Updated : 20 Feb 2022 06:54 IST

Ajinkya Rahane - Cheteshwar Pujara: మళ్లీ వస్తారా!

ఆజింక్య రహానె.. చతేశ్వర్‌ పుజారా.. భారత టెస్టు జట్టుకు చాలా ఏళ్లుగా మూలస్తంభాల్లా నిలిచిన ఆటగాళ్లు! ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్లు! కానీ శ్రీలంకతో త్వరలో సొంతగడ్డపై జరగబోయే టెస్టు సిరీస్‌కు వీళ్లిద్దరికి చోటు దక్కలేదు. ఫామ్‌తో తంటాలు పడుతున్న రహానె, పుజారాలను జట్టు నుంచి తప్పించాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నా, వారికి అవకాశమిస్తూ వచ్చిన సెలక్టర్లు.. ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ వెటరన్‌ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రాగలరా అన్నదే ఇప్పడు ప్రశ్న! ఎందుకంటే 34 ఏళ్ల పుజారా, 33 ఏళ్ల రహానె లయ కోల్పోయి చాలా రోజులైంది. కానీ సీనియర్‌ ఆటగాళ్లని.. గతంలో ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారన్న కారణంతో అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు. ఒక పక్క శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి కుర్రాళ్లు జట్టు తలుపు తడుతున్నా వీరిని పక్కకు పెట్టలేక జట్టు యాజమాన్యం కూడా చాలా ఇబ్బంది పడింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనే అందుకు నిదర్శనం. అక్కడ టెస్టు సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్‌ బ్యాటర్లు అయిదింట్లో విఫలమయ్యారు. 22.66 సగటుతో రహానె 136 పరుగులు చేస్తే.. పుజారా 20.66 సగటుతో 124 పరుగులే సాధించగలిగాడు. క్రీజులో కుదురుకోవడానికి బాగా సమయం తీసుకుంటూ.. బంతులు తింటూ తీరా కచ్చితంగా పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు పేలవంగా ఔట్‌ కావడం పుజారాకు బలహీనతగా మారింది. క్రీజు వదిలి ముందుకొస్తూ లైన్‌ తప్పి బౌల్డ్‌ కావడం లేదా కవర్స్‌, మిడాఫ్‌లో క్యాచ్‌గా వెనుదిరిగడం అతడికి మామూలైంది. మరోవైపు ఆఫ్‌ స్టంప్‌ లోగిలిలో పడుతున్న బంతులను అంచనా వేయడంలో విఫలమై ఎక్కువగా స్లిప్‌లలో క్యాచ్‌లు ఇస్తున్నాడు రహానె. ఫుట్‌ వర్క్‌ విషయంలోనూ అతడు మునుపటిలా బలంగా లేడు. 95 టెస్టులు ఆడిన పుజారా.. 82 టెస్టులు ఆడిన రహానె ఒక్కోసారి అనుభవం లేని కుర్రాళ్ల మాదిరి వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఒత్తిడికి తలొగ్గుతున్నారు. అయితే ఎంత విఫలమైనా రహానె-పుజారాలను తుది జట్టు నుంచి మాత్రమే తప్పించారు తప్ప.. జట్టులోనే స్థానం కల్పించకపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కుర్రాళ్ల నుంచి పోటీ తట్టుకుని మళ్లీ పునరాగమనం చేయాలంటే రహానె, పుజారాకు అంత తేలికేం కాదు. ఫామ్‌ కోసం మళ్లీ రంజీ బాట పట్టిన వీరిద్దరూ ఎంత గొప్పగా రాణించినా.. సెలక్టర్ల భవిష్యత్‌ ప్రణాళికల్లో ఉంటారా అనేది అనుమానమే. పుజారా, రహానె మాత్రమే కాదు పేలవ ఫామ్‌లో ఉన్న పేసర్‌ ఇషాంత్‌శర్మ, గాయాలతోనే ఇన్నాళ్లూ నెట్టుకొస్తున్న వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాలకు కూడా లంకతో టెస్టు సిరీస్‌కు చోటు దక్కలేదు. జట్టులో సిరాజ్‌ లాంటి యువ పేసర్లు దూసుకు రావడం ఇషాంత్‌కు ద్వారాలు మూసేస్తే.. గాయాలు, ఫిట్‌నెస్‌ లేమి సాహా అవకాశాలను దెబ్బ కొట్టాయి. వీళ్దిద్దరిని టెస్టు జట్టులో ఇక దాదాపు చూడనట్టే!

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని