IPL 2022 Auction: ఇషాన్‌.. జాక్‌పాట్‌ కొట్టెన్‌

ఇషాన్‌ కిషాన్‌ జాక్‌పాట్‌ కొట్టాడు.. ఐపీఎల్‌ మెగా వేలంలో అనూహ్య ధర దక్కించుకున్నాడు. లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో భారత ఆటగాడిగా ఇషాన్‌ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ.15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్‌ తనను తిరిగి దక్కించుకుంది. రూ.14 కోట్లతో దీపక్‌ చాహర్‌ తిరిగి చెన్నై గూటికే చేరాడు

Updated : 13 Feb 2022 07:22 IST

రూ.15.25 కోట్లకు తిరిగి దక్కించుకున్న ముంబయి

దీపక్‌ చాహర్‌కు రూ.14 కోట్లు.. అవేశ్‌ ఖాన్‌ రికార్డు
అనూహ్య ధర పలికిన హర్షల్‌, ప్రసిద్ధ్‌, హసరంగ
ఐపీఎల్‌ మెగా వేలం  

బెంగళూరు

ఇషాన్‌ కిషాన్‌ జాక్‌పాట్‌ కొట్టాడు.. ఐపీఎల్‌ మెగా వేలంలో అనూహ్య ధర దక్కించుకున్నాడు. లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో భారత ఆటగాడిగా ఇషాన్‌ చరిత్ర సృష్టించాడు. ఏకంగా రూ.15.25 కోట్లకు ముంబయి ఇండియన్స్‌ తనను తిరిగి దక్కించుకుంది. రూ.14 కోట్లతో దీపక్‌ చాహర్‌ తిరిగి చెన్నై గూటికే చేరాడు. భారీ అంచనాలతో వేలంలో అడుగుపెట్టిన శ్రేయస్‌ అయ్యర్‌ కోసం కోల్‌కతా రూ.12.25 కోట్లు ఖర్చు పెట్టింది. రూ.10 కోట్లు దక్కించుకున్న పేసర్‌ అవేశ్‌.. అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లలో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంచనాలకు తగ్గట్లుగా కొంతమంది ఆటగాళ్లపై రూ.కోట్ల వర్షం కురిస్తే.. మరి కొంతమంది క్రికెటర్లకు అనూహ్యమైన ధర పలికింది. మరోవైపు భారీ ధర పలుకుతారని ఆశించిన ఆటగాళ్లకు నిరాశ.. ఎంతో అనుభవం ఉన్న సీనియర్‌ ఆటగాళ్లకు మొండిచెయ్యి ఎదురైంది.

గత కొన్ని సీజన్లుగా ముంబయి ఇండియన్స్‌ తరపున నిలకడగా రాణించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషాన్‌ పంట పండింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా వేలంలో అతనికి అనూహ్య ధర దక్కింది. తొలి రోజైన శనివారం అతని కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో అడుగుపెట్టిన అతన్ని దక్కించుకోవడానికి పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోటీపడగా.. చివరకు ముంబయి సొంతం చేసుకుంది. ఎలాగైనా అతణ్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలనే పట్టుదల ప్రదర్శించిన ముంబయి అందుకు ఏకంగా రూ.15.25 కోట్లు చెల్లించింది. దీంతో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ (2015లో దిల్లీ క్యాపిటల్స్‌ రూ.16 కోట్లు) తర్వాత లీగ్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఇషాన్‌ రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే నాలుగో ఆటగాడిగా నిలిచాడు. గతంలో మోరిస్‌ (రూ.16.25 కోట్లు), యువరాజ్‌, కమిన్స్‌ (రూ.15.5 కోట్లు)కు అతనికంటే ఎక్కువ ధర దక్కింది. మరోవైపు ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో వికెట్లు సాధించే దీపక్‌ చాహర్‌ను తిరిగి సొంతం చేసుకోవడం కోసం సీఎస్కే ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో కెప్టెన్‌ ధోని (రూ.12 కోట్లు) కంటే అతను రూ.2 కోట్లు అదనంగా అందుకోనున్నాడు. కొత్త కెప్టెన్‌ కోసం చూస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శ్రేయస్‌ను రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. ప్రాధాన్య ఆటగాళ్ల జాబితాలో అతనికే ఎక్కువ ధర పలికింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తాచాటుతున్న శార్దూల్‌ కోసం దిల్లీ క్యాపిటల్స్‌ రూ.10.75 కోట్లు చెల్లించింది. మరోవైపు ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాళ్లలో పేసర్‌ అవేశ్‌కు అత్యధికంగా రూ.10 కోట్లు దక్కాయి. అతణ్ని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకుంది. గత రికార్డు కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు) పేరు మీద ఉంది. శనివారం మొత్తం 74 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలం ఆదివారం కూడా కొనసాగనుంది.

ఊహించని ధర..
వేలంలో కొంత మంది ఆటగాళ్లకు ఊహించని ధర దక్కింది. ముఖ్యంగా శ్రీలంక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వహిందు హసరంగ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా రూ.10.75 కోట్లు ఖర్చు పెట్టింది. గత ఏడాది సీజన్‌ రెండో అర్ధభాగం కోసం జంపా స్థానంలో ఆర్సీబీతో చేరిన హసరంగ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఈ లెగ్‌స్పిన్నర్‌ తన గూగ్లీలతో అంతర్జాతీయ క్రికెట్లో అదరగొట్టాడు. 2021లో టీ20ల్లో షంసితో కలిసి అత్యధిక వికెట్లు (36) తీసిన బౌలర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టింది అతనే. బ్యాటింగ్‌లోనూ భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతని సొంతం. దీంతో ఆర్సీబీ అతని కోసం అంత మొత్తం చెల్లించింది. గతేడాది ఐపీఎల్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన హర్షల్‌ పటేల్‌ కోసం కూడా ఆర్సీబీ రూ.10.75 కోట్లు చెల్లించింది. గతేడాది రూ.20 లక్షలకు అతణ్ని జట్టులోకి తీసుకున్న ఆర్సీబీ.. ఇప్పుడు ఇంత మొత్తంలో ఖర్చుపెట్టడం విశేషం. గత సీజన్‌లో పంజాబ్‌ తరపున గొప్పగా రాణించలేకపోయినా.. ఇటీవల ఫామ్‌ కూడా ఏమంత ఉత్తమంగా లేకపోయినా విండీస్‌ వికెట్‌కీపర్‌ నికోలస్‌ పూరన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.10.75 కోట్లు వెచ్చించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిడిలార్డర్‌ను పటిష్ఠం చేయడం కోసం పవర్‌ హిట్టింగ్‌ సామర్థ్యం ఉన్న అతని కోసం జట్టు భారీగా ఖర్చు పెట్టి ఉండొచ్చు. టీమ్‌ఇండియా తరపున నిలకడగా అదరగొడుతున్న పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. కివీస్‌ పేసర్‌ ఫెర్గూసన్‌ను గుజరాత్‌ రూ.10 కోట్లకు దక్కించుకుంది. రబాడ కోసం పంజాబ్‌ కింగ్స్‌ రూ.9.25 కోట్లు ఖర్చు పెట్టింది. అండర్‌-19 ప్రపంచకప్‌లో రాణించిన దక్షిణాఫ్రికా యువ బ్యాటర్‌ బ్రెవిస్‌ను ముంబయి రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.

ఏదో అనుకుంటే..
వేలంలో ఎంతో డిమాండ్‌ ఉంటుందని అనుకున్న విదేశీ ఆటగాళ్లు వార్నర్‌, హోల్డర్‌, కమిన్స్‌, మిచెల్‌ మార్ష్‌, డికాక్‌కు ఆశించిన దానికంటే తక్కువ మొత్తమే దక్కింది. వీళ్లలో ఒక్కరు కూడా రూ.10 కోట్లను చేరుకోలేదు. 2020 వేలంలో అనూహ్య ధర (రూ.15.50 కోట్లు)కు కమిన్స్‌ను దక్కించుకున్న కేకేఆర్‌.. ఈ సారి అందులో సగం రూ.7.25 కోట్లకు తిరిగి జట్టులో చేర్చుకుంది. డికాక్‌ను లఖ్‌నవూ రూ.6.75 కోట్లకే సొంతం చేసుకుంది. వార్నర్‌కు ఈ ఐపీఎల్‌ తీవ్రమైన డిమాండ్‌ ఉంటుందని అంతా భావించారు. కానీ అతని కోసం దిల్లీ రూ.6.25 కోట్లే వెచ్చించింది. దిల్లీ తరపునే ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన వార్నర్‌.. ఇన్నేళ్లకు మళ్లీ ఆ జట్టుతో చేరాడు. విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ కోసం రూ.12 కోట్ల వరకూ పెట్టేందుకు ఆర్సీబీ సిద్ధమైందన్న వార్తలు వచ్చాయి. కానీ తీరా వేలంలో చూస్తే ఆ జట్టు ఆసక్తి చూపలేదు. లఖ్‌నవూ అతణ్ని రూ.8.75 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా మొట్టమొదటి సారి టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మిచెల్‌ మార్ష్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ రూ.6.50 కోట్లకు కొనుగోలు చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌ను కేవలం రూ.4.2 కోట్లకే సన్‌రైజర్స్‌ తిరిగి సొంతం చేసుకుంది.

అటు సీనియర్లు.. ఇటు కుర్రాళ్లు
టీమ్‌ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్లు, యువ ఆటగాళ్లతో పాటు ఇప్పటివరకూ అంతర్జాతీయ అరంగేట్రం చేయని భారత కుర్రాళ్లకు వేలంలో మంచి ధర దక్కింది. భారత సీనియర్‌ ఆటగాళ్లు ధావన్‌ (రూ.8.25 కోట్లు), అశ్విన్‌ (రూ.5 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), చాహల్‌ (రూ.6.50 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌ (రూ.5.50 కోట్లు) తో పాటు వాషింగ్టన్‌ సుందర్‌ (రూ.8.75 కోట్లు), కృనాల్‌ పాండ్య (రూ.8.25 కోట్లు), రాహుల్‌ చాహర్‌ (రూ.5.25 కోట్లు), దేవ్‌దత పడిక్కల్‌ (రూ.7.75 కోట్లు), నితీశ్‌ రాణా (రూ.8 కోట్లు), దీపక్‌ హుడా (రూ.5.75 కోట్లు) కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. మరోవైపు ఇంకా భారత జట్టుకు ఆడని కుర్రాళ్లలో షారుక్‌ ఖాన్‌ (రూ.9 కోట్లు), రాహుల్‌ తెవాతియా (రూ.9 కోట్లు)కు భారీ ధర దక్కింది. రాహుల్‌ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), అభిషేక్‌ శర్మ (రూ.6.5 కోట్లు), శివమ్‌ మావి (రూ.7.25 కోట్లు) కూడా మంచి ధరకే అమ్ముడుపోయారు. విదేశీ ఆటగాళ్లలో హెట్‌మయర్‌ (రూ.8.50 కోట్లు), బౌల్ట్‌ (రూ.8 కోట్లు), మార్క్‌వుడ్‌ (రూ.7.50 కోట్లు), హేజిల్‌వుడ్‌ (రూ.7.75 కోట్లు), డుప్లెసిస్‌ (రూ.7 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు)కు మంచి మొత్తమే దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని