Team India U19: బీసీసీఐ యోచన కొత్తగా అండర్‌-19+

కమల్‌ పస్సి కొన్ని సీజన్ల కింద పంజాబ్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇక రవికాంత్‌ సింగ్‌ ఈ క్రికెట్‌ వ్యవస్థలో ఎక్కడున్నాడో తెలియదు. మంజోత్‌ కల్రా కెరీర్‌ కూడా ముందుకు సాగట్లేదు...వీళ్లంతా

Updated : 08 Feb 2022 06:50 IST

యువ ప్రతిభకు ప్రోత్సాహం

దిల్లీ

మల్‌ పస్సి కొన్ని సీజన్ల కింద పంజాబ్‌ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. ఇక రవికాంత్‌ సింగ్‌ ఈ క్రికెట్‌ వ్యవస్థలో ఎక్కడున్నాడో తెలియదు. మంజోత్‌ కల్రా కెరీర్‌ కూడా ముందుకు సాగట్లేదు.
..వీళ్లంతా గతంలో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచినవాళ్లే. కానీ మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లుగా కనపడ్డ వీళ్లు క్రమంగా కనుమరుగయ్యారు. ఇప్పుడు బీసీసీఐ దృష్టిసారించాల్సింది ఈ సమస్యపైనే. ఈ నేపథ్యంలో కొత్త అండర్‌-19+ వయో విభాగం జట్టును ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. తద్వారా 19 ఏళ్లు దాటిన అండర్‌-19 ప్రతిభావంతులు క్రికెట్‌ వ్యవస్థ పరిధిలో ఉండేలా, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) పర్యవేక్షణలో వాళ్లు పురోగతి సాధించేలా చూడాలని అనుకుంటోంది.

తాజా అండర్‌-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన షేక్‌ రషీద్‌ (ఆంధ్ర), రవి కుమార్‌ (బెంగాల్‌), రాజ్‌ అంగద్‌ బవా (చండీగఢ్‌), యశ్‌ ధుల్‌ (దిల్లీ)కు నేరుగా రంజీ జట్టులో చోటు దక్కొచ్చు. కానీ ప్రస్తుత జట్టులోని చాలా మంది అండర్‌-19 తదుపరి దశ, రంజీ ట్రోఫీకి మధ్య ఎటూ గాని స్థితిలో ఉండే అవకాశముంది. రాష్ట్ర స్థాయిలో అండర్‌-25 విభాగం ఉంది. కానీ జట్లలోని కొన్ని స్థానాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ‘‘సీనియర్‌ భారత జట్టు కోసం ఆటగాళ్లను సిద్ధం కోసం ఎన్‌సీఏ భవిష్యత్తులో అయిదు అంచెల వ్యవస్థపై దృష్టి పెట్టే అవకాశముంది. ఈ వ్యవస్థలో మొదట అండర్‌-16, ఆ తర్వాత అండర్‌-19, ఎమర్జింగ్‌ (జాతీయ అండర్‌-23), ఎ జట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఇప్పుడు 19+ విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఈ విభాగంలో ఈ కుర్రాళ్లందరినీ కలపొచ్చు’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ విభాగాలన్నింటిలో బీసీసీఐ అండర్‌-25 (రాష్ట్ర ‘ఎ’జట్టు) సీనియర్‌ స్థాయికి వెళ్లలేని ఆటగాళ్లకు వేదికలా ఉపయోగపడుతోంది.

ఇప్పటికీ ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్‌ క్రమం తప్పకుండా ఆడని 23-24 ఏళ్ల కుర్రాళ్లలో చాలా మంది సీనియర్‌ గ్రేడ్‌కు వెళ్లలేకపోవచ్చని కోచ్‌లకు తెలుసు. ఈ నేపథ్యంలో అండర్‌-19, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు మధ్య వారధి అవసరం. నాలుగు ఫస్ట్‌క్లాస్‌ స్థాయి మైదానాలతో కొత్త ఏన్‌సీఏ వాడుకలోకి వచ్చిందంటే.. అకాడమీ తన సొంత అండర్‌-19+ జట్లను కలిగి ఉండొచ్చు. తమలో తామే ఆడుతూ ఉండే ఈ జట్ల పురోగతిని కోచ్‌లు, ట్రెయినర్లు, ఫిజియోలు పర్యవేక్షించవచ్చు. వాళ్లు పై గ్రేడ్‌కు వెళ్లి రాష్ట్ర ‘ఎ’ జట్టు (అండర్‌-25) ఆడితే లేదా రంజీ ట్రోఫీ జట్టులో స్థానం సంపాదించవచ్చు. ఏ జట్టుకూ ఎంపిక కాకపోతే కనీసం ఎన్‌సీఏ పరిధిలోనైనా ఉంటారు. దీనిపై ఓ సమగ్ర ప్రణాళిక రూపొందించడం కోసం బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి త్వరలో పది మంది జాతీయ సెలక్టర్లు (అయిదుగురు సీనియర్‌, అయిదుగురు జూనియర్‌), ఎన్‌సీఏ అధినేత లక్ష్మణ్‌, సీనియర్‌ జట్టు కోచ్‌ ద్రవిడ్‌ చర్చలు జరిపే అవకాశముంది. ‘‘అండర్‌-19 ప్రపంచకప్పుతో మనమంతా పొంగిపోతున్నాం. మనకు గొప్ప వ్యవస్థ ఉంది. అందు వల్లే మన  జూనియర్‌ జట్లు ప్రపంచ స్థాయిలో ఎప్పుడూ ఉన్నత స్థితిలో ఉంటున్నాయి. కానీ ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ వచ్చేసరికే తేడా వస్తోంది. 2012 అండర్‌-19 జట్టునే తీసుకోండి. హనుమ విహారి ఒక్కడే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లెక్కడున్నారో తెలియదు. అందులో చాలా మంది కనీసం తమ తమ రాష్ట్రాల్లో అత్యుత్తమ దేశవాళీ ఆటగాళ్లుగా కూడా లేరు’’ ఓ  సీనియర్‌ బీసీసీఐ అధికారి అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని