Sakibul Gani: తొలి మ్యాచ్‌లోనే 341 పరుగులు

అరంగేట్ర మ్యాచ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేస్తే వాహ్వా అంటారు.. అదే డబుల్‌ సెంచరీ సాధిస్తే వారెవ్వా అని పొగిడేస్తారు. మరి త్రిశతకం సాధిస్తే..! బిహార్‌ కుర్రాడు సకిబుల్‌ గని (341; 405 బంతుల్లో 56×4, 2×6) ఆ అద్భుతాన్ని అందుకున్నాడు

Updated : 19 Feb 2022 07:10 IST

సకిబుల్‌ ప్రపంచ రికార్డు
రంజీ ట్రోఫీ

కోల్‌కతా: అరంగేట్ర మ్యాచ్‌లో ఓ ఆటగాడు సెంచరీ చేస్తే వాహ్వా అంటారు.. అదే డబుల్‌ సెంచరీ సాధిస్తే వారెవ్వా అని పొగిడేస్తారు. మరి త్రిశతకం సాధిస్తే..! బిహార్‌ కుర్రాడు సకిబుల్‌ గని (341; 405 బంతుల్లో 56×4, 2×6) ఆ అద్భుతాన్ని అందుకున్నాడు. తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఏకంగా త్రిశతకం బాది.. ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్ర మ్యాచ్‌లో ఆ ఘనత అందుకున్న మొదటి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ప్లేట్‌ గ్రూప్‌లో మిజోరాం జట్టుతో మ్యాచ్‌లో అతడు చెలరేగిపోయాడు. మ్యాచ్‌ తొలి రోజే శతకం సాధించిన 22 ఏళ్ల సకిబుల్‌.. శుక్రవారం మరింతగా చెలరేగాడు. 136 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన అతను.. బౌండరీల వేటలో దూసుకెళ్లాడు. మొత్తం 56 ఫోర్లు బాదాడు. రికార్డులు బద్దలు కొట్టాడు. మరో వైపు బాబుల్‌ కుమార్‌ (229 నాటౌట్‌; 398 బంతుల్లో 27×4, 1×6) అజేయ ద్విశతకంతో సత్తాచాటడంతో బిహార్‌ తొలి ఇన్నింగ్స్‌ను 686/5 వద్ద డిక్లేర్‌ చేసింది. సకిబుల్‌, బాబుల్‌ కలిసి నాలుగో వికెట్‌కు 538 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మిజోరాం 40/3తో రెండో రోజు ఆట ముగించింది. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా గత రికార్డు కూడా భారత క్రికెటర్‌ పేరు మీదే ఉంది. 2018లో మధ్యప్రదేశ్‌ ఆటగాడు అజయ్‌ రొతేరా హైదరాబాద్‌పై 267 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డును సకిబుల్‌ తిరగరాశాడు. 2019లో అతను లిస్ట్‌- ఎ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది దేశవాళీ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని