IND vs WI: విండీస్‌తో సై.. రోహిత్‌ సారథ్యంలో భారత్‌కు తొలి పరీక్ష

భారత క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతోంది. తిరిగి టాప్‌ ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్న టీమ్‌ ఇండియా కొత్త కెప్టెన్‌ రోహిత్‌ సారథ్యంలో ఓ కొత్త సిరీస్‌కు సిద్ధమైపోయింది. వెస్టిండీస్‌తో తొలి వన్డే నేడే. మిడిల్‌ ఆర్డర్‌ సమస్యను భారత్‌ ఎలా అధిగమిస్తుందన్నదే మ్యాచ్‌లో కీలకం.

Updated : 06 Feb 2022 06:38 IST

అహ్మదాబాద్‌

భారత క్రికెట్లో కొత్త శకం మొదలు కాబోతోంది. తిరిగి టాప్‌ ఫామ్‌ను అందుకోవాలనుకుంటున్న టీమ్‌ ఇండియా కొత్త కెప్టెన్‌ రోహిత్‌ సారథ్యంలో ఓ కొత్త సిరీస్‌కు సిద్ధమైపోయింది. వెస్టిండీస్‌తో తొలి వన్డే నేడే. మిడిల్‌ ఆర్డర్‌ సమస్యను భారత్‌ ఎలా అధిగమిస్తుందన్నదే మ్యాచ్‌లో కీలకం.

స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమైపోయాడు. కోహ్లి నుంచి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందుకున్నాక అతడు తొలిసారి జట్టును నడిపించనున్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి వన్డేలో వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. దక్షిణాఫ్రికాలో షాక్‌ తగిలిన నేపథ్యంలో రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ జట్టును తిరిగి గెలుపు బాట పట్టించాలనే పట్టుదలతో ఉన్నారు. భారత్‌కు ఇది 1000వ వన్డే కావడం విశేషం.

అదే సమస్య..: సొంతగడ్డపై సత్తా చాటాలనుకుంటున్న భారత జట్టుకు మిడిల్‌ ఆర్డరే పెద్ద సమస్య. ఇది చాలా రోజులుగా ఉన్న సమస్యే. దీనిపై రోహిత్‌, ద్రవిడ్‌ ప్రత్యేక దృష్టిపెడతారనడంలో, మార్పులు చేర్పులు ఉంటాయనడంలో సందేహం లేదు. మిడిల్‌ ఆర్డర్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరముంది. వ్యక్తిగత కారణాలతో రాహుల్‌ తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. ఇతర స్పెషలిస్ట్‌ ఓపెనర్లు ధావన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కరోనా పాజిటివ్‌ వల్ల అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ‘‘మాకు ఉన్న ఏకైక ఓపెనింగ్‌ ప్రత్యామ్నాయం ఇషాన్‌ కిషన్‌ మాత్రమే. అతడు నాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. మయాంక్‌ను జట్టులో చేర్చారు. కానీ అతడు ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడి మూడు రోజుల క్వారంటైన్‌ ఇంకా ముగియలేదు. కాబట్టి ఇషాన్‌ ఓపెనర్‌గా దిగుతాడు’’ అని రోహిత్‌ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పంత్‌ ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే.. అన్ని మ్యాచ్‌ల్లో మిడిల్‌ ఆర్డర్‌ తడబడింది. మిడిల్‌ ఆర్డర్‌లో ప్రభావం చూపే బ్యాట్స్‌మెన్‌ భారత్‌కు ఇప్పుడు కావాలి. కరోనా కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ కూడా సిరీస్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో సత్తా చాటుకునేందుకు ధనాధన్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌కు, అంతే దూకుడుగా ఆడే దీపక్‌ హుడాకు ఇదో చక్కని అవకాశం. హుడా విజయ్‌ హజారే ట్రోఫీలో విశేషంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ సిరీస్‌లో అతడు అదే ఫామ్‌ను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. విరాట్‌ కోహ్లి ఎలా ఆడతాడన్నది కూడా భారత్‌కు కీలకమే. బౌలింగ్‌ కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసిన మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తుది జట్టులో ఉండే అవకాశముంది. అతడు చాహల్‌తో కలిసి స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశాలు మెండు. బుమ్రా, షమి గైర్హాజరీలో శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లకు తోడుగా ప్రసిద్ధ్‌ కృష్ణ పేస్‌ బౌలింగ్‌ భారాన్ని పంచుకునే అవకాశముంది.

ఆత్మవిశ్వాసంతో విండీస్‌: ఫార్మాట్‌ భిన్నమైందే అయినా.. సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించడంతో వెస్టిండీస్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. హెట్‌మయర్‌, లూయిస్‌ సిరీస్‌కు దూరమైనా ఆ జట్టులో ప్రతిభావంతులకు కొదువలేదు. పూరన్‌ లాంటి పవర్‌ హిట్టర్స్‌ ఆ జట్టులో ఉన్నారు. కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌, ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌లకు మ్యాచ్‌ గమనాన్ని శాసించే సత్తా ఉంది. ఐపీఎల్‌ వేలానికి ముందు ఫ్రాంఛైజీలను ఆకర్షించేందుకు విండీస్‌ జట్టులో చాలా మంది వర్ధమాన ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ అకీల్‌ హొసీన్‌ వంటి వారు ఆసక్తిరేపుతున్నారు.

పిచ్‌ ఎలా ఉందంటే..: పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే పెద్ద బౌండరీలు బ్యాట్స్‌మెన్‌ పవర్‌ హిట్టింగ్‌కు సవాలు విసరనున్నాయి. మ్యాచ్‌పై మంచు ప్రభావం ఉండే అవకాశముంది.

తుది జట్లు... భారత్‌ (అంచనా): రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, కోహ్లి, పంత్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ; వెస్టిండీస్‌ (అంచనా): హోప్‌, బ్రెండన్‌ కింగ్‌, పూరన్‌, బ్రూక్స్‌, డారెన్‌ బ్రావో, పొలార్డ్‌, ఒడియన్‌ స్మిత్‌, హోల్డర్‌, అకీల్‌ హొసీన్‌, రోచ్‌, హేడెన్‌

4
వెస్టిండీస్‌తో సొంతగడ్డపై ఆడిన 58 వన్డేల్లో భారత్‌ సాధించిన విజయాలు. విండీస్‌ 28 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌ టైగా ముగిసింది.

భారత జట్టులో ఇషాన్‌, షారుక్‌

వెస్టిండీస్‌తో తొలి వన్డే కోసం భారత జట్టులో ఇషాన్‌ కిషన్‌, షారుక్‌ ఖాన్‌కు చోటు కల్పించారు. ‘‘వెస్టిండీస్‌తో తొలి వన్డే కోసం సెలక్షన్‌ కమిటీ.. ఇషాన్‌ కిషన్‌, షారుక్‌ ఖాన్‌లను భారత జట్టుకు ఎంపిక చేసింది’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ  ప్రకటనలో తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని