు వస్తారు. హార్దిక్‌ పాండ్య కోలుకోవడానికి సమయం ఇచ్చాం. అతడు రంజీల్లో ఆడడం ఉత్తమం. అతడు వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయాలి. అప్పుడే అతడి శరీరం దృఢంగా మారుతుంది. ఐపీఎల్‌లో అతడు అహ్మదాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యలో జాతీయ జట్టుకు సేవలందించడానికి అతడు ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది సెలక్టర్లు పరిశీలిస్తారు. టెస్టు కెప్టెన్‌ ఎవరు అనేది త్వరలో సెలక్టర్లు నిర్ణయిస్తారు. సెలక్టర్ల దృష్టిలో ఒక పేరు ఉందని అనుకుంటున్నా. త్వరలోనే ఆ పేరు ప్రకటిస్తారు’’ అని గంగూలీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని