Team India: రహానె, పుజారాలపై వేటు

ఊహించిందే జరిగింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆజింక్య రహానె, చతేశ్వర్‌ పుజారాలపై వేటు పడింది. మార్చి 4న స్వదేశంలో శ్రీలంకతో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు ఈ

Updated : 20 Feb 2022 06:50 IST

కోహ్లి, పంత్‌లకు విశ్రాంతి

టెస్టుల్లోనూ కెప్టెన్‌గా రోహిత్‌

శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు

దిల్లీ

ఊహించిందే జరిగింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆజింక్య రహానె, చతేశ్వర్‌ పుజారాలపై వేటు పడింది. మార్చి 4న స్వదేశంలో శ్రీలంకతో ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌కు ఈ సీనియర్‌ బ్యాటర్లను సెలక్టర్లు భారత జట్టుకు ఎంపిక చేయలేదు. టెస్టు జట్టుకు రోహిత్‌శర్మను అధికారికంగా కెప్టెన్‌గా ప్రకటించిన సెలక్టర్లు... రిషబ్‌ పంత్‌తో పాటు ఆంధ్ర కుర్రాడు కేఎస్‌ భరత్‌కు కూడా చోటిచ్చారు. చేతన్‌ శర్మ సారథ్యంలో శనివారం సమావేశమైన సెలక్షన్‌ కమిటీ లంకతో టెస్టు సిరీస్‌తో పాటు దాని కన్నా ముందు జరిగే మూడు టీ20ల సిరీస్‌కు కూడా జట్లను ప్రకటించింది. ‘‘రహానె, పుజారా గురించి సెలక్షన్‌ కమిటీ చాలాసేపు చర్చించింది. లంక పర్యటనకు పరిగణించబోవట్లేదని వాళ్లకు చెప్పాం. కానీ వారికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి. అందుకే రంజీల్లో ఆడామని సూచించాం’’ అని చేతన్‌ శర్మ చెప్పాడు. సీనియర్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాతో పాటు వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మలను కూడా టెస్టు జట్టుకు ఎంపిక చేయలేదు. గాయాలతో బాధపడుతున్న కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేసినా..అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే తుది జట్టులోకి ఎంపిక చేయనున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు జట్టులో చోటు దక్కలేదు. రెండో టెస్టు నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తే అతడిని జట్టులో చేర్చే అవకాశాలున్నాయి.

బబుల్‌ వీడిన కోహ్లి, పంత్‌: ఎడతెరిపి లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌లకు సెలక్టర్లు పది రోజుల విరామం ఇచ్చారు. వెస్టిండీస్‌తో శనివారం రెండో టీ20 ముగిసిన వెంనే బయో బబుల్‌ వీడి వాళ్లిద్దరూ ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆదివారం జరిగే సిరీస్‌లో ఆఖరిదైన మూడో టీ20తో పాటు ఈనెల 24న శ్రీలంకతో ఆరంభమయ్యే మూడు టీ20 సిరీస్‌కు ఈ స్టార్‌ బ్యాటర్లు దూరం కానున్నారు. ‘‘శనివారం వెస్టిండీస్‌తో రెండో టీ20 ముగిసిన వెంటనే కోహ్లి, పంత్‌ ఇంటికి వెళ్లిపోయారు. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు దఫ దఫాలుగా విశ్రాంతి ఇవ్వాలన్న బీసీసీఐ నియమం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆటగాళ్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రెండో టీ20లో చెరో 52 పరుగులు చేసిన విరాట్‌, పంత్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్చి 4న మొహాలీలో తొలి టెస్టు ఆరంభమయ్యే సమయానికల్లా కోహ్లి, పంత్‌ జట్టులో చేరతారు. ఈ మ్యాచ్‌ విరాట్‌ కెరీర్‌లో 100వ టెస్టు కావడం విశేషం. బెంగళూరులో మార్చి 12న రెండో టెస్టు ఆరంభం కానుంది. కోహ్లి, పంత్‌ లేకపోవడం తప్పించి లంకతో ఆడే టీ20 జట్టులో పెద్దగా మార్పులు లేవు. ఫిబ్రవరి 24న లఖ్‌నవూలో తొలి టీ20 జరగనుండగా.. 26, 27 తేదీల్లో జరిగే రెండో, మూడో టీ20లకు ధర్మశాల వేదికగా నిలవనుంది.

అతడొక్కడే కొత్త ముఖం: శ్రీలంకతో తలపడే 18 మంది సభ్యుల టెస్టు జట్టులో సౌరభ్‌ కుమార్‌ ఒక్కడే కొత్త ముఖం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఈ స్లో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ ఇప్పటిదాకా 46 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 196 వికెట్లు పడగొట్టాడు. అతడు 16సార్లు అయిదు వికెట్లు, ఆరుసార్లు పది వికెట్ల ప్రదర్శనలు చేశాడు.

భారత జట్లు... టెస్టు: రోహిత్‌ (కెప్టెన్‌), మయాంక్‌, ప్రియాంక్‌ పాంచల్‌, కోహ్లి, శ్రేయస్‌, విహారి, శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, జడేజా, జయంత్‌, కుల్‌దీప్‌, బుమ్రా, షమి, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, సౌరభ్‌ కుమార్‌. టీ20: రోహిత్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌, కిషన్‌, సూర్యకుమార్‌, శ్రేయస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, హుడా, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌, సిరాజ్‌, శాంసన్‌, చాహల్‌, జడేజా, కుల్‌దీప్‌, అవేష్‌; రవి బిష్ణోయ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని