IND vs WI: సిరీస్‌పై భారత్‌ కన్ను

జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే. తొలి వన్డేలో బంతితో, బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యం చలాయించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసిన రోహిత్‌ సేన.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ నెగ్గాలని చూస్తున్న ఆతిథ్య జట్టును అడ్డుకోవడం విండీస్‌కు సవాలే. విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.

Updated : 09 Feb 2022 07:10 IST

వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడు
మధ్యాహ్నం 1.30 నుంచి
అహ్మదాబాద్‌

జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సమరానికి సిద్ధమైంది. వెస్టిండీస్‌తో రెండో వన్డే నేడే. తొలి వన్డేలో బంతితో, బ్యాటుతో తిరుగులేని ఆధిపత్యం చలాయించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసిన రోహిత్‌ సేన.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ నెగ్గాలని చూస్తున్న ఆతిథ్య జట్టును అడ్డుకోవడం విండీస్‌కు సవాలే. విరామం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్‌ ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.

తొలి వన్డేలో ఘనవిజయంతో రెట్టించిన  ఉత్సాహంతో  ఉన్న భారత జట్టు బుధవారం జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్‌ను ఢీకొంటుంది. తొలి వన్డేలో తేలిపోయిన కరీబియన్‌ జట్టు.. ఈసారి ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి. స్పిన్‌ ద్వయం చాహల్‌, సుందర్‌ మాయ చేయడంతో మొదటి మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సిరీస్‌ విజయం కోసం చివరి మ్యాచ్‌ వరకు ఎదురు చూడాలని భారత్‌ అనుకోవట్లేదు. ముందే సిరీస్‌ గెలిచి క్లీన్‌స్వీప్‌ దిశగా అడుగేయాలనుకుంటోంది. తొలి వన్డేలో జోరును బట్టి చూస్తే బుధవారం భారత్‌ సిరీస్‌ గెలవకుండా అడ్డుకోవడం విండీస్‌కు కష్టమే.

రాహుల్‌ ఎక్కడ?: దక్షిణాఫ్రికాలో పరాభవం చవిచూసిన టీమ్‌ఇండియా.. రోహిత్‌ శర్మ నేతృత్వంలో తొలి వన్డేలో పూర్తి భిన్నంగా కనిపించింది. ఉత్సాహంతో చెలరేగిపోయింది. రెండో మ్యాచ్‌లోనూ అతే జోరు కొనసాగించాలనుకుంటోంది. జట్టుకు అతి పెద్ద సానుకూలాంశం కెప్టెన్‌ రోహితే. గాయంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయిన అతడు పునరాగమనంలో మంచి ఫామ్‌ను ప్రదర్శించాడు. మరోసారి బ్యాట్‌ ఝుళిపించాలని తహతహలాడుతున్నాడు. ఇషాన్‌ కిషన్‌ కూడా అంతే. కిషన్‌ ఓపెనర్‌గా.. రోహిత్‌కు చక్కని సహకారాన్నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాస్త విరామం తీసుకుని, రెండో వన్డే నుంచి అందుబాటులోకి వచ్చిన వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ ఏ స్థానంలో ఆడతాడన్నదే ప్రశ్న. కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడా లేదా మందకొడి పిచ్‌పై మిడిల్‌ ఆర్డర్‌లో వస్తాడా అన్నది చూడాలి. రాహుల్‌ వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఓపెనర్‌గా వస్తే కిషన్‌ అతడికి దారివ్వక తప్పదు. రాహుల్‌ ఒకవేళ మిడిల్‌ ఆర్డర్‌లో వస్తే దీపక్‌ హుడా పెవిలియన్‌కు పరిమితం కావాల్సివుంటుంది. కోహ్లి, పంత్‌, సూర్యకుమార్‌లతో భారత మిడిల్‌ ఆర్డర్‌ బలంగానే కనిపిస్తోంది. అంతగా ఫామ్‌లో లేని కోహ్లీకి ఈ మ్యాచ్‌ కీలకమైంది. తన 71వ అంతర్జాతీయ శతకం కోసం అతడు రెండేళ్లుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్‌లో ప్రధాన పేసర్లు బుమ్రా, షమి లేకున్నా టీమ్‌ ఇండియా మెరుగ్గా కనిపిస్తోంది. స్పిన్‌ ద్వయం వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చాహల్‌ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను గట్టి దెబ్బతీశారు. ఫాస్ట్‌బౌలర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా ఆకట్టుకున్నారు. వీళ్లను ఎదుర్కోవడం వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు సవాలే. పునరాగమనంలో అవకాశం కోసం చూస్తున్న స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిరీక్షించక తప్పదు.

విండీస్‌ పుంజుకునేనా?: తొలి వన్డేలో చిత్తయిన వెస్టిండీస్‌.. ఆ పరాభవాన్ని మర్చిపోయి అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. ఆ జట్టు ముఖ్యంగా బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సివుంది. గత 16 వన్డేల్లో 10 సార్లు ఆ జట్టు 50 ఓవర్లపాటు బ్యాటింగ్‌ చేయలేకపోయిందంటే బ్యాటింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నికోలస్‌ పూరన్‌, పొలార్డ్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు ఆ జట్టులో ఉన్నారు. ఎలాంటి బౌలింగ్‌లోనైనా చెలరేగే ఆ సత్తా వారిలో ఉంది. బుధవారం తమ రోజు అవుతుందని వాళ్లు ఆశిస్తూ ఉండొచ్చు. వీరికి తోడు షై హోప్‌, బ్రూక్స్‌, డారెన్‌ బ్రావో రాణించాల్సి ఉంది. బ్యాటింగ్‌లో హోల్డర్‌ ఫామ్‌ విండీస్‌కు సానుకూలాంశం. అతను బౌలింగ్‌లోనూ సత్తా చాటాలని జట్టు ఆశిస్తోంది. అల్జారి జోసెఫ్‌, అకీల్‌ హొసీన్‌ తప్ప తొలి మ్యాచ్‌లో కరీబియన్‌ బౌలర్లెవరూ ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌ ప్రధానంగా విండీస్‌ పేసర్లకు పరీక్షే. విండీస్‌ తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశముంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అలెన్‌ను పక్కన పెట్టి స్పెషలిస్టు స్పిన్నర్‌ హేడెన్‌ వాల్ష్‌ను ఆడించొచ్చని సమాచారం.


పిచ్‌ ఎలా ఉందంటే..

హ్మదాబాద్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. ఇక్కడ పిచ్‌ మందకొడిగా ఉంటుంది. స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు. బ్యాటింగ్‌కు పిచ్‌ బాగానే సహకరించే అవకాశముంది. మెరుగైన స్కోర్లే నమోదు కావచ్చు.


వాళ్లు కోలుకున్నారు

రోనా బారిన పడ్డ సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కోలుకున్నారు. ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న వారు మంగళవారం కాసేపు ప్రాక్టీస్‌ చేశారు. బీసీసీఐ వైద్య బృందం వారిని పర్యవేక్షించింది. అయితే కొవిడ్‌-19 నుంచి కోలుకున్నప్పటికీ రెండో వన్డేకు ఈ ఇద్దరు తుది జట్టులో ఉండే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఫిబ్రవరి 2న ధావన్‌, శ్రేయస్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. నెట్‌ బౌలర్‌ నవ్‌దీప్‌ సైనితో పాటు సహాయ బృందంలో మరో నలుగురు కూడా కొవిడ్‌-19 బారిన పడ్డారు. సైని స్టాండ్‌బై జాబితాలో ఉన్నాడు. అతనూ కోలుకున్నాడు. సాధన చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని