Peng Shuai: ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుంది

తానెవరి మీదా లైంగిక హింస ఆరోపణలు చేయలేదని, తన సోషల్‌ మీడియా పోస్టును బయటి ప్రపంచం అపార్థం చేసుకుందని చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి తెలిపింది. తన క్షేమాన్ని కోరుకున్న టెన్నిస్‌ ప్లేయర్లకు

Updated : 08 Feb 2022 06:52 IST

బీజింగ్‌

తానెవరి మీదా లైంగిక హింస ఆరోపణలు చేయలేదని, తన సోషల్‌ మీడియా పోస్టును బయటి ప్రపంచం అపార్థం చేసుకుందని చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి తెలిపింది. తన క్షేమాన్ని కోరుకున్న టెన్నిస్‌ ప్లేయర్లకు ఆమె ధన్యవాదాలు చెప్పింది. కానీ ఎందుకు అంత ఆందోళన చెందారో తెలుసుకోవాలని ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జంగ్‌ తనపై లైంగిక హింసకు పాల్పడ్డాడని గతేడాది నవంబర్‌ 2న పెంగ్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం.. వెంటనే దాన్ని తొలగించడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఆమె బయట కనిపించకపోవడంతో తన అదృశ్యంపై టెన్నిస్‌ వర్గాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ సంఘటన తర్వాత ఇప్పుడే తొలిసారి ఆమె ఓ వీదేశీ మీడియాతో మాట్లాడింది. ఓ ఫ్రెంచ్‌ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా స్వేచ్ఛగా సాగలేదు. అడగాల్సిన ప్రశ్నలకు ముందుగానే ఆమెకు పంపించడంతో పాటు ఇంటర్వ్యూ సమయంలో మధ్యలో చైనా ఒలింపిక్‌ ప్రతినిధి ఉండి ఆమె మాటలను చైనీస్‌ నుంచి అనువదించాడు. దీంతో అసలు ఏం జరిగిందో అనే ప్రశ్న అడిగేందుకు.. ఆమె సమాధానం చెప్పేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ డబుల్స్‌ మాజీ నంబర్‌వన్‌ ఇక తిరిగి టెన్నిస్‌ ఆడడం కష్టమేనని చెప్పింది. ‘‘లైంగిక హింసనా? ఎవరైనా నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని నేనెప్పుడూ చెప్పలేదు. నా పోస్టును బయటి ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుంది. ఆ తర్వాత దాన్ని నేనే తొలగించా. ఆ పోస్టు పెట్టినప్పటి నుంచి నా జీవితం ఏం మారలేదు. ఎప్పటిలాగే ఉంది. నా క్షేమాన్ని కోరుకున్న సహచర టెన్నిస్‌ ప్లేయర్లకు అభినందనలు. కానీ వాళ్లు ఎందుకంత ఆందోళన చెందారో తెలుసుకోవాలనుకుంటున్నా. నేనెప్పుడూ అదృశ్యమవలేదు. డబ్ల్యూటీఏ మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్‌ విభాగం నాకు మెయిల్‌ పంపింది. అది అన్యాయం. నాకు మానసికంగా సాయం పొందాల్సిన అవసరం ఏముంది’’ అని ఆమె తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని