Updated : 11 Feb 2022 06:49 IST

Ajinkya Rahane: నిర్ణయాలు నావైతే ఘనత మరొకరి ఖాతాలో..

ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయంపై రహానె
మాజీ కోచ్‌ రవిశాస్త్రిపై పరోక్ష విమర్శలు
దిల్లీ

నిరుడు ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయానికి తన నిర్ణయాలే కారణమైనా.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని అప్పటి టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ ఆజింక్య రహానె అన్నాడు. అడిలైడ్‌ టెస్టులో భారత్‌ 36 పరుగులకే ఆలౌటవడం, ఆ మ్యాచ్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి వెళ్లడం, కెప్టెన్సీ బాధ్యతల్ని రహానె తీసుకోవడం తెలిసిందే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాల్ని చేపట్టిన రహానె.. యువ ఆటగాళ్లతో ఉన్న టీమ్‌ఇండియాలో స్ఫూర్తిని రగిలించాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో కదంతొక్కి జట్టుకు 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. అనంతరం భారత్‌ సిరీస్‌ సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే నిర్ణయాలు తనవైనా.. ఘనత మరొకరు తీసుకున్నారని తాజాగా రహానె విమర్శించాడు. పేరు చెప్పకపోయినా అప్పటి టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రిపై రహానె పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. నాటి అద్భుత విజయానికి రవిశాస్త్రిపై అప్పట్లో ప్రశంసల వర్షం కురిసింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమ్‌ఇండియా గొప్పగా పుంజుకోవడంలో రవిశాస్త్రి కీలకంగా వ్యవహరించాడంటూ మీడియా సైతం ఆకాశానికెత్తింది. ‘‘ఆస్ట్రేలియాలో ఏం చేశానో నాకు తెలుసు. ఎవరికో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మరొకరి ఘనతను తీసుకునే స్వభావం నాది కాదు. మైదానంలో, డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొన్ని విషయాలపై నేను నిర్ణయాలు తీసుకున్న మాట నిజం. కాని మరొకరు ఆ ఘనతను తీసుకున్నారు. మేం సిరీస్‌ గెలిచామన్నదే నాకు ముఖ్యం. అదో చరిత్రాత్మక సిరీస్‌. నాకెంతో ప్రత్యేకమైనది. చిరస్మరణీయ సిరీస్‌ విజయం తర్వాత ఈ ఘనత తీసుకున్న వాళ్లు ఎన్నో చెప్పుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఇది చేశాను’ లేదా ‘అది నా నిర్ణయం’ లేదా ‘ఫలానా మలుపునకు నేనే కారణం’ అన్నారు. అవన్నీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నా వరకు మైదానంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నాకు తెలుసు. వ్యూహాలపై జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడేవాళ్లం. కాని నాకు నవ్వొచ్చేది. అందుకే మైదానంలో నా పని నేను చేసేవాడిని. నా గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడను. గొప్పలు చెప్పుకోను. కాని ఆసీస్‌లో ఏం చేశానో నాకు తెలుసు. నా ప్రదర్శనపై విమర్శలు చేసేవాళ్లకు చిరునవ్వే నా సమాధానం. క్రికెట్‌ గురించి తెలిసినవాళ్లు అలా మాట్లాడరు. ఆసీస్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసీస్‌ పర్యటనకు ముందు, తర్వాత టెస్టుల్లో జట్టు విజయాల్లో నా భాగస్వామ్యం గురించి మాట్లాడదల్చుకోలేదు. ఆసీస్‌పై విజయం మాత్రం ప్రత్యేకం. ఆటను ఇష్టపడేవాళ్లు.. ప్రేమించేవాళ్లు హుందాగా మాట్లాడతారు. నా సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకముంది. బ్యాటింగ్‌ బాగా చేస్తున్నా. నాలో ఇంకా క్రికెట్‌ మిగిలే ఉందని నమ్ముతున్నా’’ అని రహానె వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని