IND vs WI: అలవోకగా గెలిచారు..

రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు అదిరే ఆరంభం. తన 1000వ వన్డేలో టీమ్‌ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆల్‌రౌండ్‌ జోరుతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. స్లో పిచ్‌పై వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ తమ స్పిన్‌ మాయాజాలంతో కరీబియన్లను కళ్లెం వేస్తే.. ఛేదనలో కొత్త కెప్టెన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో విజయాన్ని తేలిక చేశాడు.

Updated : 07 Feb 2022 06:37 IST

వెయ్యో వన్డేలో భారత్‌ అదరహో

వెస్టిండీస్‌పై ఘనవిజయం

మాయ చేసిన చాహల్‌, సుందర్‌

మెరిసిన రోహిత్‌

అహ్మదాబాద్‌

రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు అదిరే ఆరంభం. తన 1000వ వన్డేలో టీమ్‌ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆల్‌రౌండ్‌ జోరుతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. స్లో పిచ్‌పై వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ తమ స్పిన్‌ మాయాజాలంతో కరీబియన్లను కళ్లెం వేస్తే.. ఛేదనలో కొత్త కెప్టెన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో విజయాన్ని తేలిక చేశాడు.

ప్రపంచ క్రికెట్లో వెయ్యో వన్డే ఆడుతున్న తొలి జట్టుగా రికార్డు నెలకొల్పిన టీమ్‌ఇండియా.. ఈ ప్రత్యేక మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఆదివారం వెస్టిండీస్‌తో తొలి వన్డేలో అన్ని రంగాల్లోనూ సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో అలవోకగా ప్రత్యర్థిని ఓడించింది. చాహల్‌ (4/49), వాషింగ్టన్‌ సుందర్‌ (3/30), ప్రసిద్ధ్‌ కృష్ణ (2/29) ధాటికి విండీస్‌ మొదట 43.5 ఓవర్లలో 176 పరుగులకే ఆలౌటైంది. జేసన్‌ హోల్డర్‌ (57; 71 బంతుల్లో 4×6) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (60; 51 బంతుల్లో 10×4, 1×6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని భారత్‌.. కేవలం 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 నాటౌట్‌; 36 బంతుల్లో 5×4), దీపక్‌ హుడా (26 నాటౌట్‌; 32 బంతుల్లో 2×4) రాణించారు. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే బుధవారం జరుగుతుంది.

రోహిత్‌ ధనాధన్‌: ఛేదనలో రోహిత్‌ శర్మ తనదైన శైలిలో దూకుడైన బ్యాటింగ్‌తో జట్టు సాఫీగా లక్ష్యం దిశగా సాగేలా చేశాడు. మరో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ సహకరిస్తుండగా రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. విండీస్‌ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన రోహిత్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. రోచ్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ బౌండరీతో ఖాతా తెరిచిన అతడు.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించాడు. చక్కని షాట్లతో అలరించాడు. ముఖ్యంగా వెటరన్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అతడు వేసిన పదో ఓవర్లో రెండు ఫోర్లు, తన ట్రేడ్‌ మార్క్‌ పుల్‌షాట్‌తో ఓ సిక్స్‌ కొట్టాడు. 14వ ఓవర్లో జోసెఫ్‌ అతణ్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకునే సమయానికి స్కోరు 84. ఆ తర్వాత కోహ్లి (8), కిషన్‌ (28), పంత్‌ (11) కొద్ది తేడాతో ఔట్‌ కావడంతో భారత్‌ 18వ ఓవర్లో 116/4తో నిలిచింది. 32 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయినా మ్యాచ్‌ పూర్తిగా భారత్‌ నియంత్రణలోనే ఉంది. సాధించాల్సిన రన్‌రేట్‌ చాలా తక్కువగా ఉండడంతో కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. సూర్యకుమార్‌ యాదవ్‌, అరంగేట్ర ఆటగాడు దీపక్‌ హుడా ఎలాంటి ఒత్తిడీ లేకుండా అలవోకగా పని పూర్తి చేశారు. ఈ జంట అభేద్యమైన అయిదో వికెట్‌కు 62 పరుగులు జోడించింది.

తిప్పేశారు..: వెస్టిండీన్‌ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లదే హవా. స్పిన్‌కు సహకరిస్తున్న స్లో పిచ్‌పై వీళ్ల మాయాజాలానికి నిలవలేకపోయిన కరీబియన్‌ జట్టు తక్కువ స్కోరుకే సరిపెట్టుకుంది. హోల్డర్‌, ఫాబియాన్‌ అలెన్‌ (29; 43 బంతుల్లో 2×4) తప్ప అంతా చేతులెత్తేశారు. ఆ ఇద్దరు పోరాడకుంటే విండీస్‌ కుప్పకూలేదే. 79 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును వీళ్లు ఆదుకున్నారు. ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ప్రత్యర్థికి కాస్త పుంజుకునే అవకాశమిచ్చినా.. భారత్‌కు ఇది చాలా సంతృప్తి కలిగించే బౌలింగ్‌ ప్రదర్శనే. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విండీస్‌కు కళ్లెం వేసిన సుందర్‌, చాహల్‌ ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. కచ్చితత్వంలో కూడిన సుందర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమైపోయింది. 6-1-21-2.. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌లో వచ్చిన సుందర్‌ స్పెల్‌ ఇది. అతడు ఒకే ఓవర్లో కింగ్‌ (13), డారెన్‌ బ్రావో (18)ను ఔట్‌ చేయడం ద్వారా విండీస్‌ను దెబ్బతీశాడు. సుందర్‌ స్పెల్‌ ముగిశాక బౌలింగ్‌కు వచ్చిన చాహల్‌ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పూరన్‌, పొలార్డ్‌లను ఔట్‌ చేయడం ద్వారా విండీస్‌కు   షాకిచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే అతడు బ్రూక్స్‌ (12)నూ ఔట్‌ చేయడంతో ఆ జట్టు 78/6కు పరిమితమైంది. భారత స్పిన్నర్లే కాదు పేసర్లూ ఆకట్టుకున్నారు. మూడో ఓవర్లోనే హోప్‌ (8)ను ఔట్‌ చేయడం ద్వారా విండీస్‌ పతనాన్ని ఆరంభించిన సిరాజ్‌.. తన తొలి  5 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చాడు. అస్థిరమైన బౌన్స్‌ను ఉపయోగించుకుంటూ ప్రసిద్ధ్‌ కూడా చక్కగా బౌలింగ్‌ చేశాడు. ప్రత్యర్థికి ఏమాత్రం బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. హోల్డర్‌, అలెన్‌ నిలవడంతో కరీబియన్‌ జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అలెన్‌ను ఔట్‌ చేయడం ద్వారా సుందర్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాక ఇన్నింగ్స్‌ ఎంతో సేపు సాగలేదు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: హోప్‌ (బి) సిరాజ్‌ 8; కింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) సుందర్‌ 13; డారెన్‌ బ్రావో ఎల్బీ (బి) సుందర్‌ 18; బ్రూక్స్‌ (సి) పంత్‌ (బి) చాహల్‌ 12; పూరన్‌ ఎల్బీ (బి) చాహల్‌ 18; పొలార్డ్‌ (బి) చాహల్‌ 0; హోల్డర్‌ (సి) పంత్‌ (బి) ప్రసిద్ధ్‌ 57; అకీల్‌ (సి) పంత్‌ (బి) ప్రసిద్ధ్‌ 0; అలెన్‌ (సి) అండ్‌ (బి) సుందర్‌ 29; అల్జారి జోసెఫ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 13; రోచ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (43.5 ఓవర్లలో ఆలౌట్‌) 176; వికెట్ల పతనం: 1-13, 2-44, 3-45, 4-71, 5-71, 6-78, 7-79, 8-157, 9-167; బౌలింగ్‌: సిరాజ్‌ 8-2-26-1; ప్రసిద్ధ్‌ కృష్ణ 10-0-29-2; సుందర్‌ 9-1-30-3; శార్దూల్‌ ఠాకూర్‌ 7-0-38-0; చాహల్‌ 9.5-0-49-4

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) జోసెఫ్‌ 60; ఇషాన్‌ కిషన్‌ (సి) అలెన్‌ (బి) అకీల్‌ 28; కోహ్లి (సి) రోచ్‌ (బి) జోసెఫ్‌ 8; పంత్‌ రనౌట్‌ 11; సూర్యకుమార్‌ నాటౌట్‌ 34; దీపక్‌ హుడా నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (28 ఓవర్లలో) 178/4; వికెట్ల పతనం: 1-84, 2-93, 3-115, 4-116; బౌలింగ్‌: రోచ్‌ 5-0-41-0; హోల్డర్‌ 5-0-29-0; అల్జారి జోసెఫ్‌ 7-0-45-2; అకీల్‌ హొసీన్‌ 9-0-46-1; ఫాబియన్‌ అలెన్‌ 2-0-14-0


10

గత 16 వన్డేల్లో వెస్టిండీస్‌ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయలేకపోవడం ఇది పదోసారి.


2

వన్డేల్లో వంద వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న రెండో భారత స్పిన్నర్‌గా చాహల్‌ నిలిచాడు. అతడు ప్రస్తుతం 60 వన్డేల్లో 103 వికెట్లతో ఉన్నాడు. కుల్‌దీప్‌ అత్యంత వేగంగా (58 మ్యాచ్‌ల్లో) వన్డేల్లో వంద వికెట్లు సాధించిన భారత స్పిన్నర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని