IND vs WI: అదే జోరు..

అసలే టీమ్‌ఇండియా.. పైగా ఆడుతోంది సొంతగడ్డపై.. అవతలేమో నిలకడ లేమికి మారు పేరుగా మారిన వెస్టిండీస్‌..! ఇంకేముంది ప్రతి మ్యాచ్‌ ఏకపక్షమే అవుతోంది! ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసిన రోహిత్‌ సేన..

Updated : 17 Feb 2022 06:46 IST

టీ20ల్లోనూ తగ్గని రోహిత్‌ సేన

తొలి మ్యాచ్‌లో విండీస్‌పై ఘనవిజయం

మెరిసిన రవి, రోహిత్‌, సూర్య

కోల్‌కతా

అసలే టీమ్‌ఇండియా.. పైగా ఆడుతోంది సొంతగడ్డపై.. అవతలేమో నిలకడ లేమికి మారు పేరుగా మారిన వెస్టిండీస్‌..! ఇంకేముంది ప్రతి మ్యాచ్‌ ఏకపక్షమే అవుతోంది! ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసిన రోహిత్‌ సేన.. టీ20 సిరీస్‌నూ దూకుడుగా ఆరంభించింది. తొలి టీ20లో మొదట బంతితో.. ఆపై బ్యాటుతో ఆధిపత్యం చలాయించిన భారత్‌.. కరీబియన్‌ జట్టును అలవోకగా ఓడించింది. యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అరంగేట్రంలోనే అదరగొడితే.. మిగతా బౌలర్లూ అతడికి సహకరించారు. ఆపై కెప్టెన్‌ రోహిత్‌ ఛేదనను ముందుండి నడిపిస్తే.. కిషన్‌, సూర్యకుమార్‌ కూడా సత్తా చాటి జట్టును గెలిపించారు.

భారత పర్యటనలో తొలి విజయం కోసం వెస్టిండీస్‌కు నిరీక్షణ తప్పట్లేదు. వన్డే సిరీస్‌లో వైట్‌ వాష్‌కు గురైన ఆ జట్టుకు టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ ఓటమి రుచి చూపింది టీమ్‌ఇండియా. బుధవారం తొలి టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పూరన్‌ (61; 43 బంతుల్లో 4×4, 5×6) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాడు, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవి బిష్ణోయ్‌  (2/17)తో పాటు హర్షల్‌ పటేల్‌ (2/37) కూడా సత్తాచాటాడు. ఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ అంటే చాలు రెచ్చిపోయే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4×4, 3×6) మరోసారి చెలరేగాడు. సూర్యకుమార్‌ (34 నాటౌట్‌; 18బంతుల్లో 5×4, 1×6), వెంకటేశ్‌ అయ్యర్‌ (24 నాటౌట్‌; 13 బంతుల్లో 2×4, 1×6) కలిసి అయిదో వికెట్‌కు అజేయంగా 48 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఛేజ్‌ (2/14) ఆకట్టుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరుగుతుంది.

మధ్యలో తడబడ్డా..: ఛేదనలో భారత్‌కు గొప్ప ఆరంభం దక్కింది. రోహిత్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఏ బౌలర్‌నూ లక్ష్యపెట్టని అతను ఉన్నంతసేపు పుల్‌, లాఫ్టెడ్‌ షాట్లు.. డ్రైవ్‌లతో బౌండరీల వేటలో దూసుకెళ్లాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ చివరి బంతికి సిక్సర్‌తో విధ్వంసం మొదలెట్టి నిలకడగా ఊచకోత కొనసాగించాడు. స్మిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టిన అతను.. చివరి మూడు బంతులకు వరుసగా 6, 4, 6 దంచాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులొచ్చాయి. వెంటనే స్పిన్నర్‌ను పొలార్డ్‌ రంగంలోకి దింపినా దంచడంలో ఏం మార్పు రాలేదు. ఈ సారి ఇషాన్‌ (35) కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో 5 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. ఆ దశలో బంతి అందుకున్న ఛేజ్‌.. కాస్త కట్టడి చేశాడు. తన రెండో ఓవర్లో రోహిత్‌ను పెవిలియన్‌ చేర్చి తొలి అంతర్జాతీయ టీ20 వికెట్‌ సాధించాడు. అర్ధశతకం దిశగా దూసుకెళ్లిన రోహిత్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిడ్‌వికెట్లో బౌండరీ దగ్గర స్మిత్‌కు చిక్కాడు. దీంతో 64 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఇషాన్‌, కోహ్లి (17) కలిసి జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేయడంతో 10 ఓవర్లకు జట్టు 80/1తో నిలిచింది. లక్ష్యం దిశగా సాగుతున్న జట్టుకు వరుస ఓవర్లలో దెబ్బపడింది. గేరు మారుద్దామనుకున్న ఇషాన్‌ను ఛేజ్‌.. ఆ వెంటనే కోహ్లీని అలెన్‌ (1/23) వెనక్కిపంపారు. భారీషాట్‌ ఆడి బంతిని బౌండరీ దాటించాననే నమ్మకంతోనే కనిపించిన కోహ్లి.. లాంగాఫ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కడంతో నిరాశగా వెనుదిరిగాడు. కానీ సూర్యకుమార్‌ వరుస ఫోర్లతో దూసుకెళ్లాడు. పేలవ షాట్‌కు పంత్‌ (8) నిష్క్రమించడంతో భారత్‌ 114/4తో ఇబ్బందుల్లో పడింది. కానీ క్లిష్ట పరిస్థితుల్లో సూర్య బలంగా నిలబడ్డాడు. వెంకటేశ్‌తో కలిసి జట్టును నడిపించాడు. జట్టు విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 32 పరుగులు అవసరం కావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 17వ ఓవర్‌ చివరి రెండు బంతులకు వరుసగా 4, 6 సిక్సర్‌ బాదిన సూర్య మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌ వైపు తిప్పాడు. వెంకటేశ్‌ ఓ ఫోర్‌ కొట్టడంతో 18వ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. దీంతో విజయ  సమీకరణం (12 బంతుల్లో 9) తేలిగ్గా మారింది. సూర్య, వెంకటేశ్‌ కలిసి మ్యాచ్‌ను చివరి ఓవర్‌  వరకూ వెళ్లనివ్వలేదు. వెంకటేశ్‌ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

బిష్ణోయ్‌ మాయ.. నిలిచిన పూరన్‌: అంతకుముందు వెస్టిండీస్‌ బ్యాటర్లను మధ్య ఓవర్లలో భారత బౌలర్లు గొప్పగా కట్టడి చేశారు. ముఖ్యంగా కొత్త స్పిన్నర్‌ బిష్ణోయ్‌ ఆకట్టుకున్నాడు. కానీ మరో ఎండ్‌లో నిలబడ్డ పూరన్‌తో పాటు పొలార్డ్‌ (24 నాటౌట్‌) సత్తాచాటి జట్టుకు మంచి స్కోరు అందించారు. భువనేశ్వర్‌ (1/31) తన స్వింగ్‌తో తొలి ఓవర్లోనే కింగ్‌ (4)ను ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ పూరన్‌ జతగా మరో ఓపెనర్‌ మేయర్స్‌ (31) బౌండరీలతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆ జట్టు ఆరు ఓవర్లలో 44/1తో నిలిచింది. చాహల్‌ తన తొలి ఓవర్లోనే మేయర్స్‌ను ఔట్‌ చేసి జట్టుకు ఉపశమనాన్ని అందించాడు. ఓ వైపు పూరన్‌ నిలబడడంతో.. 10 ఓవర్లకు స్కోరు 71/2. ఈ దశలో గూగ్లీలతో అదరగొట్టిన బిష్ణోయ్‌.. విండీస్‌కు కళ్లెం వేశాడు. మొదట కాస్త ఒత్తిడిలో కనిపించిన బిష్ణోయ్‌.. తన రెండో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజ్‌ (4)ను పెవిలియన్‌ చేర్చి తొలి అంతర్జాతీయ వికెట్‌ సాధించిన అతను.. ఊరించే బంతితో పావెల్‌ (2) కథను ముగించాడు. 15 ఓవర్లకు ఆ జట్టు స్కోరు.. 96/5. 11 నుంచి 15 ఓవర్ల మధ్య ఆ జట్టుకు 25 పరుగులే వచ్చాయి. కానీ క్రీజులో కుదురుకున్న పూరన్‌ జోరు పెంచడం, చివర్లో పొలార్డ్‌ కూడా కొన్ని షాట్లువాడటంతో స్కోరు 150 దాటింది.

కుర్రాడు.. అదరగొట్టాడు

టీమ్‌ఇండియాకు ఆడాలనే కల నిజం చేసుకున్న 21 ఏళ్ల స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌.. అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టాడు. సీనియర్‌ స్పిన్నర్‌ చాహల్‌ నుంచి టోపీ అందుకున్న అతను.. భారత్‌ తరపున టీ20ల్లో ఆడిన 95వ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్‌లో తన లెగ్‌ స్పిన్‌ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టాడు. మొదట కాస్త ఒత్తిడిలో కనిపించిన అతను వైడ్లు వేశాడు. కానీ ఒక్కసారి పిచ్‌ పరిస్థితులకు అలవాటు పడ్డాక విండీస్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లతో ప్రత్యర్థికి అడ్డుకట్ట వేశాడు. ఆత్మవిశ్వాసంతో బౌలింగ్‌ చేసిన అతను తన కోటా నాలుగు ఓవర్లలో 17 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్‌గా నిలిచి వెలుగులోకి వచ్చిన బిష్ణోయ్‌.. ఆ కుర్రాళ్ల జట్టు నుంచి టీమ్‌ఇండియా అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గత రెండు సీజన్లలో ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున అతను మెరిశాడు. రవి సత్తాను గుర్తించిన కొత్త ఐపీఎల్‌ జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ వేలానికి ముందే రూ.4 కోట్లకు అతణ్ని సొంతం చేసుకుంది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: కింగ్‌ (సి) సూర్యకుమార్‌ (బి) భువనేశ్వర్‌ 4; మేయర్స్‌ ఎల్బీ (బి) చాహల్‌ 31; పూరన్‌ (సి) కోహ్లి (బి) హర్షల్‌ 61; ఛేజ్‌ ఎల్బీ (బి) బిష్ణోయ్‌ 4; పావెల్‌ (సి) వెంకటేశ్‌ (బి) బిష్ణోయ్‌ 2; అకీల్‌ (సి) అండ్‌ (బి) దీపక్‌ 10; పొలార్డ్‌ నాటౌట్‌ 24; ఒడియన్‌ స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) హర్షల్‌ 4; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 157; వికెట్ల పతనం:1-4, 2-51, 3-72, 4-74, 5-90, 6-135, 7-157;  బౌలింగ్‌:భువనేశ్వర్‌ 4-0-31-1; దీపక్‌ చాహర్‌ 3-0-28-1; హర్షల్‌ 4-0-37-2; చాహల్‌ 4-0-34-1; రవి బిష్ణోయ్‌ 4-0-17-2; వెంకటేశ్‌ 1-0-4-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్మిత్‌ (బి) ఛేజ్‌ 40; ఇషాన్‌ (సి) అలెన్‌ (బి) ఛేజ్‌ 35; కోహ్లి (సి) పొలార్డ్‌ (బి) అలెన్‌ 17; పంత్‌ (సి) స్మిత్‌ (బి) కాట్రెల్‌ 8; సూర్యకుమార్‌ నాటౌట్‌ 34; వెంకటేశ్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 162;వికెట్ల పతనం: 1-64, 2-93, 3-95, 4-114;  బౌలింగ్‌: కాట్రెల్‌ 4-0-35-1; షెపర్డ్‌ 3-0-24-0; స్మిత్‌ 2-0-31-0; అకీల్‌ 4-0-34-0; ఛేజ్‌4-0-14-2; అలెన్‌ 1.5-0-23-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని