IPL 2022 Auction: ఇక వీళ్లు కనిపించరా!

ఐపీఎల్‌ మెగా వేలంలో కొంతమంది ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలితే.. మరికొంత మందికి తీవ్ర నిరాశ ఎదురైంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా ఫ్రాంఛైజీలను ఆకట్టుకోలేకపోయారు.

Updated : 15 Feb 2022 07:07 IST

దిల్లీ: ఐపీఎల్‌ మెగా వేలంలో కొంతమంది ఆటగాళ్లకు జాక్‌పాట్‌ తగిలితే.. మరికొంత మందికి తీవ్ర నిరాశ ఎదురైంది. అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా ఫ్రాంఛైజీలను ఆకట్టుకోలేకపోయారు. అందులో ముఖ్యంగా ఐపీఎల్‌ మేటిగా పేరు తెచ్చుకున్న సురేశ్‌ రైనా అమ్ముడవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లీగ్‌లో ప్రస్తుతం అత్యధిక పరుగులు (205 మ్యాచ్‌ల్లో 5,528) చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్న అతణ్ని కొనేందుకు ఏ జట్టూ ముందుకు రాలేదు. 35 ఏళ్ల అతను ఫిట్‌నెస్‌ పరంగా బాగానే ఉన్నాడు. కనీస ధర రూ.2 కోట్లకైనా అతణ్ని తిరిగి చెన్నై దక్కించుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్మిత్‌ కూడా ఫ్రాంఛైజీల దృష్టిలో పడలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌కూ మొండిచెయ్యే ఎదురైంది. గతేడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన అందుకు కారణం కావొచ్చు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో అడుగుపెట్టిన స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, ఇమ్రాన్‌ తాహిర్‌లకూ నిరాశ తప్పలేదు. కెప్టెన్‌గా గతేడాది ఆస్ట్రేలియాకు మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ అందించిన ఫించ్‌నూ ఫ్రాంఛైజీలు పట్టించుకోలేదు. కొంతకాలంగా అతని ప్రదర్శన పడిపోవడమే అందుకు కారణం. ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన డేవిడ్‌ మలన్‌ (ఇంగ్లాండ్‌) ఆటతీరు కూడా ఇటీవల చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అందుకే అతణ్ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఇక గత ఐపీఎల్‌ సీజన్‌లో సారథిగా కేకేఆర్‌ను ఫైనల్‌ చేర్చినప్పటికీ మోర్గాన్‌పై ఏ జట్టూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. పవర్‌ హిట్టర్‌గా పేరున్న ఆసీస్‌ బ్యాటర్‌ క్రిస్‌ లిన్‌, 2021లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హసరంగతో కలిసి అగ్రస్థానంలో ఉన్న స్పిన్నర్‌ షంసి (దక్షిణాఫ్రికా)లు కూడా ఫ్రాంఛైజీల కళ్లలో పడలేకపోయారు. ఒకప్పుడు ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ ఈ వేలానికే దూరమయ్యాడు. మరోవైపు ఐపీఎల్‌ ఆరంభం నుంచి లీగ్‌లో కొనసాగుతూ వస్తున్న భారత సీనియర్‌ ఆటగాళ్లు ఇషాంత్‌, అమిత్‌ మిశ్రా, పియూష్‌ చావ్లా, ధవల్‌ కులకర్ణి కూడా వేలంలో అమ్ముడుపోలేదు. 105 టెస్టులాడిన ఇషాంత్‌కు టీమ్‌ఇండియాలో అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఐపీఎల్‌ జట్లలోనూ చోటు దక్కకపోవడంతో అతని కెరీర్‌ ముగింపు దిశగా సాగేలా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని